- navatelangana: సంస్మరణ సభలో సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివరెడ్డి
నవతెలంగాణ మంగపేట: నా వాదం ప్రగతిశీల వాదం నా నినాదం అభ్యుదయవాదం అంటూ పత్రిక ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి తన తుది శ్వాస వదిలే వరకు పోరాడిన నవతెలంగాణ తాడ్వాయి మండల పాత్రికేయుడు తమ్మల్ల సమ్మయ్య ప్రజల హృదయాల్లో అమరజీవి అయ్యారని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. గురువారం తమ్మల్ల సమ్మయ్య దశదిన కర్మ సందర్భంగా ఆయన స్వగ్రామమైన కాటాపురం గ్రామంలో నవతెలంగాణ దినపత్రిక వరంగల్ రీజియన్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభను వందలాది మంది ప్రజలు అభిమానులు గ్రామస్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు సంస్కరణ సభకు హాజరైన ప్రజాసంఘాల నాయకులు జర్నలిస్టులు సమ్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి సమ్మయ్య కు నివాళులు అర్పించారు. అనంతరం ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన దయాసాగర్ మాట్లాడుతూ పత్రికా రంగంలో సమ్మయ్య గత 20 ఏండ్లుగా చేసిన సేవలను కొనియాడారు.
తాడ్వాయి మండలంలోని ఆదివాసి ప్రజల తో అన్యోన్యంగా ఉండడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయి వారి సమస్యల పరిష్కారానికి ఆవిరల కృషిచేసిన మహోన్నతమైన వ్యక్తి సమ్మయ్య అని అన్నారు. ఆయన సంస్మరణ సభ అనగానే విశేషంగా తరలివచ్చిన ప్రజానీకాన్ని చూస్తుంటే సమ్మయ్య తన సేవల ద్వారా ప్రజల హృదయాన్ని గెలిచిన తీరు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని అన్నారు. నవ తెలంగాణ పత్రిక అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించిన సమ్మయ్య కుటుంబానికి పత్రిక ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. సమ్మయ్య మరణం అతని కుటుంబానికి కాక పత్రికా రంగానికి తీరని లోటు అని ఆయన కుటుంబానికి ప్రభుత్వపరంగా అందవలసిన సాయం అందేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. అనంతరం సమ్మయ్య కుటుంబ సభ్యులకు సిపిఎం నాయకుల ద్వారా సేకరించిన సుమారు పదివేల రూపాయల నిధిని సాయంగా అందించారు. భవిష్యత్తులో కూడా సమ్మయ్య కుటుంబానికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

సమ్మయ్య సేవలు చిరస్మరణీయం
నవతెలంగాణ వరంగల్ ఉమ్మడి జిల్లాల స్టాపర్ దయాసాగర్
నవతెలంగాణ మంగపేట: నవ తెలంగాణ దినపత్రిక తాడ్వాయి మండల విలేకరి తమ్మల సమ్మయ్య భౌతికంగా మరణించిన పత్రిక రంగం ద్వారా ఆయన ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని నవతెలంగాణ దినపత్రిక వరంగల్ ఉమ్మడి జిల్లాల స్టాపర్ టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్ అన్నారు. గురువారం నాటి సమ్మయ్య దశదినకర్మలకు పత్రిక సిబ్బందితో హాజరైన ఆయన నవ తెలంగాణ విలేకరుల ద్వారా సేకరించిన 31,900 రూపాయలను సమ్మయ్య సంస్మరణ సభలో ఆయన కూతురు సాహితికి అందజేశారు. ఈ సందర్భంగా దయాసాగర్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు ప్రజల హక్కుల కోసం అభ్యుదయ భావాలతో పోరాడిన నిస్వార్ధపరుడు సమ్మయ్య అని అన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయి తన పత్రిక ద్వారా సమస్య పరిష్కారానికి నిరంతరం కృషిచేసిన నిత్య కృషి వలుడు సమ్మయ్య అని కొనియాడారు. మానవత్వం మూర్తిభవించిన సమ్మయ్య భౌతికంగా మన మధ్య లేకున్నా అతని ఆశయాల సాధనకు మనమంతా కృషి చేయాలని అన్నారు. పార్టీలకు అతీతంగా పత్రికను ఆయుధంగా మలుచుకొని ప్రజా సమస్యలపై పోరు సాగించిన కామ్రేడ్ సమ్మయ్య జీవితం ప్రజాసేవలో ధన్యమైందని అన్నారు. పత్రిక అభివృద్ధి తన అభివృద్ధి గా భావించి ఈ ప్రాంత సమస్యలను నవ తెలంగాణ దినపత్రిక ద్వారా బయట ప్రపంచానికి తెలియజేసిన సమ్మయ్య ప్రజల మనిషిగా గుర్తుండిపోతాడని అన్నారు.
ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తాం
టి యు డబ్ల్యూ జే రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు
పత్రిక ద్వారా సమాజ సేవ చేస్తూ పరమపదించిన తాడ్వాయి మండల నవ తెలంగాణ దినపత్రిక పాత్రికేయుడు తమ్మల్ల సమ్మయ్య కుటుంబానికి ప్రభుత్వం సాయం అందేలా కృషి చేస్తామని టి యు డబ్ల్యూ జే రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు అన్నారు. గురువారం తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ రీజియన్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మయ్య సంస్మరణ సభకు హాజరై మధు మాట్లాడారు. ప్రజాసేవలో శ్రమించిన సమ్మయ్య తన పనితీరుతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాడని అన్నారు. అతని అకాల మరణం శోచనీయమని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపాడు. జర్నలిస్టు సంఘం ద్వారా వారి కుటుంబానికి అందవలసిన సహాయం అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపాడు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం గోవిందరావుపేట మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి సిఐటియు మండల శాఖ అధ్యక్షుడు చిట్టినేని శ్రీను కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పులి నరసయ్య గౌడ్ టిఆర్ఎస్ జిల్లా నాయకులు గ్రామసహాయం శ్రీనివాస్ రెడ్డి నవ తెలంగాణ సిబ్బంది క్రాంతి పాషా శ్రీనివాస్ రంగన్న విలేకరులు ఇరసవడ్ల బిక్షపతి కురిమిళ్ళ శ్యామ్ దామోదర్ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ తాడ్వాయి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ కుల సంఘాల నాయకులు పులి నరసింహరావు సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.