– సోమవారం విచారణకు ఏఐఎఫ్‌ఎఫ్ కేసు
న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్), ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (ఎఫ్‌ఎస్‌డిఎల్) నడుమ మాస్టర్స్ రైట్ అగ్రీమెంట్ (ఎంఆర్‌ఏ) నిలిచిపోవటంతో భారత, అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్ల, ఇతర సిబ్బంది అయోమయంలో పడిపోయారు. ఎంఆర్‌ఏ ఒప్పందం లేకుండా ఇండియన్ సూపర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఆరంభించే పరిస్థితులు లేకపోవటంతో పలు క్లబ్‌లు ఆటగాళ్లు, కోచ్‌లు వేతనాలు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఎల్, ఫుట్‌బాల్ క్రీడాకారులు, భారత ఫుట్‌బాల్ భవిష్యత్ దృష్ట్యా ఈ సమస్యను సుప్రీంకోర్టుకు విన్నవించేందుకు ఐఎస్‌ఎల్ క్లబ్‌లు, ఏఐఎఫ్‌ఎఫ్ నిర్ణయించాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో సమావేశమైన క్లబ్ ప్రతినిధులు, ఏఐఎఫ్‌ఎఫ్ న్యాయ బృందం ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాయి. ఏఐఎఫ్‌ఎఫ్ ముసాయిదా రాజ్యాంగం కేసు సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే ఈ కేసులో తీర్పును ధర్మాసనం రిజర్వ్‌లో ఉంచినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఆర్‌ఏపై నిర్ణయం తీసుకునేందుకు వెసులుబాటు ఏమైనా కల్పించే అంశంలో సుప్రీంకోర్టును ఏఐఎఫ్‌ఎఫ్, ఐఎస్‌ఎల్ క్లబ్‌లు ఆశ్రయించనున్నాయి. తుది తీర్పు వెలువడినా, లేకపోయినా.. ఎంఆర్‌ఏ అంశంలో ఓ స్పష్టమైన దిశానిర్దేశం కోసం ఏఐఎఫ్‌ఎఫ్, ఐఎస్‌ఎల్ క్లబ్‌లు ఎదురుచూస్తున్నాయి.
రొనాల్డో జట్టుతో ఎఫ్‌సీ గోవా ఢీ! : ఏఎఫ్‌సి చాంపియన్స్ లీగ్ 2 గ్రూప్ దశలో సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో జట్టు అల్ నాసర్‌తో ఎఫ్‌సీ గోవా తలపడనుంది. ఈ లీగ్ హోమ్, అవే ఫార్మాట్‌లో జరుగునుండటంతో రొనొల్డో జట్టు భారత్‌లో ఓ మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో రొనాల్డో ఆడతాడా? లేదా? అనేది ఇప్పుడు చెప్పలేం. వెస్ట్ రీజియన్ డ్రాలో గ్రూప్-డిలో ఎఫ్‌సీ గోవా, అల్ నాసర్, అల్ జవారా, ఎఫ్‌సీ ఇస్టీకాల్ ఉండగా.. గ్రూప్-సిలో మోహన్ భగాన్ ఎస్‌జీ, అహల్ ఎఫ్‌సీ, సెఫహాన్ ఎఫ్‌సీ, అల్ హుస్సేన్‌లు నిలిచాయి. 16 జట్లు పోటీపడతున్న ఈ టోర్నీలో భారత్ నుంచి రెండు క్లబ్‌లు పోటీపడుతున్నాయి.