– ఎల్విష్ యాదవ్ ఇంటిపై 12 రౌండ్ల కాల్పులు
– బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకే : హిమాన్షు గ్యాంగ్
గుర్‌గ్రామ్: బిగ్‌బాస్ (హిందీ) సీజన్-2 విజేత, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు భారీగా కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో గురుగ్రామ్‌లోని ఆయన ఇంటి వద్దకు ముగ్గురు గుర్తు తెలియని దుంగడులు బైక్‌పై వచ్చారు. కాసేపు అక్కడే గడిపి.. ఎల్విష్ నివాసంపై 12 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ బృందాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. భవనంలోని రెండు, మూడో అంతస్తులో ఎల్విష్ కుటుంబంతో సహా నివసిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో తూటాలు మొదటి అంతస్తులోకి దూసుకువెళ్లాయి. దాడి జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడనీ, ఆయన కుటుంబసభ్యులు, కేర్‌టేకర్ ఉన్నారని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అయితే ఘటనకు ముందు ఆయనకు ఎలాంటి బెదిరింపులూ రాలేదని కుటుంబసభ్యులు వెల్లడించారు.అయితే ఎల్విష్ యాదవ్ నివాసంపై దాడి చేసింది తామే అని హర్యానాకు చెందిన గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు ముఠా ప్రకటించుకుంది. తమ సభ్యులు నీరజ్, భౌరిటోలియా ఈ కాల్పులు జరిపినట్టు తెలిపింది. అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తూ.. ఎల్విష్ చాలా కుటుంబాలను నాశనం చేశాడని అందుకే ఆయన నివాసంపై కాల్పులు జరిపామని పేర్కొన్నది. ఈ యాప్‌లను ఎవరు ప్రమోట్ చేసినా వారి వైపు కూడా తూటాలు దూసుకువస్తాయని హెచ్చరించింది. ఈ ముఠాను నడిపే హిమాన్షు కొన్నేండ్ల కిందట పోర్చుగల్‌కు పారిపోయి.. అక్కడి నుంచే కార్యకలాపాలు నడుపుతున్నాడని నిఘావర్గాలు వివరించాయి.
బిగ్‌బాస్-2 విజేతే టార్గెట్
- Advertisement -
- Advertisement -