Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంభారతావని డిజిటల్‌ వెలుగురేఖ కేరళ

భారతావని డిజిటల్‌ వెలుగురేఖ కేరళ

- Advertisement -

సంపూర్ణ డిజిటల్‌ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా ఖ్యాతి
21న అధికారికంగా ప్రకటించనున్న
కేరళ సీఎం పినరయి విజయన్‌
తిరువనంతపురం :
దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఇప్పటికే విరాజిల్లుతున్న కేరళ మరో అద్భుత ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే సంపూర్ణ డిజిటల్‌ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్ర్రంగా ఖ్యాతి నొందింది. ఇందుకు సంబంధించి ఈ నెల 21న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తిరువనంతపురంలో అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు సైతం డిజిటల్‌ అక్షరాస్యత నేర్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం స్థానిక కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల సహకారంతో వయో వృద్ధులకు సైతం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించింది. సెల్‌ఫోన్‌లోని టార్చ్‌లైట్‌ను ఎలా ఉపయోగించాలి.. వంటి విషయాలు మొదలుకొని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లో ఎలా టైప్‌ చేయాలి.. వాటిని నిత్య జీవితంలో వివిధ పనులకు ఎలా వినియోగించాలి అనే అంశాల వరకు ఈ శిక్షణ శిబిరాల్లో నేర్పించారు. ‘డిజి కేరళం – ఫుల్‌ డిజిటల్‌’ ప్రాజెక్టు పేరిట చేపట్టిన ఈ కార్యాచరణ లక్ష్యాలను సంపూర్ణంగా అధికమించిన నేపథ్యంలో కేరళను సంపూర్ణ డిజిటల్‌ అక్షరాస్యత రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వయసు, విద్య, ఆర్థిక స్థితి వంటి అంశాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పౌరుడికి డిజిటల్‌ టెక్నాలజీ ప్రయోజనాలు అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. తిరువనంతపురంలోని పుల్లంపుర పంచాయితీలో తొలుత ప్రారంభమైన ఈ డిజిటల్‌ అక్షరయాత్ర అనతికాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. దేశంలోనే తొలి పూర్తి స్థాయి డిజిటల్‌ అక్షరాస్యత కలిగిన గ్రామంగా పుల్లంపుర ఖ్యాతినార్జించడంతో ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని 2022లో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘డిజి కేరళ..’ను అమల్జేసింది. ప్రభుత్వం సైతం అనేక సేవలను ఆన్‌లైన్‌ ద్వారా ప్రజలకు అందిస్తోంది. చెల్లింపులు, ధ్రువపత్రాల జారీ వంటి అనేక అంశాలను ఆన్‌లైన్‌ విధానంలో ప్రజలకు సులభంగా అందిస్తూ మన్ననలు పొందుతోంది. అయితే ప్రతి రంగంలోనూ ఆన్‌లైన్‌ సేవలు విస్తృతమవుతున్న నేపథ్యంలో ఏ ఒక్క పౌరుడు వీటిని అందుకోవడంలో వెనుకబడరాదనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ ‘డిజి కేరళ..’ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేపట్టి 14 ఏళ్లు పైబడిన వారిలో డిజిటల్‌ పరిజ్ఞానం లేనివారిని గుర్తించింది. ఆ తర్వాత వారికి డిజిటల్‌ శిక్షణ ఇచ్చారు. ఇందులో స్మార్ట్‌ఫోన్‌ వినియోగంతో పాటు ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌, వీడియో, ఆడియో కాల్స్‌ చేయడం, ఫొటోలు, వీడియోలు డౌన్‌లోడ్‌ చేయడం వంటి అనేక అంశాలు నేర్పించారు. దీంతో పాటు యూట్యూబ్‌, సోషల్‌ మీడియా వాడకంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ‘ఇ- సేవలు’, బ్యాంకు సేవలకు సంబంధించిన ప్రాథమిక డిజిటల్‌ సేవలను అంటే నగదు పంపడం, ఇ-వ్యాలెట్‌ వాడటం వంటి అంశాలను నేర్పించారు. రాష్ట్రవ్యాప్తం గా 83 లక్షల కుటుంబాల్లోని 1.5 కోట్ల ప్రజలను సర్వే చేశారు. ఇందులో 21,88,398 మందిని డిజిటల్‌ నిరాక్షరాస్యులుగా గుర్తించారు. అందులో 21,87,966 మందికి డిజిటల్‌ ట్రైనింగ్‌ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక, గణాంక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్‌ అక్షరాస్యత పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ డిజిటల్‌ అక్షరాస్యత పరీక్షల్లో 21,8,667 (99.98 శాతం) మంది పాస్‌ అయ్యారు. తొలిసారి ఈ పరీక్ష రాసి విఫలమైన వారికి మరోమారు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి మళ్లీ శిక్షణ అందించారు. ఆ తర్వాత వారు కూడా డిజిటల్‌ అక్షరాస్యత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad