భారతదేశం ‘రాష్ట్రాల సమాఖ్య’ అనే ఫెడరల్ సూత్రాన్ని ఆరెస్సెస్, బీజేపీలు ఏనాడూ ఆమోదించ లేదు. ఆరెస్సెస్ భావన అయిన అఖండ భారత్ దృక్పథమే వారికి కావలసింది. అలాంటి భారత్ ఒక సర్వాధికార కేంద్రీకృత రాజ్యంగా వుంటే రాష్ట్రాలు కేవలం పాలనా సౌల భ్యం కోసం ఏర్పడిన పాలనా విభాగాలుగా మాత్రమే వుండాలన్నది వారి దృక్పథం. రాజ్యాంగంలో సమాఖ్య స్వభావం పొందుపర్చబడింది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పరిధులు ప్రత్యేకంగా పేర్కొనబడ్డాయి. ప్రజలచే ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలకూ రాష్ట్రాల శాసనసభలకూ రాజ్యాంగ ప్రాతిపదిక ఏర్పర్చబడింది. స్వాతంత్య్రం వచ్చాక ఏడున్నర దశాబ్దాలకు ఇప్పుడు వాటన్నిటినీ విచ్ఛిన్నం చేసే ప్రమాదం కనిపిస్తున్నది.
త్రిముఖ దాడి
హిందూత్వ, కార్పొరేట్ కలయికకు ప్రాతినిధ్యం వహించే మోడీ ప్రభుత్వం రాజ్యాంగం మూడు మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్యతత్వం మూడింటినీ తన దాడికి లక్ష్యాలుగా చేసుకుంది. రాజ్యాంగానికి పునాది రాళ్లయిన ఈ మూడు మౌలిక సూత్రాలపై దాడి చేయడంలో పరస్పర అంతస్సంబంధం వుంది. సమాఖ్య సూత్రాలపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి తప్ప మరొకటి కాదు. ఎందు కంటే ఎన్నికైన ప్రభుత్వాల, చట్టసభల హక్కులను ఏ విధంగా హరించినా అది ప్రజాస్వామ్యంపైనా దాడి అవుతుంది. అదే విధంగా మైనార్టీలకు ప్రజాస్వామ్యంలో సమాన హక్కు వుంటుంది గనక లౌకికతత్వాన్ని దెబ్బతీసే ఏ చర్య అయినా ప్రజాస్వామ్యంపై దాడి అవుతుంది. రాజ్యాంగం సమాఖ్య సూత్రాల వరకే తీసుకుంటే దేశానికి స్వాతంత్య్రానంతరం అధికారం చేజిక్కించుకున్న పాలకవర్గాల స్వభావం రీత్యా కేంద్రం చేతుల్లోనే అధికారాలన్నీ కేంద్రీకఅతం చేసి కేంద్రం చేతుల్లో పెట్టాలనే నిరంతర ఒత్తిడి కొనసాగుతూనే వచ్చింది. పాలక వర్గ కూటమికి నాయకత్వం వహిస్తున్న బడా బూర్జువా వర్గానికి తమ పెట్టుబడులు, సరుకులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా సాగిపోవాలంటే ఒక సమైక్య అఖిల భారత మార్కెట్ వుండాలి. బడావ్యాపారులకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు ఆరెస్సెస్ లాగానే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించాయి.
1970లలోనూ, 80లలోనూ వెంటవెంట వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రం చేతుల్లో మరిన్ని అధికారాలను పోగు వేసేందుకు చర్యలు తీసుకున్నాయి. మరీ ముఖ్యంగా ఇందిరా గాంధీ పాలనలో ఇది జరిగింది. అయితే ఈ రోజున మనం చూస్తున్నది అందుకు పూరితిగా భిన్నమైంది. రాష్ట్రాల హక్కులపై ఉద్దేశపూరకంగానూ, పథకం ప్రకారమూ దాడి జరుగుతున్నది. రాజ్యాంగంలో అంతర్భాగమైన సమాఖ్య లక్షణాన్ని ధ్వంసం చేసే చర్యలు తీసుకుంటున్నారు. సమాఖ్యకు సంబంధించిన రాజకీయ ఆర్థిక సాంస్కృతిక అంశాలలో ఇదే కనిపిస్తుంది.
వ్యవస్థకే చేటు
ఎన్నికల ద్వారా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను దెబ్బ తీసేందుకు గవర్నర్లను వినియోగించడం బీజేపీ, ఆరెస్సెస్‌ల ఈ సరికొత్త నిరంకుశ పోకడలో నూతన కోణం. గతకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు గవర్నర్ కార్యాలయాన్ని దుర్వినియోగ పర్చేవారు. గవర్నర్ 356వ అధికరణం కింద ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టి రాష్ట్రపతి పాలన కోసం సిఫార్సు చేసేవారు. అయితే 1995లో ఎస్.ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గవర్నర్ పదవిని ఈ విధంగా దుర్వినియోగానికి పగ్గాలు వేసింది.మోడీ ప్రభుత్వ హయాంలో గవర్నర్లు రాజకీయంగా చురుగ్గా, పక్షపాతంగా వుండాలనే పద్ధతి నడుస్తున్నది. ప్రత్యేకించి బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల్లో ఇది జరుగుతున్నది. గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ ప్రకటనలు చేసే పద్ధతి అమలులోకి వచ్చింది. అధికారులను రమ్మని హుకుంలు జారీ చేయడం, రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం చెప్పకుండా తొక్కిపట్టడం, ఛాన్సలర్‌గా తనకు వున్న స్థానాన్ని అడ్డం పెట్టుకుని విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్లుగా ఆ ప్రభుత్వాలు సిఫార్సు చేసిన వారిని నియమించకపోవడం జరుగుతున్నది. బీజేపీయేతర ప్రభుత్వాల పాలనలోని తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్, కర్నాటక రాష్ట్రాల గవర్నర్లు ఎప్పటికప్పుడు రాజ్యాంగ పరిధి ఉల్లంఘించేస్తున్నారు. కేంద్రం ఆదేశాలతోనే ఇది జరుగుతున్నది. రాజకీయ రంగంలో రాష్ట్రాల పాత్రను దురాక్రమించే అత్యంత తీవ్రమైన పద్ధతిగా తయారైంది.
గవర్నర్ల రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఎదురుతిరిగి పోరాడుతున్నాయి. ఉదాహరణకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు సంతకం చెయ్యకుండా గవర్నర్ తొక్కిపట్టడంపై కేరళ, తమిళనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. గతంలో 2023 నవంబరులో పంజాబ్‌కు సంబంధించి ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు శాసనసభ ఆమోదించిన నాలుగు బిల్లుల చెల్లుబాటును గవర్నర్ ప్రశ్నించడానికి లేదని, వాటికి ఆమోదం తెల్పకుండా అట్టిపెట్టుకోరాదనీ స్పష్టం చేసింది. తాజాగా 2025 ఏప్రిల్‌లో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి శాసనసభ ఆమోదించిన పన్నెండు బిల్లులకు ఆమోదం తెల్పకుండా తొక్కిపట్టడానికి సంబంధించి వేసిన కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. 200 అధికరణం ప్రకారం గవర్నర్ పాత్ర ఏమిటో నిర్వచించింది. ఆ బిల్లులను నిలిపివేసే వీటో అధికారం గవర్నర్‌కు లేదనీ తేల్చిచెబుతూ ఇద్దరు సభ్యుల ధర్మాసనం వాటి ఆమోద ప్రక్రియకు గడువు నిర్దేశించింది. లేదంటే ఆ లోగానే వాటిని పున: పరిశీలనకై అసెంబ్లీకి తిప్పి పంపాలన్నది. అదే విధంగా రాష్ట్రపతి కూడా వాటిపై అభిప్రాయం చెప్పడానికి తీసుకునే సమయంపై గడువు పెట్టారు. వాటిని గనక గవర్నర్ ఆమోదించకుండా అలాగే అట్టిపెడితే ఆ చర్య చట్టవిరుద్ధమనీ, వాటిని ఆమోదించినట్టే భావించవలసి వుంటుందని కూడా స్పష్టం చేశారు.
పాక్షిక రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్ల అధికారాలను దుర్వినియోగం చేస్తున్న మోడీ ప్రభుత్వ తీరుకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టుగా మారింది. ఈ తీర్పు మింగుడుపడని కేంద్రం సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ప్రస్తావనను పంపించే అసాధారణ చర్యకు పాల్పడింది. ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి న్యాయవ్యవస్థ నిర్దేశాలు చేయవచ్చునా అనే మీమాంసపై దాని అభిప్రాయం అడిగింది. మోడీ ప్రభుత్వం ఏక పార్టీ నియంతృత్వం దిశలో వెళ్తున్న తీరుకు ఈ ఘట్టం అద్దం పడుతున్నది.
ఒక దేశం ఒకే ఎన్నిక ద్వారా లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే పద్ధతి రాష్ట్రాలకు రాజ్యాంగం ఇచ్చిన హామీలను తీవ్రంగా కోత కోస్తుంది. శాసనసభలకు ఐదేళ్ల కాల పరిమితి లేకుండా చేస్తుంది. మోడీ ప్రభుత్వం దీన్ని అమల్లోకి తేవడం కోసం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టింది. ఎన్నికల వ్యవస్థలో ఈ మార్పు తేవడం చాలా తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. దీనివల్ల కొన్ని రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని ముక్కలు చేయటం, గవర్నర్ పాలన ప్రవేశ పెట్టడం, కేంద్రం జోక్యం పెరగడం సంభవిస్తాయి. ఇది సమాఖ్య వ్యవస్థకు శరాఘాతంగా పరిణమిస్తుంది.
ఆర్థిక దిగ్బంధనం
ఆర్థిక ద్రవ్య విభాగాలు మరో కీలక రంగంగా ఉన్నాయి. ప్రతిపక్షాల పాలనలోని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ద్రవ్యపరంగా వివక్ష ఎదుర్కొంటున్నాయి. కొన్ని సందర్భాల్లోనైతే కేరళ వంటి చోట్ల వాటిని ఆర్థిక దిగ్బంధనానికి గురి చేసే ప్రయత్నం జరుగుతున్నది. రాష్ట్రాలతో పంచుకోవాల్సిన ఉమ్మడి పన్నులను తగ్గించటం, రాష్ట్రాలకు వనరులను నిరాకరించటం, జిఎస్టి పరిహారం కొనసాగించక పోవడం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు పంపిణీ కావాల్సిన వాటా తగ్గించివేయటం కొన్నేళ్లుగా జరుగుతూ వస్తున్నది. 2016లో ఇది 41.1 శాతం ఉంటే 2023లో 35.1 శాతానికి పడిపోయింది.
రాష్ట్రాలకు వాటా ఇవ్వనవసరం లేని ఆదాయాలు సర్‌చార్జీలపై కేంద్రం మరింతగా ఆధార పడటంతో పన్ను ఆదాయం మొత్తం తగ్గించి వేసింది. వీటన్నిటిని మించి వనరులను తగ్గించి వేయడంతో రాష్ట్రాలు అప్పులు తెచ్చుకోవడం మీద ఆంక్షలు పెరిగాయి. అప్పు చేయ డంపై ఆంక్షలు పెట్టడం ద్వారా కేంద్రం రాష్ట్రాల ఆర్థిక వనరులను బిగించేసిి వాటి అభివఅద్ధి కార్యకలాపాలకు అడ్డుపడుతున్నది. ఆ తర్వాత బీజేపీ కేంద్ర పాలక పార్టీగా రాష్ట్రాల ఆర్థిక సమస్యలను ఆధారం చేసుకుని ఆ ప్రభుత్వాలపై వ్యతిరేక ప్రచారం చేసేందుకు పాల్పడుతున్నది. ఈవిధంగా నిధులను నిరాకరించే ఈ వివక్షాయుత రీతులు రాష్ట్రాలను కేంద్రానికి తోకలుగా మార్చివేస్తుంది. సమాఖ్య సూత్రం లక్షణాలనే దెబ్బతీస్తుంది.
హిందుత్వ రుద్దుడు
ఇక సమాఖ్య వ్యవస్థపై సాగుతున్న కేంద్రీకృత దాడిలో మూడో భాగం సాంస్కృతిక రంగానికి సంబంధించినది. విద్య, భాష, ఇతర సాంస్కఅతిక సంప్రదాయాలు దీని కిందకే వస్తాయి. బీజేపీ-ఆరెస్సెస్ నినాదం ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి అన్నదాన్ని దేశ వ్యాపి తంగా ఏకపక్షంగా రుద్దడం వల్ల సమాఖ్యతత్వంలోని సాంస్కృతిక వైవిధ్యం, బహుళత్వం కాలరాచి వేయబడతాయి. విద్యా రంగంలో హిందుత్వ విలువలను రుద్దే పోకడలు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లను ఉపయోగించుకుని వైస్ ఛాన్సలర్లను నియమించడం ద్వారా తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వైస్‌ఛాన్సలర్ల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలలో కేంద్రం ఆదేశాల మేరకు జరుగుతున్నది.
కేంద్రం జారీచేసిన యుజిసి మార్గదర్శకాల ముసాయిదా వైస్ ఛాన్సలర్ల నియామకంలో ఛాన్సలర్/గవర్నర్ పాత్రను మరింత పెంచు తున్నది. విద్యారంగం ఉమ్మడి జాబితాలోది. అయితే అనేక కేంద్ర విద్యా సంస్థలు కేంద్ర పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో ఆ పథకాలను అమలు చేయక తప్పని పరిస్థితి కల్పించబడుతున్నది. లేకపోతే వాటికి నిధులు నిలిపివేస్తామన్న బెదిరింపు వస్తోంది. భాషా విధానానికి సంబంధించి హిందీని బలవంతంగా రుద్దడానికి హిందీయేతర రాష్ట్రాలపై చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర సెన్సార్ బోర్డ్ ద్వారా హిందుత్వ సందేశంతో వచ్చే చిత్రాలను ప్రోత్సహించటం, ప్రజాస్వామ్య సాంస్కృతిక విలువలు చెప్పే చిత్రాలను అడ్డుకోవడం జరుగుతున్నది. ఈవిషయంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, సృజనలను పూర్తిగా కేంద్రీకృతం చేసే ఏకరూపంగా మార్చడానికి బీజేపీ-ఆరెస్సెస్ పాలకులాడుతున్నది.
హిందుత్వ నియంతృత్వ విధానం అమలు కావాలంటే కేంద్రీకృత పోకడలే ఉండాలి. అది రాష్ట్రాల హక్కులకు సమాఖ్యతత్వానికి వ్యతిరేకం. అందువల్ల సమాఖ్య తత్వాన్ని సంరక్షించుకోవడం, రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం నియంతృత్వ వ్యతిరేక, హిందుత్వ వ్యతిరేక పోరాటంలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి. ఈ పోరాటాన్ని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సమైక్యంగా కొనసాగించాలి. అన్ని వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకికశక్తుల విశాల ఐక్యతను పెంపొందించాలి.
ప్రకాశ్ కరత్
సమాఖ్య వ్యవస్థపై బహుముఖ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES