Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రగతిశీల భావజాలం విస్తరించాలి

ప్రగతిశీల భావజాలం విస్తరించాలి

- Advertisement -

తెలకపల్లి రవి రచనలు అక్షరాయుధాలు ఆయన ఒక విజ్ఞానగని
పుస్తకాలను నిషేధిస్తున్న కాలంలో ఒకేసారి ఆరు రచనలు
వెలువడటం గొప్ప పరిణామం
ఆయన కథలన్నీ బాధితుల పక్షమే : తెలకపల్లి రవి రచనల
ఆవిష్కరణ సభలో వక్తలు
తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తికి ఘన నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రగతిశీల భావజాలం మరింత విస్తరించాల్సిన అవసరముందనీ, ఆ గురుతర బాధ్యత కవులపైనా, రచయితలపైనా ఉందని పలువురు వక్తలు నొక్కి చెప్పారు. కవి, రచయిత, రాజకీయ విశ్లేషకులు, వ్యాఖ్యాత, జర్నలిస్టుగా రాష్ట్రంలో పేరుపొందిన తెలకపల్లి రవి ఒక విజ్ఞాన గని అనీ, ఆయన రచనలు అక్షరాయుధాలు అని కొనియాడారు. సందర్భోచితంగా సమయస్ఫూర్తితో తన మాటలను, అక్షరాలను సంధించడంలో ఆయన దిట్ట అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో తెలకపల్లి రవి రచించిన ఆశయపథం(నవల), అభద్ర(కథలు), సజీవం(కవిత్వం), ప్రజాగానం(సామాజిక ఉద్యమ గీతాలు), మీరే ప్రేరణ..మీదే సాధన(వ్యక్తిత్వ వికాసం), నేనెప్పుడూ కమ్యూనిజానికే సొంతం : ఆరుద్ర (సంకలనం) పుస్తకాలను ప్రసిద్ధ కవి నిఖిలేశ్వర్‌, ఎమ్మెల్సీ, వాగ్గేయకారులు గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, నవతెలంగాణ సంపాదకులు రాంపల్లి రమేశ్‌, కవి యాకూబ్‌, సినిమా విమర్శకులు రెంటాల జయదేవ్‌, కవి, రచయిత పసునూరి రవీందర్‌ తదితరులు ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి మృతికి సంతాపం ప్రకటించారు.

నివాళులు అర్పించారు. తెలంగాణ సాహితీ కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిఖిలేశ్వర్‌ మాట్లాడుతూ..కవిత్వ రచన ప్రత్యేకమనీ, వచనం కంటే భిన్నమైనదని అన్నారు. కదిలించేదిగా, ఆలోచింపజేసేదిగా, చైతన్యపరిచేదిగా రవి సాహిత్యం ఉందని కొనియాడారు. కవి గోరటి వెంకన్న మాట్లాడుతూ…రవి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. మెరుగైన సమాజ మార్పు కోసం తనవంతు కృషి చేస్తున్న వారిలో రవి ఒకరని కొనియాడారు. ఆయన రచనలన్నీ బాధితుల పక్షంగానే ఉన్నాయనీ, అనుభవాలు, అనుభూతులు, స్వీయ పరిశీలనల నుంచి పుట్టికొచ్చినదిగా ఆయన సాహిత్యం ఉందని చెప్పారు. ప్రగతిశీల సాహిత్యం మరింత రావాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. నవతెలంగాణ సంపాదకులు రాంపల్లి రమేశ్‌ మాట్లాడుతూ..పుస్తకాలు నిషేధిస్తున్న కాలంలో ధిక్కార స్వరంతో కూడిన ఆరు రచనలు ఒకేసారి ఆవిష్కరించుకోవడం గొప్ప పరిణామం అన్నారు. తనలాంటి ఎందరో జర్నలిస్టులకు ఆయన గురువు అన్నారు. కవి యాకూబ్‌ మాట్లాడుతూ…శ్రీశ్రీని కోడ్‌ చేయకుండా రవి మాటలు, రచనలుండవని తెలిపారు. రవి సాంస్కృతిక ఆత్మను ధరించారన్నారు. జనకవనం కార్యక్రమాన్ని రవితో కలిసి నడిపిన అనుభవాలను పంచుకున్నారు. అభద్ర కథలలో సామాజిక స్పృహ ఉందనీ, ఆయన కథలన్నీ బాధితుల పక్షానే ఉన్నాయని చెప్పారు. కవి, రచయిత పసునూరి రవీందర్‌ మాట్లాడుతూ…ఆశయపథం నవల కూలిపోరాటాన్ని చక్కగా వివరించిందనీ, ఆ నవల యధార్థ గాథల ఆధారంగా రచించిన ఒక డాక్యుమెంటరీ అని కొనియాడారు. తెలకపల్లి రవి వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్లనే తాను ఈ స్థాయికి ఎదిగానని సగర్వంగా చెప్పుకున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి మాట్లాడుతూ..సమాజానికి ఏదో చేయాలనే తపన రవి రచనల్లో అడుగడుగునా కనిపిస్తోందన్నారు. సినీ విమర్శకులు రెంటాల జయదేవ మాట్లాడుతూ..

రవి రాసే సాహిత్యంలోనూ, మాట్లాడే చర్చావేదికల్లోనూ ప్రవాహశీలత, ప్రాసంగిత, ప్రామాణికత అనే మూడు లక్షణాలు కచ్చితంగా ఉంటాయని కొనియాడారు. తాను మద్రాసు నుంచి వచ్చి తెలుగు జర్నలిజంలోకి అడుగుపెట్టడానికి రవినే కారణమనీ, ఆయన గైడెన్స్‌తో ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. తెలకపల్లి రవి మాట్లాడుతూ…తన రచనా పరంపర ఇలాగే కొనసాగుతుందన్నారు. ఆశయం చిరంజీవేననీ, అది నిరంతరం ముందుకు నడిపిస్తున్నదని తెలిపారు. డిజిటల్‌ యుగంలోనూ పుస్తకాలకు ప్రాధాన్యత ఉందన్నారు. ఎంత అణచివేత, నిషేధాలు విధించినా పుస్తకం ఎన్నటికీ చిరంజీవినే అని చెప్పారు. ప్రగతిశీల భావజాలంపై దాడి రోజురోజుకీ తీవ్రమవ్వటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల మరణించిన కవి, రచయిత తంగిరాల చక్రవర్తితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా, తెలంగాణ సాహితీ ఉపాధ్యక్షులు అనంతోజు మోహన్‌కృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌కె. సలీమ, హైదరాబాద్‌ నగర అధ్యక్షులు ఏబూషి నరసింహ, నాయకులు శరత్‌ సుదర్శి, రేఖ, తెలకపల్లి రవి కుటుంబ సభ్యులు, కవులు, రచయితలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad