పదో తరగతి విద్యార్ధులకు ఆర్ధిక చేయూత
పూర్వ విద్యార్ధుల దాతృత్వం
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రార్ధించే పెదాలు కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మహనీయుల నానుడిని పూర్వ విద్యార్ధులు కొందరు సార్ధకం చేసారు. తాను చదివిన పాఠశాలలో గతేడాది పదో తరగతి చదివిన ప్రతిభా వంతులకు ఆర్ధిక చేయూతనిచ్చి వారి దాతృత్వం చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం, అమరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024 -25 టెన్త్ బ్యాచ్ విద్యార్ధులకు ప్రధమ,ద్వితీయ,తృతీయ బహుమతులుగా నగదు ను అందజేసారు.
స్కూల్ ఫస్ట్ విద్యార్ధి ఎం.సంజయ్ కి రూ,10,000 థర్డ్ విద్యార్ధి ఎం.విష్ణు హర్షిణ్ కి రూ.2,500 లను యూఎస్ఏలో స్థిరపడిన ఉప్పేరు కు చెందిన ప్రవాస భారతీయుడు గంజి రామ చక్రధర్ రావు, సెకండ్ విద్యార్ధిని కే.లహరి కి రూ.5,000 లును అమరవరం వాసి వల్లాల రవీంద్రనాథ్ లు వెచ్చించారు. ఈ నగదును స్థానిక గ్రామ పెద్ద,పాఠశాల శ్రేయోభిలాషి డాక్టర్ రాధాకృష్ణ గారి చేతుల మీదుగా శుక్రవారం స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆయా విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కే.సాంబశివరావు,ఉపాద్యాయులు లక్ష్మి,రత్నకుమారి,దుర్గ,ఈశ్వరుడు, గ్రామస్తులు పాల్గొన్నారు.