నవతెలంగాణ – ఆర్మూర్
విద్య అనేది జీవితానికి పునాది అని క్షత్రియ కళాశాల ముఖ్య అతిథి అనపర్తి గురు చరణం అన్నారు. మండల లోని చేపూరు గ్రామ శివారు క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ ఆర్గనైజేషన్ కార్యక్రమం సోమ వారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..విద్య అనేది జీవితానికి పునాది అని, ప్రతీ విద్యార్థి కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, సమాజానికి గౌరవం తీసుకురావాలని సూచించారు. ఒక విద్యార్థి జీవితంలో వినయం, చదువు, సంస్కారం అనే మూడు గుణాలు తప్పనిసరిగా ఉండాలని, అవే వ్యక్తిత్వానికి నిజమైన పునాది అవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన వ్యక్తిగా ఎదగాలనే సంకల్పం కలిగి, స్పష్టమైన గమ్యం వైపు అడుగులు వేయాలని ఆయన హితవు పలికారు. విద్యార్థులు కేవలం పుస్తకాల పరిజ్ఞానం మీద మాత్రమే కాకుండా, నైతిక విలువలు, మర్యాద, క్రమశిక్షణలను కూడా అలవర్చుకోవాలని, ఆ గుణాలు ఉన్నప్పుడే వారు సమాజంలో మంచి పౌరులుగా నిలుస్తారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఒక విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, అది లేకపోతే ఎంతటి ప్రతిభ ఉన్నా సరైన మార్గంలో ఉపయోగించలేమని పేర్కొన్నారు. సమయపాలన అంటేనే విజయానికి మొదటి మెట్టు అని, సమయాన్ని విలువైనదిగా భావించి ప్రతి రోజు కొత్తగా నేర్చుకునే అలవాటు ఏర్పరచుకోవాలని సూచించారు.
విద్యార్థి యొక్క ఉన్నతి విద్య, పరిపూర్ణ వ్యక్తిత్వం అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, చదువుతో పాటు మంచి ఆలోచనలు, సానుకూల దృక్పథం, కష్టపడి పనిచేసే అలవాటు ఉంటే తప్పకుండా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను సాధించగలరని అన్నారు., మంచి భాష, మంచి నడవడిక, మర్యాద విద్యార్థుల వ్యక్తిత్వాన్ని మరింత వెలుగులోకి తీసుకువస్తాయని తెలిపారు. విద్య అనేది కేవలం పరీక్షలు పాస్ కావడానికి మాత్రమే కాదని, మన ఆచరణలోని విలువలు, నైతికత, సాంస్కృతిక వారసత్వం కలిపి ఒక సమగ్ర వ్యక్తిగా మనల్ని తీర్చిదిద్దుతుందని ఆయన అన్నారు. విద్యార్థులు తమ జీవితంలో ఒక స్పష్టమైన గమ్యం నిర్ణయించుకొని, దాని వైపు క్రమపద్ధతిగా ముందుకు సాగితే మాత్రమే సమాజానికి ఆదర్శప్రాయమైన వ్యక్తులుగా నిలుస్తారని హితవు పలికారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కట్కం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాజెక్టులపై, ప్రాక్టికల్ నాలెడ్జ్ పై దృష్టి పెట్టాలని, కాలేజ్ అందిస్తున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.కళాశాల ఫస్ట్ ఇయర్ హెచ్ ఓ డి స్వప్న మాట్లాడుతూ, మొదటి సంవత్సరం అనేది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది కాబట్టి, ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణతో, నిబద్ధతతో చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు, విద్యార్థులు , తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.