Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఆటలులియోనల్‌ మెస్సీ వస్తున్నాడు

లియోనల్‌ మెస్సీ వస్తున్నాడు

- Advertisement -

– డిసెంబర్‌ 12న కోల్‌కతాలో అడుగు
– సాకర్‌ స్టార్‌ భారత పర్యటన ఖరారు

న్యూఢిల్లీ : ప్రపంచ ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ (అర్జెంటీనా) భారత పర్యటనకు రానున్నాడు. 2011 తర్వాత తొలిసారి భారత్‌లో అడుగుపెట్టనున్న మెస్సీ.. మూడు నగరాల్లో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు మెస్సీ పర్యటన నిర్వాహకులు సతద్రు దత్త వివరాలు వెల్లడించాడు. ‘డిసెంబర్‌ 12న కోల్‌కతాకు రానున్న మెస్సీ.. కోల్‌కతా, అహ్మదాబాద్‌, ముంబయి నగరాల్లో గోట్‌ కన్సర్ట్‌, గోట్‌ కప్‌ పోటీల్లో పాల్గొంటాడు. డిసెంబర్‌ 15న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతాడు’ అని దత్త తెలిపారు. కోల్‌కతాలో లియోనల్‌ మెస్సీ కోసం ప్రత్యేకంగా మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో ఫుడ్‌ ఫెస్టీవల్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్‌ ఫెస్టీవల్‌లో హిల్సా సహా అన్ని రకాల బెంగాల్‌ చేపలు, తీపి వంటకాలులు మెస్సీకి వడ్డించనున్నారు. అర్జెంటీనా హెర్బల్‌ టీ ఇష్టపడే మెస్సీ కోసం.. అర్జెంటీనా, అస్సాం టీ మేళవింపుతో ప్రత్యేక తేనీరు అందించనున్నారు. భారత పర్యటనకు సంబంధించిన పోస్టర్‌ను లియోనల్‌ మెస్సీ తన సోషల్‌ మీడియా ఖాతాలో త్వరలోనే విడుదల చేస్తారని దత్త తెలిపారు.
కోల్‌కత ఈడెన్‌ గార్డెన్స్‌ లేదా సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో భారత క్రికెట్‌ దిగ్గజం సౌరవ్‌ గంగూలీతో పాటు టెన్నిస్‌ లెజెండ్‌ లియాండర్‌ పేస్‌, బాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ అబ్రహం పాల్గొననున్నారు. ముంబయిలో జరిగే ఈవెంట్‌లో సచిన్‌ టెండూల్కర్‌, ఎం.ఎస్‌ ధోని, రోహిత్‌ శర్మలు లియోనల్‌ మెస్సీతో ‘గోట్‌ కెప్టెన్స్‌’ మీట్‌లో పాల్గొనేలా ముంంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఈవెంట్‌కు ఇంకా అధికారిక ముద్ర పడలేదు. న్యూఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల ఈవెంట్‌లో మెస్సితో పాటు విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌ పాల్గొననున్నారు. ధర్మశాలలో భారత్‌, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌ ముగించుకుని శుభ్‌మన్‌ గిల్‌ నేరుగా మెస్సీ ఈవెంట్‌కు హాజరవుతాడు. అహ్మదాబాద్‌లో అదానీ ఫౌండేషన్‌ నిర్వహించే ఓ ప్రయివేటు కార్యక్రమంలో సైతం లియోనల్‌ మెస్సీ పాల్గొననున్నాడు. లియోనల్‌ మెస్సీ పర్యటనలో కోల్‌కతాలో అతడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఈవెంట్‌లో లియోనల్‌ మెస్సీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ సన్మానించనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad