Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజివెలుగుల చోట చీకటి

వెలుగుల చోట చీకటి

- Advertisement -

అజ్ఞానపు తిమిరాలను తొలగించి విజ్ఞానపు వెలుగులు నింపాల్సిన పాఠశాలలు అంధకారంలో మగ్గుతున్నాయి నేడు. కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన అధ్యయనంలో తెలంగాణ రాష్ట్రంలో ఐదువేల పైచిలుకు బడులు కరెంటు సౌకర్యం లేక చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాయని గణంకాలు చెబుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి 50కి పైగా విద్యార్థులు ఉన్న అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఐదు చొప్పున కంప్యూటర్లు ఏర్పాటుచేసి ఏఐ బోధనతో విద్యార్థులకు పాఠాలు చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. నిర్ణయం మంచిదే… దానివలన విద్యార్థులలో విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు గణనీయంగా పెరుగుతాయని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్న మాట వాస్తవమే. కానీ, ఇవన్ని జరగాలంటే ముందు ఆయా బడులకు కరెంట్‌ సౌకర్యం ఉండాలి. అదే లేనప్పుడు ఎన్ని హంగులున్నా… అవి అక్కరకు రావు.
ప్రభుత్వ పాఠశాలలకు నిర్వహణ నిధులు ఇప్పటివరకు మంజూరు చేయలేదు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా వాటి ఊసేలేదు. సర్కారు బడులను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఇబ్బందుల మధ్య బడులు కొనసాగు తున్నాయి. బడుల ప్రారంభానికి రావాల్సిన నిధులను ఆలస్యంగా కేటాయిస్తుండగా చేస్తుండగా చేసేదేమి లేక ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపరిస్తోంది. ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య’ అంటారు నెల్సన్‌ మండేలా. సమాజ పురోగమనంలో విద్య యొక్క కీలక పాత్రను ఆయన నొక్కి చెప్పారు.
ప్రభుత్వ పాఠశాల అంటేనే… చిన్నచూపు. ఉన్నతమైన చదువులు చదవాలంటే కార్పోరేట్‌ పాఠశాలలు, కాలేజీలే మేలన్న అపోహతో కొందరు ఎల్‌కేజీ నుంచే లక్షలు ఖర్చు చేసి ప్రయివేట్‌ విద్యాసంస్థల్లో చదివిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకో వడమే లక్ష్యంగా వినూత్న కార్యక్ర మాలు చేపడుతుండటం… అందులో భాగంగా పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక విద్యను అందిస్తూ ఏఐతో సరికొత్త ఒరవడిని సృష్టించడం సంతో షమే. కానీ, ఇది కొన్ని పాఠశాలలకే పరిమితం అవుతుంది. మిగతా పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల సంగతేంటి?
విరిగిన కిటికీలు, పగిలిన తలుపులు, చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో నిండిన పరిసరాలు, పాములు, తేళ్లు, విష పురుగులు, అపరిశుభ్రంగా మారిన టాయిలెట్లతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అసలే ఇది వర్షాకాలం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఇలాంటి తరుణంలో పాఠశాలలకు, గురుకులాలకు కరెంటు లేకపోతే విద్యార్థులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అన్నంలో పురుగులు రావడం, ఆహారం కల్తీ జరగడం, ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం.. ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నిత్యకృత్యం అవుతున్నాయి. అద్దె భవనాల్లో సరైన మౌలిక వసతులు లేవు. ప్రధానంగా తాగునీరుతోపాటు వాడుక నీటికి సైతం కటకట ఉండడం, కనీసం స్నానాలు చేసేందుకు వీల్లేకపోవడంతో మరి ముఖ్యంగా విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.
భారతదేశంలో మితవాద ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం జాతి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోంది. నయా ఉదారవాద విధానాల పుణ్యమా అని సమాజంలో ఎక్కువ మందికి నాణ్యమైన విద్య అందని ద్రాక్షలా మారింది. ఇప్పటికే కేంద్ర పాలకవర్గాలు ఒక పథకం ప్రకారం ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తూ… దాని పీక నులుముతున్నారు. ఆధునిక జీవన ప్రమాణాలకు తగినట్లుగా ప్రభుత్వ విద్యను పరిపుష్టం చేయాల్సి వుండగా, దానికి భిన్నంగా కార్పొరేట్‌ విద్యాసంస్థలను పెంచి పోషిస్తున్నారు. విద్యను సరుకుగా మార్చి, ప్రాథమిక విద్యావ్యవస్థ తల్లివేరును పెరికివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆ బుద్ధి జీవులు ఎదిగే బడులలో అజ్ఞాన, అశాస్త్రీయ పాఠ్యాంశాలను విద్యార్థుల మెదళ్లలో చొప్పిస్తున్నారు. జాతీయ విద్యావిధానం పేరుతో విజ్ఞాన వాటికలను మూసివేస్తున్నారు.
ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చేసి విద్యార్థుల మెదళ్లకు ఆ చీకట్లు అంటుకోకుండా చూడాల్సింది పోయి… వారిని చీకటిలో ఉంచడం ఎంతవరకు సమంజసం? ‘విద్యా గుళ్లు మూసినా, ప్రశ్నించే మనసుల తలుపులు మూయలేరు’ అంటారు దాశరథి. అత్యంత చిన్న దేశమైన క్యూబాలో చదువు బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటోంది. విద్యలో దేశంలోనే అగ్రస్థానంలో వున్న కేరళ, ప్రభుత్వ విద్యకే పెద్ద పీట వేస్తున్నది. నిజానికి ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడితే, దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. బడి అంటే, చీకటి నుండి వెలుగుకు ప్రయాణమన్న నానుడిని నిజం చేసుకోవాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad