Monday, May 5, 2025
Homeఎడిట్ పేజికథ వింటారా…

కథ వింటారా…

- Advertisement -

ఒకరు చెబుతుంటే వినడం మానవుడికి పూర్వం నుండీ అలవాటు. ముఖ్యంగా కథ ఒకరు చెప్పడం ఒకరో, ఇద్దరో లేదా ఇంకెంతోమంది వినడం మామూలే. అయితే అక్కడ ఉన్నవాళ్లే ఆ కథ వినగలరు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నెన్నో వేల, లక్షల కథలు మన అమ్మ, నాన్న, టీచరు, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, బాబాయి ఇలా, అక్క, అన్న ఇలా చెప్పేవాళ్లెందరో. వెంటనే సెల్లు మీదికెళ్లి దానివల్లే ఇవన్నీ పోయాయని అప్పుడే నిందవేయను. ఎందుకంటే దాంట్లో కూడా కథల సమూహాలుంటాయి. రోజూ ఒక కథ ఓపిగ్గా చదివి అందులో పోస్టు చేసే వాళ్లు ఉన్నారు. సెల్లు వచ్చినా దానివల్ల జరుగుతున్న మంచిని కూడా చూడాలి కాని చెడునే చెప్పకూడదు.సెల్లు కథ సెల్లుకుంటుంది మరి.
ఒక సినిమాలోని ఓ పాత్ర ”నేను వాజిపేయిగారితో ఇలా ఎదురెదురుగా నలభై నిముషాలు మాట్లాడాను” అంటాడు. అదెలాగ అన్న ప్రశ్నకు ఆయన పైన వేదిక మీద మాట్లాడుతున్నాడు. నేను కింద ఆయన ఎదురుగా కూచున్నాను అంటాడు. ఇది వినడమా లేక మాట్లాడుకోవడమా అని ఆ మాటలు విన్న పాత్ర మొహంలోని హావభావాలే మనకు చెబుతాయి. అన్నట్టు హావభావాల విషయం ఎటూ వచ్చింది కాబట్టి నాటికల్లోనో, నాటకాల్లోనో, సినిమాల్లోనో పాత్రల హావభావాలు మనకు తెలిసిపోతుంటాయి. అదొక సౌలభ్యం. కాని కథ చెప్పేవాళ్తు కథలోని అంశాన్ని, పాత్రల మాటలు, హావభావాలను కూడా వినేవాళ్తకు తెలిసేలా చెబుతుంటారు. అసలు కథ చెప్పడం అన్నది పెద్ద కళ మరి. దృశ్యస్రవణ విద్యలంటూ తర్వాత వచ్చాయి కాని మొదట్లో శ్రవణమే అంటే వినడమొక్కటే ఉండేది.
కథ తర్వాత హరికథ వచ్చింది. దాని సౌలభ్యం ఏమిటంటే ఇంకా ఎక్కువమంది వినడం. పూర్వం పండుగలప్పుడు గుళ్లలో హరికథలు చెప్పేవాళ్లు. కొత్త తరాలు వినలేదేమో కాని యాభై ఏళ్లు పైనున్న వాళ్లు వినుండే అవకాశం ఉంది. తర్వాత ఆ హరికథను ఒకే పాట రూపంలో సినిమాల్లో వాడుకున్నారు. అదో మంచి టెక్నిక్‌. ఈ హరికథలో కథతో పాటు మధ్యలో పద్యాలు, పాటలు, జోకులు అన్నీ వచ్చి పోతుంటాయి. వినేవాళ్లలో కొందరు నిద్రపోతూ ఉండే అవకాశం ఉంది కాబట్టి మధ్యలో హరికథ చెప్పేవాళ్లు ‘శ్రీమద్రమారమణ గోవిందా హరి’ అనో ఇంకో విధంగానో వినేవాళ్ల చేత అరిపించి నిద్రపోయే వాళ్లను మేల్కొలుపుతారు.
ఇప్పుడు కథలు చెప్పే విధానాలు పూర్తిగా మారిపోయాయి. కథను చూపుతున్నారిప్పుడు. బాలనాగమ్మ కథ, తెనాలి రామలింగడి కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, బీర్బల్‌ కథలు, ముల్లా నస్రుద్దీన్‌ కథలు ఇలాంటివన్నీ విన్నవాళ్లు ఎక్కువే. తర్వాత పుస్తకాల్లో చదువుకుంటున్నారు. కథలు చెప్పేవాళ్లు సహజంగా వచ్చిన నేర్పుతో పాటు మంచి మంచి కథలు చదివి చెబుతారు. వినేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్టు వినేవాళ్లందరు ఆ కష్టాన్ని గమనించలేరు, ఊహించలేరు, ఎందుకంటే తమ అహాన్ని సంతృప్తి పరచుకోవాలి కాబట్టి. సినిమాల్లో, టీవీల్లో ఈ కథలను చూపుతున్నారు. మసాలాలు జోడించి మరీ చూపుతున్నారు. వాడుకోవాలే కాని సినిమా అంతటి మాధ్యమం మరొకటి లేదని మహాకవి శ్రీశ్రీ అన్నారు. అందుకే ఆయన అవకాశం వచ్చినప్పుడంతా మంచి మాటలు, పాటలు రాసి దాని ప్రయోజనాన్ని తెలిపారు. సీరియళ్లయితే అరిసెల పాకంలాగానో, జీడి పాకంలాగానో సాగదీస్తున్నారు. కథలోని పాత్రల ముఖాలు అంటే మనుషులు మనుషులే మారిపోతుంటారు సీరియల్స్‌లో. దీన్నిబట్టి కథ తెలుసుకునేవాళ్ల గురించిన శ్రద్ధ ఇంతగా ఉందా అనుకోవచ్చు కొందరు. అదేం కాదు ప్రకటనల రూపంలో వచ్చే పైసలే ప్రామాణికం అని చాలామంది అందుకోవడంలో చాలా నిజముంది.
ఇక రాజకీయ కథకులు ఎక్కువగా కనిపిస్తున్న, వినిపిస్తున్న కాలమిది. ఎన్నికలప్పుడే కాదు, ఎన్నికలు లేనప్పుడు కూడా వీళ్ల కథలు వినాల్సిందే మనం. ఎటూ సెలవుల్లో ఉన్నారు కాబట్టి కార్యకర్తలనంతా ఒకదగ్గర చేర్చి తమ కథలు చెబు తారు. రాబోయే రోజుల్లో ఏమేమి చేయాలి, ఈ ఎన్నికలయ్యాక మనదే అధికారం అనీ నిర్ధారణ చేసేస్తారు. అట్లని అధికార పార్టీవాళ్లూ తక్కువ తినలేదు రెండాకులు ఎక్కువే చదివినట్టు రెండు కథలు ఎక్కువగానే చెబుతారు. ఇక మూడో కోణంలో ఉన్న పార్టీలు కూడా ఆ ఇద్దరి కథలూ విని మీరు విసిగిపోయి ఉన్నారు జర మా కథలు కూడా వినండని చెబుతారు. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఉన్న ”కథే”. ఈ కథ ఎప్పటికీ అయిపోనిది. ఇక వీళ్ల కథలకు ఉన్న సౌకర్యం ఏమిటంటే అంతకు ముందు చెప్పిన కథలు అమలు పరచినా లేకున్నా అవి జనాలకు గుర్తుండవు. వేరేవాళ్లు గుర్తుచేసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు తక్కువ. అన్నివైపులనుండీ కథలు కథలుగా నాయకులు చెబుతుంటే వినడానికే సమయం చాలదు, ఇక పాతవి ఎలా తలచుకుంటారు చెప్పండి.
కథ చెప్పడంలో, వినడంలో అతి ముఖ్యమైన పాయింటు ఒకటుంది. అదేమంటే ఊ..కొట్టడం. కథ చెబుతున్నవారికి వినేవాళ్లు ఊ..అంటూ ఉండాలి. అప్పుడే వింటున్నట్టు లెక్క. ఇంకా వీలైతే మధ్యమధ్యలో మళ్లీ చెప్పు అనడం, లేదా అర్థం కాలేదనడం చేస్తూ ఉంటే చెప్పేవాళ్లకు ఇంకా హుషారొచ్చి కథలో ఉన్నవీ లేనివీ కలిపి చెప్పి రక్తి కట్టిస్తారు. రాజకీయ కథకులు మాత్రం ఈ ఊ కొట్టడం లాంటి విషయాలను పట్టించుకోరు. చెప్పుకుంటూ పోవడమే వాళ్లకు తెలిసేది. అయితే ఎవరి కథ ఎప్పుడు ఆపాలి అన్నది మాత్రం వినేవాళ్లకు తెలుసు. ఏమైతేనేం కథల రూపం మారినా అవి మనిషి ఉన్నంత కాలం ఉంటాయనిపిస్తుంది.
జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -