Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeమానవిస్వతంత్ర పోరులో తెలంగాణ ఆడబిడ్డ‌లు

స్వతంత్ర పోరులో తెలంగాణ ఆడబిడ్డ‌లు

- Advertisement -

భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో ముఖ్యంగా హైదరాబాద్‌ రాజ్యంలో ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాల సంకెళ్లతో స్త్రీల జీవితాలు దుర్లభంగా ఉండేవి. చాలా మందికి చదువుకోవడానికి అవకాశమే లేదు. అలాంటి పరిస్థితుల్లో కొందరు మహిళలు సమానత్వం కోసం పోరాడుతూనే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించారు. అనేక ఉద్యమాల్లో భాగస్వాముల య్యారు. నాటి సామాజిక కట్టుబాట్లను ఛేదించుకుని, ధైర్యంగా అడుగు బయటపెట్టారు. పోరాటాలు చేశారు. సంఘాలుగా ఏర్పడి రాజకీయ హక్కుల కోసం ఉద్యమించారు. స్త్రీల స్థితిగతులను మెరుగుపరించేందుకు నడుంబిగించారు. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అలాంటి వీర వనితల గురించి వారి పోరాట పటిమ గురించి ఓ సారి మననం చేసుకుందాం… వారి స్ఫూర్తితో అడుగులు ముందుకు వేద్దాం…

హైదరాబాద్‌ రాజ్యంలో మహిళలు వివిధ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మహిళను చైతన్య పరిచేందుకు అనేక సంస్థలు ఆవిర్భవించాయి. ఆంధ్ర యువతీ మండలి, లేడీ హైదరీ క్లబ్‌, సోదరీ సమాజం, ఆంధ్ర మహాసభ వంటి సంస్థలు మహిళల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, టి.ఎన్‌.సదాలక్ష్మి, సంగం లక్ష్మీబాయి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి వారు సంఘ సంస్కరణ కోసం ఎంతో పాటుపడ్డారు.
మహిళా అభ్యున్నతికై…
రూప్‌ఖాన్‌పేట రత్నదేశాయి తన సాహిత్యంతో వితంతువులకు హాస్టళ్లు నెలకొల్పారు. అఘోరనాథ ఛటోపాధ్యాయ భార్య వరద సుందరీ దేవి నాంపల్లిలో బాలికల పాఠశాలను ప్రారంభించారు. 1917లో వీర రాఘవమ్మ, నడింపల్లి సుందరమ్మ ఆంధ్ర సోదరీ సమాజాన్ని ఏర్పాటు చేసి కృషి చేశారు. 1922లో ది ఉమెన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ సోషల్‌ అడ్వాన్స్‌మెంట్‌ అనే సంస్థ ఏర్పడింది. 1907లో భారత మహిళా సమాజం ఏర్పడింది. ఇది హైదరాబాద్‌లో ఏర్పడిన మొదటి స్త్రీ సంఘం. మార్గరెట్‌ కజిన్స్‌, అమీనా బేగం, హైదరాబాద్‌ రుస్తుంజీ, ఫర్దూన్‌, సరోజినీ నాయుడు మొదలైన వారు 1916లో హైదరాబాద్‌ ఉమెన్స్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ స్థాపించారు.
సంస్థలుగా ఏర్పడి
1930లో ఏర్పడిన ఆంధ్ర మహాసభలో భాగంగా ఆంధ్ర మహిళా సభ ప్రారంభమై దాదాపు 13 సమావేశాలు నిర్వహించారు. ప్రతి సమావేశంలో స్త్రీల సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి కమ్యూనిస్టు మహిళలు కూడా దేశ స్వాతంత్య్రం కోసం ఇందులో భాగస్వాములయ్యారు. 1935లో ఎల్లాప్రగడ సీతాకుమారి, ఇల్లందుల సరస్వతీదేవి వంటి వారు కలిసి ఆంధ్ర యువతీ మండలి స్థాపించారు. అలాగే అంజుమన్‌-ఇ-ఖవాతిక్‌ దక్కన్‌, అంజుమన్‌-ఇ-ఇస్తాం, లేడీ హైదరీ క్లబ్‌, లేడీ బర్దన్స్‌ క్లబ్‌, అంజుమన్‌-ఇ-సిరజుల్‌ ఖవాతిక్‌ వంటి సంస్థలు కూడా ఏర్పాటు చేసుకుని ముస్లిం మహిళలు స్వాతంత్రోద్యమంలో భాగస్వాములయ్యారు. 1930లో దుర్గాబాయి దేశ్‌ముక్‌ ఆంధ్ర మహిళా సంఘాన్ని ప్రారంభించారు. ఈ సంస్థలన్నీ మహిళల విద్య, అభివృద్ధికోసం ఎంతగానే పాటుబడ్డాయి. 1947లో జరిగిన సత్యాగ్రహౌద్యమంలో అహల్యాబాయి, విమలా మెల్కొటే, కమలమ్మ పాల్గొన్నారు.

ఆరుట్ల కమలాదేవి
తెలంగాణలో ప్రస్తుత యాదాద్రి-భువనగిరి జిల్లా మంతపురిలో పల్ల వెంకటరాంరెడ్డి, లక్ష్మీ నరసమ్మలకు 1920 జూన్‌లో కమలాదేవి జన్మించారు. అసలు పేరు రుక్మిణి. ఆమెకు పన్నెండో ఏట ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహమైంది. భర్త గాంధేయవాది. వరకట్నం తీసుకోలేదు కానీ, పెళ్ళి సమయంలో వధూవరులకు ఖద్దరు వస్త్రాలే ఇవ్వాలనీ, వివాహం తరువాత అమ్మాయిని హైదరాబాద్‌ పంపించి చదివించాలనీ మామగారికి స్పష్టం చేశారు. తన భార్య విద్యావంతురాలై దేశ సేవ చేయాలనేది ఆయన వాంఛ. అందుకే కమలాదేవి అని నామకరణం చేశారు. భారత స్వాతంత్రోద్యమ యోధురాలుగా, తెలంగాణ సాయుధ పోరాట వీరురాలిగా ఘనకీర్తి సాధించిన నాయకురాలు ఆరుట్ల కమలాదేవి. అంతేకాదు, ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో తొలి ప్రతిపక్ష నాయకురాలు కూడా. ఆమెది అర్థ శతాబ్దం పై చిలుకు పోరాట చరిత్ర.

సరోజినీ నాయుడు
ఈమె 1879, ఫిబ్రవరి 12న బెంగాల్‌లో జన్మించారు. వీరి కుటుంబం 1878లోనే హైదరాబాద్‌ వలస వచ్చింది. ఇంగ్లండ్‌లో చదువుకొని స్వదేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తిరిగి వచ్చారు. భారతీయ స్త్రీల రాజకీయ సమానత్వం కోసం పోరాడారు. లండన్‌లో జరిగిన రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి గాంధీజీతో పాటు హాజరయ్యారు. 1905లో బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 1925లో కాన్పుర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించారు. హైదరాబాద్‌లోని సరోజినీ నాయుడు స్వగృహం హిందూ ముస్లిం మైత్రికి ఆలయంగా ఉండేది. ఆమె తదనంతరం ఆ ఇంటిని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి ఇచ్చారు.


సుగ్రా హుమాయూన్‌ మీర్జా
ఈమె 1882, డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జన్మించారు. 1902 నుండి స్త్రీల కోసం కృషి చేశారు. 1912లో బేగం ఖేదివ్‌జంగ్‌తో కలిసి అంజుమన్‌-ఇ-ఖవాతిక్‌ దక్కన్‌ను స్థాపించి మూడేండ్లు కార్యదర్శిగా పని చేశారు. ఈ సంస్థ రెండు బాలికల పాఠశాలలను స్థాపించింది.1920లో హైదరాబాద్‌ టెక్ట్స్‌ గౌరవ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.1923లో ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ మోరల్‌ ఎడ్యుకేషన్‌(లండన్‌) భారత గౌరవ సభ్యురాలిగా నియమితులయ్యారు. హిందూ ముస్లిం ఐక్యతపై, సాంఘిక దురాచారాలు ముఖ్యంగా పరదా పద్ధతిని వ్యతిరేకించారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించే ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మాసాబ్‌ట్యాంక్‌ పాఠశాల స్థాపనకు భూమిని విరాళంగా ఇచ్చారు. ఇప్పుడిది సఫ్తరియా బాలికల పాఠశాలగా వెయ్యి మంది విద్యార్థులతో నడుస్తోంది.

మల్లు స్వరాజ్యం
తెలుగు రాజకీయాల్లో, సామాజిక ఉద్యమాల్లో మల్లు స్వరాజ్యం పేరు తెలియనివారు లేరు. ఉద్యమకారిణిగా, రాజకీయ నాయకురాలిగా, స్వాతంత్య్ర పోరాట, తెలంగాణ సాయుధ యోధురాలిగా అందరికీ ఈమె సుపరిచితమే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కర్వి రాల కొత్తగూడెంకు చెందిన భూస్వామ్య కుటుంబంలో మల్లు స్వరాజ్యం జన్మించారు. చిన్న తనంలోనే అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి ప్రోత్సాహంతో ఉద్యమంలోకి వచ్చారు. మాగ్జిం గోర్కీ ‘అమ్మ’ నవల ప్రేరణతో సామాజిక దురాచారాలపై పిడికిలి బిగించారు. నిజాం పాలనలో దొరలకు, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా భూమికోసం, భుక్తికోసం తెలంగాణ విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఆమె పాఠశాలలో చదివింది ఐదో తరగతి వరకే. కానీ కమ్యూనిస్టు ఉద్యమాల్లో భాగస్వామి అయిన తర్వాత సమా జాన్ని సునిశితంగా పరిశీలించారు. అసమానతలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. ప్రజా ప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేశారు. మహిళా సమస్య లపై నిరంతరం కృషి చేస్తున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

తయ్యబా బేగం
ఈమె స్త్రీ విద్య కోసం పాటుపడ్డారు. అప్పట్లో ముస్లిం స్త్రీలు పరదా పద్ధతి పాటిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడం నామోషీగా భావించే వారు. అలాంటి సమయంలో ఈమె కో-ఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌ చేరి ఉద్యోగం చేస్తూనే మొదటి ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్స్‌ పాఠశాలను హైదరాబాద్‌లో స్థాపించారు. ఈమె హైదరాబాద్‌లో స్త్రీ విద్యకు, ముఖ్యంగా ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్‌లో అధ్యాపకురాలిగా ప్రసిద్ధికెక్కారు. హైదరాబాద్‌లో మొదటి డొమెస్టిక్‌ సైన్స్‌ కాలేజీని స్థాపించి, మొదటి ప్రిన్సిపల్‌గా పని చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad