Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిఏమంటివేమంటివీ..!

ఏమంటివేమంటివీ..!

- Advertisement -

ఎంతమాటా.. ఎంతమాటా..! హవ్వ! ఎవరైనా వింటే నవ్వుతారన్న సిగ్గు కూడా లేకపోవడం అధినేతలకు అలవాటయిపోయింది కదా! దేశంలో చదువుకున్న పిల్లలు, ఎన్నో యేండ్లుగా దేశం గురించి కనీస అవగాహన ఉన్న సామాన్య ప్రజలు విని ఇది సరి అయినది కాదనుకుంటారన్న ఆలోచనే లేకుండా పోయింది. సాధారణంగా చదువుకునే బడిలో నుండి, వీధి కూడలి వరకు స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన అందరికీ గుర్తుకువచ్చే వాళ్లు ఎవరు? ఎవ్వరినడిగినా చెబుతారే! మహాత్మాగాంధీ, సుభాసు చంద్రబోస్‌, భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, అస్ఫకుల్లాఖాన్‌, వల్లభారు పటేల్‌, అల్లూరి సీతారామరాజు.. ఇలా చెప్పుకుంటూ స్మరిస్తాము. అంతేకాదు, ఆనాడు నాయకత్వం వహించిన జాతీయ కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు గుర్తుకురాక మానరుకదా! కామ్రేడ్‌ కృష్ణపిళ్ళై, ఇఎంఎస్‌, ఏకే గోపాలన్‌, సుందరయ్య మొదలైన కమ్యూనిస్టు యోధుల పోరాటం, స్వాతంత్య్రం కోసం వారు నిర్వహించిన పాత్ర చరిత్రలో లిఖించబడే ఉన్నది కదా!
కానీ మన ఘనత వహించిన మనుజ్ఞాన సిద్ధాంత పండితునికి వీళ్ళెవరూ గుర్తుకురాలేదు. స్మరించనూ లేదు. విస్మరించితివే అనుకో.. స్మరించినది ఎవరిని? ఎర్రకోట మువ్వెన్నెల జెండా రెపరెపలలోకి వాళ్లెలా వచ్చి చేరిరి? మూడు రంగుల జెండా అంటేనే గిట్టని వాళ్ళు, దానిని ఎగరేయము అని నిష్కర్షగా చెప్పినవాళ్లు, దేశభక్తిని అరువుగా తెచ్చుకున్న వాళ్ళు నీకు గుర్తుకురావటం పెద్ద ఆశ్చర్యపడే విషయం కాదు, ఎందుకంటే అందులో భాగమే నువ్వు కదా! జాతిపితగా పేరొందిన, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఐక్యం చేసిన మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సే వారసులు, స్వయం సేవక్‌ సంఫ్‌ు పరివారానికి స్వాతంత్య్ర దినోత్సవాన సెల్యూట్‌ చేయడం, వారు వందేళ్లుగా చేసిన సేవలను కొనియాడడం ఎంత విడ్డూరం! స్వాతంత్య్ర పోరాటానికి వ్యతిరేకులుగా, బ్రిటిష్‌పాలనకు అనకూలురుగా ఉన్న వారి చరిత్ర రికార్డు చేయబడే ఉంది. క్విట్‌ ఇండియా ఉద్యమానికి మేము మద్దతివ్వం, పాల్గొనం అని బహిరంగంగా ప్రకటించిన వారిని పొగడడమంటే ఏమిటి అర్థం? ప్రాణాలకు తెగించి, ఉరికంబాలెక్కిన త్యాగాలను అవమానపర్చటం కాదా! నిక్కచ్చిగా అవమానించడమే. మన రాజ్యాంగాన్ని కూడా సమ్మతించక, మనుస్మృతే అసలైన రాజ్యాంగమని నుడివిన సేవకులకు నీరాజనాలా! మను ధర్మమంటే స్త్రీ పురుషుల మధ్య అసమానతలను, సమాజంలో కుల అంతరాలను కొనసాగించడము వీరికి అభిలషణీయములని, ఈ సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమనీ ఆ ‘పరివార’మును శ్లాఘించడం ఎంత నీచము ఎంత నీచము! దీని వెనుక ఏ తంత్రము దాగి ఉన్నది, ఏ ప్రయోజనము ఎదరుచూస్తున్నది! స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఎనిమిది పదులు నిండుతున్న సందర్భంలో మన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే ఆత్మవిశ్వాసంలేని ఉపన్యాస చక్రవర్తిని ఏమని వర్ణించెదము! రష్యా నుండి చమురు దిగుమతి ఆపేయాలనీ లేదంటే యాభై శాతం సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరిక చేస్తుంటే, బెదిరిస్తుంటే, ఒక్కటంటే ఒక్కమాట మాట్లాడలేని అధైర్యవంతుడు మన నేత అయినందుకు మనమేల గర్వపడెదము! ఇదా మన స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి కొనసాగింపు. దేశపు ప్రతీక జెండా ఎగురవేస్తూ జాతి నేత మనకిచ్చే స్ఫూర్తి ఎలా ఉండాలి? సామ్రాజ్యవాదానికి తలగ్గి, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తాపత్రయపడటమా?
ఆయన ఎర్రకోటకు ఆగమిస్తున్నపుడు పదిహేడు హెలీక్యాప్టర్లల్లోంచి వెదజల్లబడుతున్న పుష్ప సమూహాలు ఎంత బాధకు గురయినవో! రాజ్‌ఘాట్‌ అమరుల స్థూపం కూడా నేత మాటలకు కలత నొందే ఉంటది. ఇంకా ఏం చెప్పారు – మిషన్‌ సుదర్శన్‌ ప్రాజెక్టుతో, వచ్చే పదేళ్ళలో దేశీయ సాంకేతిక అభివృద్ధిని సాధించిన దేశ పౌరులు సురక్షితంగా ఉండేందుకు పథకం వేసామని చెపుతున్నారు. ఇపుడు అభద్రతలో, రక్షణ లేమితో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల జీవితాలకు బాధ్యత ఎవరు వహిస్తారు? ఇంకేమన్నారో తెలుసా! రైతులకు వ్యతిరేకంగా ఉండే ఎలాంటి విధానాలకైనా నేనే గోడలా అడ్డుపడతాననటం ఎంత హాస్యాస్పదం! రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ల ప్రయోజనాలకోసం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవాలని రైతులు పోరాడితే దౌర్జన్యంచేసి, నిర్బంధించి, ప్రాణాలు తీసిన నేత ఆచరణను జనం అప్పుడే మర్చిపోతారా? అవన్నీ అలా ఉంచితే, ప్రజాస్వామ్య స్పృహకు ఆనవాలుగా ఉన్న ఓటు హక్కును హరించివేసే చర్యలు బీహార్‌లో చేయటాన్ని, సుప్రీంకోర్టు సైతం చివాట్లు పెట్టటాన్ని చూసైనా ప్రజలకు అర్థమవుతుందనే భయంలేని వాళ్లను ఏం చేస్తాం మనం!
మాటలకు విలువ, విశ్వసనీయత ఎప్పుడొస్తుందంటే, నిజాయితీ, నిబద్ధత, నిజాలు ఉంటేనే వస్తుంది. అవి ఏ కోశానాలేని నాయకుల మాటలు వింటే ఎందుకింత దిగజారిపోయామా? ఎంత వెనక్కి పోతున్నామా అని అనిపి స్తుంది! జాగ్రత్తగా మన వెన్ను మనం చరచుకోవటం చెయ్యాల్సిన పని.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad