Sunday, May 4, 2025
Homeజాతీయంఆవిష్కరణల్లో వెనుకబాటు

ఆవిష్కరణల్లో వెనుకబాటు

- Advertisement -

– విదేశాల బాట పడుతున్న ఏఐ నిపుణులు స్వల్ప పెట్టుబడులు…కాలయాపనే కారణమంటున్న నిపుణులు
– అధికారుల అలసత్వం, ప్రభుత్వ ఆంక్షలపై ఇన్వెస్టర్ల మండిపాటు- దూసుకుపోతున్న చైనా

ఆవిష్కరణలు… ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని పలువురు మంత్రుల నోళ్లలో తరచూ నానుతున్న పదం ఇది. ఆవిష్కరణలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, అవసరమైన నిధులు సమకూరుస్తోందని వారంతా గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ చైనా, జపాన్‌, అమెరికా వంటి దేశాలతో పోలిస్తే ఈ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఈ రంగంలో ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. అధికారుల అలసత్వం, ప్రభుత్వ ఆంక్షలే ఈ పరిస్థితికి కారణమని స్టార్టప్‌ వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లు ధ్వజమెత్తారు. పైగా దేశంలోని పలువురు ఏఐ నిపుణులు విదేశాల బాట పడుతూ ఆయా దేశాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. దేశంలోకి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నప్పటికీ చైనా వంటి దేశాలతో పోటీ పడడం ఇప్పట్లో జరిగేది కాదని నిపుణులు పెదవి విరిచారు.
న్యూఢిల్లీ : దేశంలో ఆవిష్కరణల విషయంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెనుకబడి పోవడంపై ఈ నెల ప్రారంభంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్‌ గోయల్‌ విమర్శలు కురిపిం చారు. ‘మనం ఎక్కువగా ఆహార సరఫరా యాప్‌లపై దృష్టి సారిస్తున్నాం. నిరుద్యోగ యువతను చౌకగా లభించే కార్మికులు గా మారుస్తున్నాం. దీనివల్ల సంపన్నులు ఇంటి నుండి కదల కుండానే ఆహార పదార్థాలను తెప్పించుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా చైనా స్టార్టప్‌ ఏం చేస్తోంది? ఎలక్ట్రిక్‌ మొబిలిటీ బ్యాటరీ సాంకేతికతలపై కృషి చేస్తోంది. అందుకే వాళ్లు ఇప్పుడు ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ఎకోసిస్టమ్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్నారు’ అని ఓ పారిశ్రామిక కార్యక్రమంలో గోయల్‌ అన్నారు.
సేవల పైనే దృష్టి
వాస్తవానికి ప్రపంచంలో స్టార్టప్‌ల కోసం అధిక మొత్తంలో పెట్టుబడి పెడుతున్న దేశాలలో భారత్‌ ఒకటి. అయినప్పటికీ ఆధునిక ఉత్పత్తులను, కృత్రిమ మేధను ముందుకు తీసుకుపోవడంలో మనం బాగా వెనుకబడి ఉన్నామని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వెనుకబాటు 1980వ దశకం నుంచే కొనసాగుతోంది. తయారీ రంగంపై చైనా భారీగా పెట్టుబడులు పెడుతుంటే మనం మాత్రం సేవల రంగంపై ఆధారపడుతున్నాం.
ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఉత్పత్తిలో చైనా వాటా 30 శాతం కాగా మనది కేవలం 3 శాతం మాత్రమే. ఎంతసేపూ సేవల రంగం పైనే మన దృష్టంతా నిలిచి ఉంది. ఆవిష్కరణలపై దశాబ్దాలుగా పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా ప్రపంచ సాంకేతిక పోటీలో భారత్‌ బాగా వెనుకబడి పోయింది. ‘చైనా ఎకోసిస్టమ్‌ భిన్నంగా ఉంటుంది. ఉత్పత్తి విషయంలో ఆ దేశం ఇప్పటికే ఎంతో శక్తివంతమైంది. ఆ శక్తిని వారు చాలా కాలం నుండి నిర్మించుకుంటున్నారు. కాబట్టి మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి ఓ ఉత్పత్తిని తయారు చేయడం వారికి కష్టమేమీ కాదు’ అని బెంగళూరుకు చెందిన తక్షశిల ఇన్‌స్టిట్యూట్‌ నిపుణుడు ప్రణరు కోటస్థేన్‌ తెలిపారు. భారత్‌ సేవల ఆధారిత సాంకేతిక ఎకోసిస్టమ్‌గానే మిగిలిపోయినందున చైనాను ఓడించడం అసంభవమని చెప్పారు.
పెట్టుబడులు స్వల్పమే
అయితే ఆవిష్కరణలలో భారత్‌ పెట్టుబడి చాలా తక్కువగా ఉంది. ఈ స్వల్ప నిధులతో చైనాను ఎదుర్కోవడం అసంభవం. భారత్‌ తన జీడీపీలో 0.64 శాతాన్ని మాత్రమే పరిశోధన, అభివృద్ధిపై ఖర్చు చేస్తుండగా చైనా 2.4 శాతం, అమెరికా 3.5 శాతం ఖర్చు చేస్తున్నాయి. ‘మనం మన మేధావుల మేధస్సును అమెరికాకు ఎగుమతి చేస్తున్నాము. వారు అక్కడ నాయకులుగా ఎదిగి బెంగళూరు వంటి ఆఫ్‌షోర్‌ ప్రదేశాలను సృష్టిస్తున్నారు. వాళ్లు అమెరికాలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం లేదు. అమెరికన్లుగా మారి అమెరికా ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు’ అని ఆట్రెచ్‌ యూనివర్సిటీకి చెందిన పాయల్‌ అరోరా అన్నారు. చైనా, జపాన్‌, అమెరికా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిశోధన, అభివృద్ధి రంగంలో ప్రైవేటు పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. 2023లో చైనాకు చెందిన హువారు కంపెనీ ఒక్క పరిశోధన, అభివృద్ధి పైనే 23 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. మన దేశంలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిపి చేస్తున్న మొత్తం ఖర్చు కంటే ఇది ఎక్కువే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి చెందిన టాటా మోటార్స్‌, రిలయన్స్‌ ఇండిస్టీస్‌ కలిపి సాంకేతిక ఆవిష్కరణలపై రూ.23,365 కోట్లు (2.8 బిలియన్‌ డాలర్లు) ఖర్చు చేశాయి.
విదేశాలకు క్యూ కడుతున్న నిపుణులు
ఆవిష్కరణల కోసం ప్రభుత్వం ప్రయివేటు రంగం వైపు చూస్తోంది. ప్రభుత్వం కేవలం ఎకోసిస్టమ్‌ను మాత్రమే ప్రారంభించగలదని, కానీ దానిపై పని చేసేది పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధకులేనని ఇండియా ఏఐ మిషన్‌ సీఈఓ, ఉన్నతాధికారి అభిషేక్‌ సింగ్‌ తెలిపారు. భారత ఏఐ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ సజీవంగానే ఉన్నదని, కానీ అది ఇంకా బలోపేతం కాలేదని చెన్నైకి చెందిన రాండమ్‌వాక్‌ ఏఐ సీఈఓ అనంత్‌ మణి చెప్పారు. మనకు సర్వం ఏఐ, నిరామయి, కృత్రిమ్‌ ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నప్పటికీ వాటిలో కావాల్సిన జీవం లేదని వ్యాఖ్యానించారు. మన దేశంలో 200కు పైగా ఏఐ స్టార్టప్‌లు ఉన్నాయి. వీటికి గత సంవత్సరం 560 మిలియన్‌ డాలర్ల నిధులు సమకూరాయి. అయినప్పటికీ మన దేశానికి చెందిన ఏఐ నిపుణులు విదేశాలకు క్యూ కడుతున్నారు. మరోవైపు చైనాకు చెందిన ఏఐ నిపుణులు స్వదేశంలోనే ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. భారత్‌లోని ఏఐ నిపుణులలో చాలా మంది అమెరికా, యూరప్‌ వెళ్లినప్పటికీ ప్రపంచ సెమీకండక్టర్‌ డిజైన్‌ ఇంజినీర్లలో 20 శాతం మంది ఇప్పటికీ దేశంలోనే ఉన్నారు. దేశంలో పేరున్న పాతిక సెమీకండక్టర్‌ కంపెనీలలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలైన ఇంటెల్‌, న్విదియా, క్వాల్‌కామ్‌ వంటివి ఉండడం గమనార్హం.
ఇప్పుడిప్పుడే వస్తున్న పెట్టుబడులు
2018లో చైనాకు చెందిన హైటెక్‌ చిప్‌ తయారీపై అమెరికా ఆంక్షలు విధించడంతో స్వదేశీ ఆవిష్కరణలను బీజింగ్‌ పెంచింది. టెక్‌ పార్కులు, పరిశోధన-అభివృద్ధి ప్రయోగశాలల ఏర్పాటుకు, స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించడానికి భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఏడు సంవత్సరాలకు…అంటే 2021లో మన దేశంలో సెమీకండక్టర్‌ విధానాన్ని రూపొందించారు. టాటా సంస్థ గత సంవత్సరం గుజరాత్‌లో 11 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం ద్వారా చిప్‌ తయారీలో అడుగు పెట్టింది. ఇప్పుడిప్పుడే అనేక అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌ యూనిట్లు దేశంలోకి వస్తున్నాయి. ప్రపంచ స్థాయిలో పోటీ పడడానికి భారత్‌ చేయాల్సింది చేయడం లేదని కేంద్ర మాజీ మంత్రి మనీష్‌ తివారీ విమర్శించారు. ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహిస్తే పెట్టుబడులు పెరుగుతాయని ఆయన చెప్పారు. పెరుగుతున్న సుంకాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లకు చైనా అందుబాటులో లేనందున ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య యుద్ధం నుండి భారతీయ టెక్‌ రంగం ప్రయోజనం పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ముందుకు వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -