భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘం (ఈసీఐ) వెన్నెముక వంటిది. ఇది స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికల నిర్వహణకు పూనుకునే ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా పేరు పొందింది. అయితే గత కొన్నేండ్లుగా ఈ కీలకమైన సంస్థ విశ్వసనీయత, స్వయంప్రతిపత్తిపై తీవ్రమైన ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. ప్రతిపక్ష నాయకులు, పౌర సమాజ సంస్థలు, చివరికి న్యాయ వ్యవస్థ కూడా ఈసీఐ తీసుకుంటున్న కొన్ని విధాన నిర్ణయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు టీఎన్ శేషన్ వంటి ఎన్నికల కమిషనర్ల హయాంలో ఈసీఐ నిష్పాక్షికతకు, కఠినత్వానికి మారుపేరుగా నిలిచింది. రాజకీయ పార్టీలు బూత్ క్యాప్చరింగ్‌కు భయపడి, ఈసీఐ అంటే వణికిపోయేవి. ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రాహుల్‌గాంధీ ఆరోపణలు కేవలం రాజకీయ ప్రకటనలు కాకుండా, కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు, గణాంకాల ఆధారంగా రూపొందించబడ్డాయి. వీటిని పరిశీలించడం ద్వారా, ఈసీఐ ఇటీవలి వివాదాస్పద విధానాలను ఉదాహరణకు, సీసీటీవీ ఫుటేజీలను ధ్వంసం చేయడం, బీహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, వాటి చట్టపరమైన, రాజ్యాంగపరమైన చిక్కులను లోతుగా అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనూ గత సర్కార్‌కు అనుకూలంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిందని అప్పట్లో అనేక విమర్శలు వెల్లువత్తాయి. ఇవన్నీ పోల్చిచూస్తే, ఎన్నికల సంస్థల స్వతంత్రతపై అనేక ప్రశ్నలు సమాజంలో లేవనెత్తుతున్నాయి.
ఓట్ల జాబితాలో అనుమానాలు
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఈసీఐ, అధికార పార్టీ మధ్య ‘ఓటు దొంగతనం’ జరిగిందని, అది ఒక ‘నేరపూరితమైన కుట్ర’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటక ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపించారు. మహారాష్ట్రలో లోక్‌సభ, విధానసభ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఓటరు జాబితాలో ఒక కోటి కొత్త ఓటర్లు చేర్చబడడంపై రాహుల్ గాంధీ సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సంఖ్య గత ఐదేండ్లలో నమోదైన ఓటర్ల పెరుగుదల కంటే ఎక్కువగా ఉండడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే, కేవలం కొన్ని నెలల తర్వాత జరిగిన విధానసభ ఎన్నికల్లో కూటమి తుడిచిపెట్టుకుపోవడం ఈ ఆరోపణలకు విశ్వసనీయతను పెంచుతుంది. కర్నాటకలో ‘ఓటు దొంగతనం’పై తన వాదనను నిరూపించడానికి రాహుల్ గాంధీ కర్నాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఒక కేస్‌స్టడీగా చూపించారు. ఆరు నెలల పరిశోధన తర్వాత, ఈ నియోజకవర్గంలో 1,00,250 ‘నకిలీ ఓట్లు’ ఉన్నాయని ఆయన గణాంకాలతో సహా నివేదించారు. ఈ ఆరోపణలు కేవలం 32,707 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడమనే వాస్తవం ఈ ఆరోపణల తీవ్రతను పెంచుతుంది. ఆరోపించబడిన నకిలీ ఓట్ల సంఖ్య, గెలుపు మార్జిన్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండడం ఈ ఆరోపణల ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతోంది. అలాగే బీహార్‌లో దాదాపు 80 మిలియన్ల మంది ఓటర్ల పత్రాలను తిరిగి పరిశీలించేందుకు ఈసీఐ చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీని ప్రధాన ఉద్దేశం అనర్హులైన ఓటర్లను, ముఖ్యంగా ”విదేశీ అక్రమ వలసదారులను” తొలగించడమేనని ఈసీఐ పేర్కొంది. కానీ, వివాదాస్పదమైన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్ సీ)ను పరోక్షంగా అమలు చేయడమేనని చాలా మంది భావిస్తున్నారు. బీహార్‌లో నిరక్షరాస్యత రేటు తక్కువగా ఉండడం (62శాతం), చాలామందికి జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల, ఈ ప్రక్రియలో పేద, అట్టడుగు వర్గాల ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.
తెలంగాణలోనూ అక్రమాలు?
రాహుల్‌గాంధీ ఆరోపణల ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడానికి, గతంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని వచ్చిన ఆరోపణలను పోల్చి చూడడం ఉపయోగపడుతుంది. ఈ ఉదాహరణ ఓటరు జాబితాలో అక్రమాలు, సంస్థాగత పక్షపాతం వంటి సమస్యలు కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే పరిమితం కాలేదని చూపుతుంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, రాష్ట్ర ఓటరు జాబితా నుంచి దాదాపు 30 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని ఒక ఆర్టీఐ వెల్లడించింది. నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటికేషన్ ప్రోగ్రాం (ఎన్‌ఈఆర్ పీఏపీ) కింద ఆధార్‌ను ఓటర్ ఐడీలతో అనుసంధానించే ప్రక్రియలో భాగంగా ఈ తొలగింపులు జరిగాయి. ఈ తొలగింపులకు ముందు ‘డోర్-టు-డోర్ వెరిఫికేషన్’ సరిగ్గా జరగలేదని, తగిన తనిఖీ లేకుండానే తొలగింపులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) బన్వర్ లాల్, ఈసీఐకి రాసిన లేఖలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఈ ప్రక్రియ సరిగ్గా జరగలేదని స్వయంగా పేర్కొన్నారు. ఈ తొలగింపులు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అప్పటి ముఖ్యమంత్రి, గేటర్ హైదరాబాద్ నుంచి పదిహేను లక్షల ”బోగస్ ఓటర్లను” తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సూచించారని ఆరోపణలు వచ్చాయి. ఇది అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని భావించిన ఓటర్లను తొలగించడానికి చేసిన కుట్రగా భావించారు. ఈ వివాదం ఈసీఐ ఇప్పుడు బీహార్‌లో చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ఒక పూర్వ ఉదాహరణగా నిలుస్తుంది.
ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయత
ఈసీఐ పారదర్శకత లేకపోవడం, ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీలను ధ్వంసం చేయడం, డిజిటల్ ఓటరు జాబితాను నిరాకరించడం వంటి చర్యలు ‘ఓటు దొంగతనం’ అనే ఆరోపణలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఒకవైపు ఈసీఐ తన చర్యలను చట్టపరమైన, సాంకే తిక వాదనలతో సమర్థిస్తుంటే, మరోవైపు ఈ విధానాలు ఎన్నికల ప్రక్రియను కోర్టులో సవాలు చేయడాన్ని కష్టతరం చేస్తున్నాయి. ఈ చర్యలు కేవలం ప్రమాణాలను మార్చడమే కాకుండా, న్యాయ వ్యవస్థ పర్యవేక్షణను కూడా అడ్డుకుంటున్నాయి. దీనివల్ల ప్రజలు తమ ఎన్నికైన ప్రభు త్వాలపై, చివరికి ప్రజాస్వామ్య వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఎన్నికలు అక్రమంగా జరుగుతున్నాయని ప్రజలు భావించడం మొదలుపెడితే, అది ప్రజాస్వామ్య మూలాలనే బలహీనపరుస్తుంది. ఈసీఐ వంటి సంస్థల విశ్వసనీయత కోల్పోవడం, ఎన్నికల ఫలితా లను కోర్టులో సవాలు చేయడానికి సరైన సాక్ష్యాలు లేకుండా పోవడంతో, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు సుదీర్ఘకాలం పాటు హానికరం. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును పరిరక్షించడానికి, ఈసీఐ స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించడం అత్యవసరం. దీనికి కొన్ని తక్షణ సంస్కరణలు అవసరం. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో అధికార పార్టీ ప్రభావం లేకుండా చూసి, సుప్రీంకోర్టు సూచించినట్లుగా నిష్పాక్షికమైన కమిటీని ఏర్పాటు చేయాలి. ఓటరు జాబితాలను యంత్ర పఠన ఫార్మాట్‌లో ప్రతిపక్ష పార్టీలకు, పౌర సంస్థలకు అందించడంతోపాటు ఎన్నికల ఫుటేజీలను శాస్త్రీయ, సురక్షితమైన పద్ధతిలో ఎక్కువ కాలం భద్రపరచాలి. ఈసీఐ తన విధానాలపై పౌరసంస్థలు, ప్రజలు వ్యక్తం చేసే ఆందో ళనలకు కేవలం చట్టపరమైన, సాంకేతిక ప్రతిస్పందనలతో సరిపెట్టకుండా, లోతైన విచారణలు, సంప్రదింపులను చేపట్టాలి. ఈ చర్యలు మాత్రమే ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరించి, భారత ప్రజాస్వామ్య పవిత్రతను కాపాడగలవు. లేకుంటే దేశంలో ఎన్నికలు కేవలం ఒక ఉత్సవంగా మాత్రమే మిగిలిపోయి, ప్రజాస్వామ్యానికి ప్రధాన భూమికగా ఉండబోవనే భయం నిజమవుతుంది.
మేకల ఎల్లయ్య
9912178129
స్వతంత్రశక్తిని కోల్పోతున్న ఎలక్షన్ కమిషన్!?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES