స్థానిక సమస్యలు పరిష్కరించాలి : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ – కరీంనగర్
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి కోరారు. కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్, కట్టరాంపూర్ కాలనీల్లో ఐద్వా ఆధ్వర్యంలో గురువారం ఇంటింటి సర్వే నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడుస్తున్నా స్థానిక సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. కోతిరాంపూర్‌లో డ్రయినేజీ సౌకర్యం సరిగా లేక ఇండ్లల్లోకి మురుగు నీరు వస్తోందని, పందులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని, దోమలు విజృంభిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఎదుట రోడ్డు గుంతలు పడి ఇబ్బందులేర్పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తలాపునే మానేరు డ్యాం ఉన్నా.. రోజు తాగునీరు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలను అణచివేస్తున్నారని, లైంగికంగా వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి, ఉపాధ్యక్షులు ద్యావ అన్నపూర్ణ, గుడికందుల సంధ్య, మంచినీళ్ల లావణ్య, ఉప్పునూటి లక్ష్మి, స్రవంతి, భవాని, రామ రజిని, మున్నా అంజలి తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES