Monday, May 5, 2025

అత్యాశ…

- Advertisement -

కోసలపురం అనే గ్రామంలో రామయ్య, భీమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు.
వారికి ఉన్న చెరో ఎకరం భూమిలో ఎన్నో చెట్లు నాటుతూ వ్యవసాయం చేసేవారు.
ఆ చెట్ల పండ్లు, కూరగాయల ద్వారా వచ్చే డబ్బుతో వారి జీవితం గడిచేది. కానీ ఆ డబ్బుతో భీమయ్య తప్తి పడేవాడు కాదు.
ఒకనాడు భీమయ్య పక్క ఊరిలో సంతకు కూరగాయలు తీస్కుని వెళ్ళాడు. పక్కన అతని చిన్ననాటి మిత్రుడ్ని చూశాడు. చాలా రోజుల తర్వాత కలిసిన మిత్రుడ్ని ఆలింగనం చేసుకుని, అతడు దర్జాగా విలాసవంతంగా ఉండటం చూసి, ”ఇంతకీ నీవు ఏం చేస్తున్నావు, ఇంత డబ్బు ఎలా సంపదించావు” అని ఆ మిత్రుడ్ని అడుగుతాడు భీమయ్య.
అప్పుడు అతను భీమయ్యతో ”నేను పల్లెలో కొన్న విలువైన చెట్ల కట్టెల్ని పట్నంలో అమ్మి ఇలా ధనవంతుడిని అయ్యాను” అని చెపుతాడు.
అప్పుడు భీమయ్య అలానా అని తన మిత్రుడికి వీడ్కోలు చెప్పి సంత ముగించుకుని ఇంటికి వెళ్తాడు.
ఆ రాత్రి భీమయ్యకి ఒక ఆలోచన తడుతుంది.
తను ఎన్ని రోజులు ఇలా చాలీచాలని డబ్బుతో బతకడం, తన మిత్రుడిలా శీఘ్రంగా ధనవంతుడు కావాలని భావించి తన పొలంలో ఉన్న చెట్లన్నిటిని నరికి వాటి కట్టల్ని అమ్మేద్దాం అనుకుంటాడు.
మరుసటి రోజు నుండి చెట్లన్నీ నరికి తన మిత్రుడికి ఆ కట్టేల్ని అమ్మేసి డబ్బు సంపాదించాడు.
ఒకనాడు భీమయ్య అనారోగ్య సమస్యతో మంచాన పడ్డాడు.
అతడిని చూడటానికి రామయ్య వచ్చాడు.
రామయ్య కూడా ధనవంతుడిగా రావడం చూసి భీమయ్య ఆశ్చర్యపోయాడు.
రామయ్య భీమయ్యని చూసి ”భీమయ్యా… డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్షం చేశావు. ఈ రోజు చెట్లని నరికి కట్టెలను అమ్మి డబ్బు సంపాదించావు. ఆ చెట్లన్నీ అయిపోయాయి. ఇక ఇప్పుడు ఎలా సంపాదిస్తావు. ఆశకి పోయి ఉన్న మంచి వ్యవసాయాన్ని కోల్పోయావు.
ఇప్పుడు నేను పొద్దున లేసి పొలానికి వెళ్ళగానే శరీరానికి కావాల్సిన ప్రాణవాయువును చెట్ల ద్వారా ఎంతో పొందుతాను. నీరు పెట్టడం మాత్రమే నా పెట్టుబడి. ప్రతి వారం సంతలో కూరగాయలు, పండ్ల ద్వారా ఎంతో డబ్బు సంపాదిస్తున్నాను. నా కుటుంబం అంతా కూడా మా పొలంలో పండే కూరగాయలని తింటూ ఆరోగ్యంగా ఉన్నాం.
ఒకేసారి ధనవంతుడు కావాలనే నీ ఆశ నిన్ను ఇలా అనారోగ్య పరిస్థితుల్లోకి తీసుకొని వచ్చింది” అన్నాడు రామయ్య.
రామయ్య మాటలు విన్న భీమయ్య ఎంతో బాధ పడ్డాడు.
రామయ్యా తన వెంట తెచ్చిన పొలంలోని కూరగాయలు, పండ్లు భీమయ్యకి ఇచ్చి వెళ్లాడు.
భీమయ్య తను చేసిన తప్పు తెలుసుకుని తను ఆరోగ్యవంతుడు అవ్వగానే తిరిగి వ్యవసాయాన్ని మొదలుపెడతాడు. మళ్ళీ కూరగాయలు, పండ్లు సంతలో అమ్ముకుంటూ ఆనంద జీవితాన్ని పొందాడు.
శారద అభిలాష్‌, ఎండపల్లి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -