– పార్-తాపి-నర్మదా ప్రాజెక్టు వద్దే వద్దు
– దానిని పూర్తిగా రద్దు చేయాలి : గుజరాత్‌లో గిరిజనుల భారీ నిరసన
అహ్మదాబాద్: గుజరాత్‌లో వివాదాస్పద పార్-తాపి-నర్మదాల లింక్ ప్రాజెక్టు మళ్లీ చర్చకు దారి తీసింది. గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో దీనిని రద్దు చేస్తున్నట్టు మూడేండ్ల క్రితం గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇటీవల లోక్‌సభలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ప్రవేశపెట్టడంతో ఈ ప్రాజెక్టుపై మళ్లీ ఆందోళనలు ఊపందుకున్నాయి. గిరిజనుల ప్రాబల్యమున్న ధరమ్‌పూర్, వల్సాద్‌లలో భారీ నిరసన ర్యాలీలు జరిగాయి. వేలాది మంది గిరిజనులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. పార్-తాపి-నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళమెత్తారు. తమ ఇండ్లు, సంస్కృతి, జీవనోపాధిని నాశనం చేసే ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ‘డ్యామ్ వద్దు, ఇక్కడి నుంచి తరలివెళ్లం’ అనే స్పష్టమైన సందేశంతో ఆదివాసీలు ఆందోళనలు జరుపుతున్నారు. వీరి నిరసనలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు.
మూడేండ్ల క్రితం వరకు ఈ వివాదాస్పద ప్రాజెక్టుపై ఇవే ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఆదివాసీ హక్కులపై ఆందోళన వ్యక్తమైంది. అయితే 2022లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అంతా అయిపోయిందనుకుంటున్న తరుణంలో తాజాగా లోక్‌సభలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ప్రవేశపెట్టడంతో దక్షిణ గుజరాత్‌లోని గిరిజనుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
వేలాది మందితో నిరసన ర్యాలీ
‘డ్యామ్ రిమూవల్ కమిటీ’ బ్యానర్ కింద ధరమ్‌పూర్‌లో వేలాది మంది గుమిగూడారు. ఇక్కడి గ్రామాలకు చెందిన ప్రజలు ప్రాజెక్టుకు ర్యాలీని జరిపారు. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షులు అమిత్ ఛవ్డా, వన్స్‌డా ఎమ్మెల్యే అనంత్ పటేల్‌లు వారితో కలిసి నడిచారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రద్దు చేశామని ప్రకటించినప్పటికీ.. పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని అనంత్ పటేల్ అన్నారు. ఇది బీజేపీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతున్నదని విమర్శించారు. ”మా డిమాండ్ సింపుల్. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలి. ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి. గిరిజనులను మోసం చేసే ముందు బీజేపీ ఎంపీ ధవల్ పటేల్ వాస్తవాలను తెలుసుకోవాలి. ఈ పోరాటాన్ని డంగ్ వరకు తీసుకెళ్తాం” అని అనంత్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు వల్సాద్ జిల్లాకు చెందిన వేలాది మంది గిరిజనులు కూడా గురువారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. లారీలు, ట్రాక్టర్లలో వేలాది మంది ఆదివాసీలు ధరంపూర్‌కు తరలివచ్చారు. పార్-తాపి-నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు పరిహారం వద్దనీ, ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు గిరిజనుల ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏమిటీ ఈ ప్రాజెక్టు?
ప్రతిపాదిత ప్రాజెక్టు పార్, తాపి, నర్మదా అనే మూడు నదులను కలుపుతుంది. వీటిపై తొమ్మిది డ్యామ్‌లను నిర్మిస్తారు. మహారాష్ట్ర రాజధాని ముంబయి, గుజరాత్‌లోని ప్రాంతాలు సౌరాష్ట్ర, కచ్‌లకు నీటి సరఫరా చేయటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే ఈ ప్రాజెక్టు తమను మొత్తం తుడిచిపెట్టేస్తుందని ఆదివాసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిది డ్యాముల నిర్మాణంతో మూడు ప్రధాన నదులను అనుసంధానించే పార్-తాపి-నర్మదా లింక్ ప్రాజెక్టుపై దక్షిణ గుజరాత్‌లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా ధరమ్‌పూర్, వల్సాద్‌లలోని గిరిజనులుండే ప్రాంతాలు ఈ ప్రాజెక్టుతో ప్రభావం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 118 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదమున్నది. అలాగే ఐదు లక్షల మంది, వీరిలో అధికంగా గిరిజనులను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది.
ప్రాజెక్టు రద్దయ్యింది.. మళ్లీ నిర్మాణం ఉండదు
గిరిజనుల ఆందోళనల నేపథ్యంలో గుజరాత్ ఆరోగ్య మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధఙ హృషికేశ్ పటేల్ స్పందించారు. 2022లో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టు రద్దయ్యిందనీ, ఇది గుజరాత్‌లో నిర్మాణం కాబోదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు రద్దు ప్రకటన తర్వాత నుంచి కేంద్రం కానీ, రాష్ట్రం కానీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని వివరించారు. అయితే ఈ వివాదాస్పద ప్రాజెక్టును అధికారికంగా, శాశ్వతంగా రద్దు చేసేవరకూ తమ పోరాటం ఆగదని దక్షిణ గుజరాత్‌కు చెందిన ఆదివాసీలు హెచ్చరిస్తున్నారు. తాము జరిపిన ర్యాలీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని తెలిపారు.
– గుజరాత్ మంత్రి
ఇండ్లు, సంస్కృతి, జీవనోపాధికి దెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES