చివరిదాకా తమ చుట్టూ తిప్పుకుని క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వటం కొందరికే సాధ్యం. ఆ ట్విస్ట్‌కు అవతలి వారు ఖంగు తినటమేకాదు… జీవితాంతం ఆ ‘మహానుభావుల’ పేర్లను గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఓ మహానుభావుడి పేరు తనకు జీవితాంతం గుర్తుండిపోతుందం టున్నారు బీఆర్‌ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి. 2002లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎమ్‌సీహెచ్-అప్పట్లో జీహెచ్‌ఎమ్‌సీగా రూపాంతరం చెందలేదు) కు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత, ఆనాటి సీఎం చంద్రబాబు మలక్‌పేట డివిజన్ బాధ్యతను రావులకు అప్పగించారట. అక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత ఆయనదే. దీంతో ఓ ఫైన్ మోర్నింగ్ చంద్రశేఖరరెడ్డి… తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆ అభ్యర్థి ఇంటికి వెళ్లారు. తలుపు తట్టగానే… ‘అరే అన్నా… ఇంత పొద్దుగాల ఎవరు లేస్తరే, కాసేపు గట్ల బయటికెల్లి ఛారు తాగుదాం, ఆ తర్వాత పదింటికి క్యాంపెయిన్ మొదలుబెడదాం’ అన్నాడట తాపీగా. సరే అనుకుని, పదింటికి వెళితే… ‘అన్నా… ఇంకో రెండు గంటలైతే లంచ్ టైమ్ అయితాది, గదయినంక పోదాం.. జర ఆగరాదు…’ అంటూ సమాధాన మిచ్చాడట. లంచ్ తర్వాత కాలింగ్ బెల్ కొడితే… ‘ఏమన్నా… ఈ ఎండకి ఎవడు మన మాటింటడే… ఈవినింగ్ టైంల పోదాంలే…’ అనేవాడట. సాయంత్రం వెళితే.. ఇంకో కత చెప్పి, రాత్రికి క్యాంపెయిన్ చేద్దాంలే… అని ఆ అభ్యర్థి జారుకునేవాడట. ఇలా ప్రచారం జరిగినన్ని రోజులూ రావుల… అభ్యర్థి ఇంటికి పోవుడు, ఆయన కతల మీద కతలు చెప్పుడు, ఇదే ముచ్చట తప్ప, ఒక్కరోజు కూడా క్యాండిడేట్ ప్రచారానికి రాలేదు. ఇగ లాభం లేదనుకుని, చంద్రశేఖరరెడ్డే… టీడీపీ కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని ముగించారు. ఇక ఎలక్షన్ రోజు రానే వచ్చింది.. పోలింగ్ మొదలైంది, కానీ టీడీపీ క్యాండిడేట్ ఎక్కడా కనపడటం లేదు. ఆరా తీస్తే జాడ లేదు… ఓ గంట గడిచాక… మనోడు పోలింగ్ కేంద్రం వద్ద కనబడ్డాడు. హమ్మయ్య దొరికాడు అనుకునేలోపు… ఆ టీడీపీ అభ్యర్థి తన చొక్కాకు ఎంఐఎం బ్యాడ్జ్ తగిలించుకుని మజ్లీస్ పార్టీకి ఏజెంట్‌గా కూర్చున్నాడు. అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు ఇదేంటని అడగ్గా… ‘అన్నా… మీ పిచ్చిగానీ గీ మలక్‌పేటల ఎంఐఎంను కాదని ఎవడన్న క్యాండేట్ నిలబడతడానే…’ అంటూ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇచ్చాడంట. అగ్గదీ మేటర్…
-బి.వి.యన్.పద్మరాజు
గట్లుంటది కొందరితోని…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES