Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజినగరాలా? నరకాలా!

నగరాలా? నరకాలా!

- Advertisement -

భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. జనజీవనం అస్థవ్యస్థమవుతున్నది. గతం నుంచి గుణపాఠాలు నేర్చు కోవడంలో వెనుకపడుతున్న ప్రభుత్వాలు, వర్షాలు, వరదల సమయంలో హడావిడి చేయడం మినహా, ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించలేని స్థితి. సామాన్యులను కష్టాలనుంచి గట్టెక్కించలేని దుస్థితి. స్థానికంగా జీవనోపాధులు పోయి సాధారణ ప్రజల బతుకు భారమవుతున్నది. మనరాష్ట్రంతోపాటు ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోనూ భారీ వరదలు వచ్చాయి. హైదరాబాద్‌లో తాజాగా ఇద్దరు కొట్టుకుపోగా, మిగతా రాష్ట్రాల్లో విపరీతమైన ప్రాణ, ఆస్తినష్టం సంభవించాయి.

వరదలను అడ్డుకునే ‘బహుముఖ విధానం’ అవసరం. వర్షపాతాన్ని తట్టుకునేలా డ్రెయినేజీ వ్యవస్థ ప్రధాన నగరాల్లో అందు బాటులో లేదు. మన రాజధాని హైదరాబాద్‌ పరిస్థితే ఇందుకు ఉదాహరణ. సహజసిద్ధంగా నీరు ప్రవహించేలా ఏర్పాట్లు తక్కువే. వర్షపు నీటిని ఒడిసిపట్టి కాలువల్లోకి పంపించేలా ప్రత్యామ్నాయ చర్యలు అసలే లేవు. ఇందుకు ఇటీవలి కాలంలో ఎస్‌ఎన్‌డీపీ, హైడ్రా ఏర్పాటు కొంత ఉపశమనం కలిగించినా, శాశ్వత ప్రాతిపదిక చర్యలు మరిన్ని కావాలి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌లు మరింత చురుగ్గా పనిచేయాలి. వరద ప్రవాహానికి ఉన్న అడ్డంకులే ఇక్కట్లకు మూలమనీ, వచ్చే వందేండ్లపాటు సమస్యల నివారణకు మూసీ పునర్జీవనమే పరిష్కారమనే భావనలో సర్కారుంది. ముంబయి, కోల్‌కతా, చెన్నరు, ఢిల్లీ తదితర నగరాలు వానలు, వరదలతో ఎదుర్కొనే కష్టాలు అన్నీఇన్నీ కావు. ఆ పరిస్థితి ఇప్పుడు మన భాగ్యనగరానికి రాకుండా చూసుకోవాలి. దక్కన్‌ పీఠభూమిలో ఉన్న హైదరాబాద్‌కు, విస్తరణ అవకాశాలు మిక్కిలి. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ముంబయి తరహాలో దేశంలో మరో వాణిజ్య రాజధానిగా ఎదిగే అవకాశాలెక్కువ. ఆగస్టు 2, 2000 సంవత్సరంలో నగరంలో కురిసిన 22 సెంటీమీటర్ల వర్షం గడిచిన వందేండ్లల్లో ఎప్పుడూ ఎరుగనిది. అప్పుడు నగరమే చెరువైంది.

హైదరాబాద్‌ది నిజాం నాటి డ్రైనేజీ వ్యవస్థ. సెప్టెంబరు 28, 1908లో వర్షాలు భయంకరంగా కురిసాయి. 19 వేల ఇండ్లు దెబ్బ తినగా, 15 వేల మంది మృత్యువాత పడ్డారు. ఆరో నిజాం మహబూబ్‌ అలీ వరదలపై ప్రత్యేక దృష్టిపెట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు బాధ్యతలు అప్పగించి ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌కు ప్రాణం పోశారు. దీంతో దశాబ్దాలపాటు సమస్యలు రాలేదు. ఇప్పుడు జనాభా పెరిగింది. దీంతో నగరంతోపాటు శివారు పట్టణాలూ విస్తరిస్తున్నాయి. అందుకనుగుణంగా పటిష్టమైన వ్యవస్థలు, చట్టాలు చేసే బాధ్యతలు ప్రభుత్వాలు తీసుకోవాలి. 2012 నుంచి వాతావరణంలో భారీ మార్పులు వస్తున్నాయని జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ తెలియజేస్తోంది. పర్యావరణ ప్రభావాలను అంచనా వేసి నియంత్రణా చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వాలు శ్రద్దపెట్టక పోవడంతోనే ఇబ్బందులు వస్తున్నాయని చెబుతోంది. ఎప్పుటికప్పుడు వరద నియంత్రణా వ్యూహాలను మారుస్తూ పోవాలనేది విపత్తుల నిపుణుల సూచన. కానీ, వాటి గురించి పట్టిం చుకునే నాధు డేడి !?

ప్రకృతి వైఫరీత్యాలపై కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు. రాష్ట్రాలకు నిధులివ్వడంలో ఆలసత్యం కనిపిస్తున్నది. వ్యవస్థలను బాగుచేయడంలో విఫలమవుతున్న కారణంగా స్థానికంగా ఉపాధులుపోయి రోజుల తరబడి వృత్తులు నడవక పేద ప్రజల బతుకు భారమయ్యే దుస్థితి ఏర్పడుతున్నది. ఒకవైపు భారీ వర్షాలు వస్తున్నా, మరోవైపు భూగర్భజలాలు అడుగంటి తాగునీటికి ఇబ్బందులు రావడం గమనార్హం. వరదల బాధల నేపథ్యంలో ఇవి నగరాలా ? నరకాలా! అనేది అర్థం కావట్లేదు. చినుకుపడితే చిత్తడే. విశ్వనగరమనే పేరు. అందుకు తగ్గ వసతులే లేవు. తప్పెవరిది? ప్రకృతిదా, ప్రభుత్వాలదా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. రియల్‌ఎస్టేట్‌ పేరుతో ల్యాండ్‌ మాఫియా చెరు వులను సైతం చెరబట్టింది. చివరకు హైదరాబాద్‌ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్‌నూ కబ్జా చేసేశారు. అసలు చెరువుల కళే కనుమరుగైంది. 1970నాటి రెవెన్యూ లెక్కల ప్రకారం మన మహానగరం మూడువేల చెరువులతో అలలారుతుండాలి. కానీ నేడవి నాలుగు వందలకు తగ్గి, నగరం కాంక్రిట్‌ జంగిల్‌ అయింది. వర్షం పడితేచాలు రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి.

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని శాస్త్రీయ పద్ధతుల్లో వరద నియంత్రణను చేపట్టాలి. జియోమ్యాపింగ్‌తో ప్రమాదాలను అంచనావేసి అందుకనుగుణంగా అడుగు లేసేందుకు ప్రభుత్వాలు సిద్ధపడాలి. మూసీ పునర్జీవనంతో పాటు ఇతర మార్గాలనూ రేవంత్‌ సర్కారు అన్వేషించాలి. భవిష్యత్‌ను చూస్తూ మానవ, ఆర్థిక వనరులను భారీగా కేటాయించి ముందుకుకెళ్లడమే సర్కారు కర్తవ్యం కావాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad