– ఆర్టీసీ బస్సు-కంటైనర్ లారీ ఢీ
– 20 మందికి తీవ్ర గాయాలు
– ఎంజీఎంకు తరలింపు
– ఎనిమిది మంది పరిస్థితి విషమం
నవతెలంగాణ-రాయపర్తి
వరంగల్-ఖమ్మం(563) జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు- కంటైనర్ లారీ ఎదురెదురుగా ఢీకొీన్నాయి. ఈ ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారులో జరిగింది. 20 మందికి గాయాలవ్వగా వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. రాయపర్తి ఎస్‌ఐ ముత్యం రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కంటైనర్ లారీ వరంగల్ వైపు వస్తోంది. ఈ క్రమంలో రాయపర్తి మండలంలోని మైలారం గ్రామం శివారులో బస్సు, కంటైనర్ ఎదురెదురుగా ఢీకొీన్నాయి. బస్సులో 44 మంది ప్రయాణికులు ఉండగా ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. అందులో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌కు తలకు తీవ్ర గాయంతోపాటు కాలు, చేయి విరిగిపోయాయి. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో జేసీబీ సహాయంతో వెలికితీశారు. గాయపడిన వారిని 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్జి ఝాన్సీ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దగ్గర ఉండి గాయపడిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
ఎంజీఎంకు చేరుకున్న అధికారులు
జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స గురించి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన చికిత్స అందేలా చూడాలని సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓకు సూచించారు.
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -