– తూములధార చెరువులు నింపాలి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని నాగపూర్ గ్రామ శివారులోని జిల్లా సరిహద్దులో ఉన్న ఇందిరమ్మ వరద కాలువ గేట్లను ఆదివారం అధికారులు ఎత్తివేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి భారీ వరద ప్రవాహం వస్తుండడంతో అధికారులు నీటిని ఇందిరమ్మ వరద కాలువలోకి విడుదల చేసిన నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు బాటమ్, టాప్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఇందిరమ్మ వరద కాలువలోకి నీటి విడుదల జరగనున్న నేపథ్యంలో
వరద కాలువ దిగువ పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య జనం ఇందిరమ్మ వరద కాలువను దాటే ప్రయత్నాలు చేయవద్దని ఇందిరమ్మ వరద కాలువ పరివాహక ప్రాంత గ్రామాల్లో గ్రామ పంచాయతీల ద్వారా హెచ్చరికలను కూడా జారీ చేశారు.
తూములధార నీటిని విడుదల చేయాలి….
అడపాదడప వర్షాలు కురుస్తున్నప్పటికీ చెరువులు కుంటల్లోకి చెప్పుకోదగ్గ నీరు రాని నేపథ్యంలో వరద ఇందిరమ్మ వరద కాలువకు ఏర్పాటుచేసిన తూముల ద్వారా నీటిని విడుదల చేసి, చెరువులు నింపాలని ప్రజలతోపాటు ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఇందిరమ్మ వరద కాలువ పరిహాక ప్రాంతంలోని ఏ గ్రామంలో కూడా చెప్పుకోదగ్గ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, వాగులు వంకలు పొంగిపొర్లిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఇందిరమ్మ వరద కాలువకు నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో వరద కాలువకు ఏర్పాటు చేసిన తూముల ద్వారా అధికారులు నీటిని వదిలి చెరువులను నింపాలని పలువురు కోరుతున్నారు.