నవతెలంగాణ – మల్హర్ రావు
వర్షాకాలం సీజన్ ప్రారంభానికి చివరలో మండలలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.జూన్ మొదటి వారంలో రైతులు పత్తి, ఆగస్టు మొదటి వారంలో వరి పంటలు చేశారు. సాగు చేసిన పంటలకు అనుకూలంగా జూన్ నెలలో వర్షాలు, అలాగే ఆగస్టు నెలలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముమ్మరంగా రైతులు పంటలు సాగు చేశారు. ప్రస్తుతం ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మానేరు పరివాహక ప్రాంతాలైన తాడిచెర్ల, మల్లారం, రావుపల్లి, వళ్లెంకుంట, కుంభంపల్లి, కేశారంపల్లి, పివినగర్ గ్రామాల్లోని వరి పంటలు నీట మునిగి దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కుంభంపల్లి, వళ్లెంకుంట, పివినగర్ గ్రామాల్లోని పొలాలు నీట మునిగాయి. మూడేళ్ళ క్రితం వేలాది ఎకరాల్లో పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ పార్మర్ లు వరద ఉధృతి కొట్టుకపోయిన్ పరిస్థితి. కానీ పరిహారం ఇంకా రాలేదు.
పంటలు దెబ్బతినే అవకాశం…
వరుసగా కురుస్తున్న వర్షాల వలన ప్రస్తుతం పూత,గూడ దశలో ఉన్న పత్తి,కలుపు దశలో ఉన్న వరి దెబ్బతినే అవకాశం ఉంది. పంట చేలలో లోతట్టు, మానేరు పరివాహక ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో పత్తి,వరి పంటలకు నష్ట వాటిల్లే అవకాశం ఉంది. వర్షపునీరు నిల్వ ఉండకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు తొల గించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటే పంట ఎదిగే అవకాశం ఉందన్నారు.
పొలాల్లో నిలుస్తున్న వర్షపునీరు..
వరుసగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరి పొలాల్లో,పత్తి పంట చేలలో వర్షపు నీరు నిలుస్తుంది.పత్తి పూత దశలో వరి కలుపు దశలో ఉన్నాయని వరుసగా వర్షాలు కురిస్తే పంటలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. నీరు నిలిచి ఉండటంతో తెగుళ్లు సోకే ప్రమాదం ఉంది. తెగుళ్లు సోకితే ఆకులు రాలిపోయి కాండం ఎర్రబారి పురుగు ఉధృతి పెరుగుతుందని రైతులు వాపోతున్నారు. మండలంలో ఖరీప్ సీజన్లో మొత్తం 22,150 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లుగా,ఇందులో వరి15,500,పత్తి,3,600,మిర్చి 1500 సాగు చేశారు.అత్యధికంగా వరి, పత్తి సాగు చేస్తున్నారు. వర్షాలతో ఎరువులు వేయడం, పిచికారీ చేయడం ఆలస్యం అవుతుం దని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నీరు నిల్వ లేకుండా చూడాలి: వ్యవసాయ అధికారులు
వరుసగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. ప్రస్తుతం వర్షాలు లేనందున పంటచేలలో నిలిచిన నీటిని తొలగిస్తే పంట ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టింనందున రైతు లు పంటలు ఎరువులతో పాటు మందులు పిచికారీ చేసే అవకాశం ఉంది.