– నాగర్‌కర్నూల్లోని బీసీ కాలనీలో సీపీఐ(ఎం) బృందం సందర్శన
– బురదరోడ్లతో ఆస్పత్రికి వెళ్లడానికే గంట ప్రయాణం
– అధికారులు వచ్చి ప్రజల సమస్యలు తీర్చాలి : జాన్‌వెస్లీ
నవతెలంగాణ -తాడూర్
బీసీ కాలనీల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం బీసీ కాలనీని సీపీఐ(ఎం) జిల్లా బృందం సందర్శించింది. బృందంతో పాటు జాన్‌వెస్లీ పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న బాధలను, ఇబ్బందులను ప్రజలు సీపీఐ(ఎం) నేతలకు వివరించారు. వర్షంలోనే జాన్‌వెస్లీ బీసీ కాలనీలో తిరుగుతూ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీకాలనీ అంతా బురదమయంగా మారిందన్నారు. వర్షాలు పడినప్పుడు అనారోగ్యానికి గురై వైద్యం కోసం వెళ్లాలంటే కాలనీ నుంచి హాస్పిటల్ వెళ్లడానికే గంట ప్రయాణం పడుతోందన్నారు. బీసీకాలనీలోని 17వ వార్డులో 600 కుటుంబాలు 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారని తెలిపారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సంద ర్శించి స్థానిక సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. గత అనేక సంవత్సరాలుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తున్నా గత పాలకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి కాలనీ మొత్తం సీసీరోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి డిమాండ్ వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కారం చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు వేసిన రోడ్లకు వైర్లు బిగించి, వీధిలైట్లు వేయాలన్నారు. అవి లేకపోవడంతో ఇండ్లల్లోకి విషసర్పాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాలనీవాసులు చెబుతున్నా పట్టించు కోకుండా నిర్లక్ష్యానికి గురి చేయడం అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి తగదని హెచ్చరించారు. అనంతరం కేసరి సముద్రం అలుగు వలన రాకపోకలకు కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు, కందికొండ గీత, జిల్లా నాయకులు రామయ్య, శంకర్‌నాయక్, శ్రీను, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రమేష్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న, ప్రజా సంఘాల నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
ప్రజలతో జాన్‌వెస్లీ ముఖాముఖి
- Advertisement -
- Advertisement -