ఒకప్పుడు జ్ఞాపకాలను మనసులో దాచుకుని అప్పుడప్పుడు గుర్తు చేసుకునేవారు. ఆ రోజుల్లో ఫొటో అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్క పెళ్లికి తప్ప ఇతర శుభకార్యాలకు ఫొటోలు తీసుకోవడం చాలా అరుదు. నేడు టెక్నాలజీ పెరిగి ఫోన్ వచ్చేసాక ఫొటోలు తీసుకోవడం చాలా తేలికైపోయింది. అయితే చేతిలో ఫోనో, కెమెరానో ఉన్నంత మాత్రాన అందమైన ఫొటోలు తీయడం అందరి వల్లా కాదు. ఇది కూడా ఓ కళ. కొన్ని ఫొటోలు చూసినప్పుడు ‘ఎంత అద్భుతంగా తీశారో’ అనుకుంటాం. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు మాత్రమే అది సాధ్యం. అయితే ఫొటోగ్రఫీ చాలా వరకు పురుషులకే పరిమితమైన కళగా మన సమాజంలో ఉంది. ఇటీవల కాలంలో మహిళలు కూడా ఈ రంగంలో తమ సత్తా చాటుకుంటున్నారు. అలాంటి వారిలో రమాదేవి ఒకరు. నేడు ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో…
మీ కుటుంబ నేపథ్యం?
మా అమ్మ లక్ష్మీకాంత, నాన్న సోమేశ్వర్ రావు. నాన్న వ్యవసాయం చేసేవారు, అమ్మ గృహిణి. వాళ్లకు మేము ముగ్గురం పిల్లలం. నాకు అక్క, అన్న ఉన్నారు. మా సొంత ఊరు వరంగల్ జిల్లా, నరసంపేట మండలం, రాజుపేట.
ఫొటోగ్రాఫర్ కావాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
మా వారు ఫొటోగ్రాఫర్. మాకు ‘న్యూ వంశి డిజిటల్ స్టూడియో’ చిక్కడపల్లిలో ఉంది. మా పెళ్లి తర్వాత ఆయనతో కలిసి నేను కూడా స్టూడియో చూసుకుంటూ ఉండే దాన్ని. అలా నాకూ ఆసక్తి పెరిగింది. అది గమనించి మా వారు నాకు ఫొటోగ్రఫి నేర్పించారు. ఈ రంగంలోకి అడుగుపెట్టి 21 ఏండ్లు అవుతుంది.
ఫొటో గ్రాఫేర్‌కి ఎటువంటి అంశాలపై అవగాహన ఉండాలి?
మార్కెట్‌లోకి కొత్త కెమెరాలువస్తూ ఉంటాయి. వాటిపై అవగాహన పెంచుకోవాలి. లెన్స్, లైట్స్, ట్రైపాడ్ వంటి గేర్‌ను కాపాడటం, రిపేర్ చేసుకోవడం, ఫోటో ఎడిటింగ్ వచ్చి ఉండాలి. కొన్నిసార్లు అధిక అంచనాలు పెట్టుకునే కస్టమర్స్‌తో డీల్ చేయాల్సి వస్తుంది. అలాగే టైమ్ మేనేజ్‌మెంట్, ఫొటో షూట్స్, ఎడిటింగ్, డెలివరీ, ఒకే టైమ్‌లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయడం, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్‌లో యాక్టివ్‌గా ఉండటం. క్రియేటివిటీని నిలుపుకోవడం, కొత్త యాంగిల్స్, లైటింగ్ టెక్నిక్స్ ట్రై చేయడం, ఇతర ఫొటోగ్రాఫర్లతో పోటీ పడుతూ యూనిక్ స్టైల్‌లో ఉండటం మొదలైన అంశాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి.
మహిళ ఫొటోగ్రాఫర్‌గా మీరేమైనా సమస్యలు ఎదుర్కొన్నారు?
ఫొటోగ్రఫీ అంటే పురుషుల వృత్తి అనే భావన ప్రజల్లో ఉంటుంది. పెళ్లిళ్లు, ఈవెంట్లు ఎక్కువగా రాత్రి పూట జరుగుతుంటాయి. అలాంటప్పుడు సేఫ్టీ, ట్రాన్స్‌పోర్ట్ వంటి సమస్యలు వస్తుంటాయి. బరువైన పరికరాలు మోయాల్సి వుంటుంది. కెమెరా బాడీలు, లెన్సులు, లైటింగ్ కిట్ కలిపి బరువుగా ఉంటాయి. తరచుగా దీన్ని మోయడం కాస్త కష్టంగానే ఉంటుంది. క్లయింట్స్‌లో కొందరు మహిళా ఫొటోగ్రాఫర్‌కి ప్రాధాన్యం ఇవ్వరు. ‘మీరు హ్యాండిల్ చేయగలరా?’ అని అడుగుతుంటారు. ఇలా మహిళలను తక్కువగా అంచనా వేస్తారు. పేమెంట్ విషయంలో కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు. నేనైతే మావారితో కలిసి ఈవెంట్స్‌కి వెళ్తుంటాను. అందుకే పెద్దగా సమస్యలేమీ ఎదుర్కోలేదు.
బ్లాక్ అండ్ వైట్, కలర్ ఫొటోల్లో ఏవి ఉత్తమ మైనవి?
బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు సాధారణంగా కలర్ ఫొటోల కంటే ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుంది. ఉత్తమ మైనవి కూడా. ఫొటోలు జ్ఞాపకాల కోసం దాచుకుంటాం. కానీ ఇప్పుడు ఎవ్వరూ ప్రింట్ చేయించుకోవడం లేదు. సాఫ్ట్ కాపీలు తీసుకుంటున్నారు.
నేటి టెక్నాలజీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతోంది?
ఫొటోగ్రఫీలో టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతోంది. ఫొటోలు తీయడం, ఎడిట్ చేయడం, షేర్ చేయడం అన్ని దశల్లోనూ ఉపయోగపడుతోంది. స్మార్ట్‌ఫోన్లలో ఉన్న హై రెజల్యూషన్ కెమెరాలు ఫొటో క్వాలిటీ ఇస్తున్నాయి.Photoshop, Lightroom, Canva లాంటి సాఫ్ట్‌వేర్లు కలర్స్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ మార్చడం, స్కిన్ స్మూత్ చేయడం లాంటివి సులభం చేశాయి. ఫొటోల్లో అనవసరమైన వస్తువులను ఆటోమేటిక్‌గా తొలగిస్తాయి. తక్కువ లైట్‌లో కూడా క్లీన్ ఫొటోలు వచ్చేలా నైట్ మూడ్ వంటి టెక్నాలజీ పనిచేస్తుంది. డ్రోన్ ఫొటోగ్రఫీ ద్వారా బర్డ్-ఐ వ్యూ, సినిమాటిక్ షాట్స్ సులభంగా తీయవచ్చు.Google Photos, iCloud, Adobe Creative Cloud వంటి ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ఎక్కడైనా ఫొటోలు సేఫ్‌గా స్టోర్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు. ఇప్పుడు హై-క్వాలిటీ ఇన్‌స్టంట్ ప్రింటర్లు, యూవీ ప్రింటింగ్ ద్వారా ఆల్బమ్స్, ఫ్రేమ్స్, కాన్వాస్ ప్రింట్స్ తక్కువ టైమ్‌లో రెడీ అవుతున్నాయి.
ఫొటోలు తీయడంతో పాటు ప్రింటింగ్, డెవలపింగ్ కూడా చేస్తారా?
బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను రియల్‌గా డెవలప్ చేసి ప్రింట్ చేసేదాన్ని. ఇన్‌స్టంట్ ప్రింటింగ్ కూడా చేసేదాన్ని.
మీరు ఇప్పటి వరకు ఎటువంటి ఈవెంట్స్‌కి వెళ్లారు?
నాకు ఇప్పటికే ఫొటోగ్రఫీలో చాలా రకాల ఈవెంట్స్ కవర్ చేసే అవకాశం వచ్చింది. వెడ్డింగ్స్, బర్త్‌డేస్, సారీ ఫంక్షన్స్, కాలేజ్ ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కవర్ చేసాను.
అవార్డులు ఏమైనా అందుకున్నారా?
బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అవార్డు వచ్చింది. అదే కాక సన్మానాలు కూడా చాలా జరిగాయి. ఇవన్నీ నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి నా బాధ్యతను మరింత పెంచాయి.
కుటుంబ సహకారం ఎలా ఉంది?
నా భర్త, నేనూ ఇద్దరం ఫొటోగ్రాఫర్లం కాబట్టి మాకు ఎలాంటి సమస్యా లేదు. మా పిల్లలిద్దరూ చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఉంచి, బయట నుండి తాళం పెట్టి మేము నైట్ ప్రోగ్రామ్‌లకు వెళ్ళేవాళ్లం.
మహిళలకు ఈ రంగంలో ప్రోత్సాహం ఎలా ఉంది?
ఇటీవలి కాలంలో ప్రోత్సాహం పెరిగిందనే చెప్పాలి. ఇప్పటి కెమెరాలు, లైటింగ్, ఎడిటింగ్ టూల్స్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ఫోన్లలో కూడా ప్రొఫెషనల్ లెవెల్ ఫొటోలు తీయొచ్చు. Instagram, YouTube, Pinterest లాంటి ప్లాట్‌ఫార్మ్‌లు మహిళా ఫొటోగ్రాఫర్లకు తమ పనిని చూపించడానికి, కస్ట మర్లను చేరుకోవడానికి పెద్ద అవకాశమి స్తున్నాయి. పెళ్లిళ్లు, ఈవెంట్లు, మేటర్నిటీ షూట్లు, న్యూబోర్న్ ఫొటోగ్రఫీ లాంటివాటిలో మహిళా ఫొటోగ్రాఫర్లకు ప్రత్యేక డిమాండ్ ఉంది.
– పాలపర్తి సంధ్యారాణి