పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు
300కుపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 12.23 సెం.మీ వాన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే సూచనలు న్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. ఈ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ జాబితాలో ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలున్నాయి. ఈ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముంది. ఎల్లో హెచ్చరిక జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి జిల్లాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వాన, అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చు.
తెలంగాణ మీదుగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతున్నది. దానికి అనుబంధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు కొనసాగుతున్నది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో చురుగ్గా కదులుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర – దక్షిణ ఒడిశా ప్రాంతాల మధ్య తీరాన్ని తాకే అవకాశముంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మీదుగా ఈశాన్య అరేబియన్ సముద్రం వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. దీని ఫలితంగా తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి.
గురువారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 300కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం రికార్డయింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో అత్యధికంగా 12.25 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో పది సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం వడ్డే కొత్తపల్లిలో 7.4 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షం పడింది. గురువారం మహబూబాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కామారెడ్డి, వరంగల్, జనగాం జిల్లాల్లో ఒకటెండ్రు చోట్ల భారీ వర్షం కురిసింది.
వచ్చే మూడ్రోజులూ వర్షాలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES