తెలంగాణా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను 42శాతానికి చట్టబద్దంగా పెంచకుండానే ఎన్నికలు జరుపుతుందా? పెంచేందుకు రాష్ట్రపతికి పంపిన బిల్లుకు ఆమోదం లేదా తిరస్కారం చేస్తున్నట్లు చెప్పలేదు. ఆర్డినెన్స్ ద్వారా అమలు చేద్దామని చూస్తే గవర్నర్ దాన్ని కేంద్రానికి సలహా కోసం పంపటంతో దాని పరిస్థితీ అంతే. దీని వెనుక బీజేపీ రాజకీయం పక్కాగా కనిపిస్తున్నది. ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నందున అంగీకరించే సమస్యే లేదని కేంద్ర మంత్రి బండి సంజరు చెబుతారు. రాజ్యాంగబద్ధంగా అలాంటి అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి కూడా తిరస్కరించవచ్చు. రాష్ట్రాన్ని వివరణ అడగవచ్చు. అదేమీ చేయకుండా తొక్కి పెట్టారు. తెలంగాణా స్థానిక సంస్థల అంశాన్ని పక్కన పెడితే అసలు నరేంద్రమోడీ, బీజేపీకి బీసీ రిజర్వేషన్ల మీద ఉన్న చిత్తశుద్ధి ఎంత అన్నది ప్రశ్న. పధ్నాలుగుసార్లు గడువు పొడిగించిన తరువాత 2023 జూలై 31న ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై జస్టిస్ రోహిణీ కమిషన్ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అంద చేశారు. రెండు సంవత్సరాలు దాటింది. అసలు ఆ నివేదిక వెలుగు చూస్తుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 2017 అక్టోబరు రెండవ తేదీన ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జి రోహిణీ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పడింది.
రామనాధ్ కోవింద్ హయాంలో ఏర్పాటుచేసిన ఈ కమిషన్ కేవలం మూడు మాసాల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించగా ఆరేండ్లు పట్టింది. ఈ నివేదిక తమకు ఇంకా అందలేదని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయశాఖ 2025 మార్చి 26న లోక్‌సభకు తెలియచేసింది. ఈ ఏడాది ఆగస్టు ఐదవ తేదీన అడిగిన ప్రశ్నకు అదే సమాధానాన్ని పార్లమెంటుకు తెలిపింది. అనేక రాష్ట్రాలలో బీసీ కుల సర్వేలు జరిగిన పూర్వరంగంలో నివేదికలోని అంశాలతో దేశ సామాజిక, రాజకీయ రంగాలపై భూకంప ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించకుండా నివేదికను వెల్లడించడం కుదరదని 2024 మే మొదటి వారంలో అలహాబాద్ హైకోర్టు ప్రజాప్రయోజనవాజ్యం మీద తీర్పునిచ్చింది. అందువలన కోర్టుల ద్వారా కూడా అది వెలుగు చూసే అవకాశం లేదన్నది తేలిపోయింది. దీనికి ముందు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ 2015లోనే అత్యంత వెనుకబడిన, బాగా వెనుకబడిన, వెనుకబడిన తరగతులు అని మూడు భాగాలుగా విభజించి రిజర్వేషన్లు అమలు జరపాలని చేసిన సిఫార్సును మోడీ సర్కార్ పట్టించుకోలేదు. జాప్యం చేసే ఎత్తుగడతో రెండు సంవత్సరాల తరువాత రోహిణీ కమిషన్ ఏర్పాటు చేశారు. మండల్ కమిషన్ 1979లో ఏర్పాటు కాగా 1980లో నివేదిక ఇచ్చింది. పదేండ్లకు అది అమలులోకి వచ్చింది. రోహిణీ కమిషన్ 2017లో ప్రారంభం కాగా 2023లో నివేదిక సమర్పించింది. 2019లోనే ముసాయిదా నివేదిక సిద్దంగా ఉన్నట్టు కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి రాసినా గడువు పొడిగించటం గమనించాలి. 2015 నుంచి తీరుతెన్నులను చూస్తే ఇప్పటికే పదేండ్లు దాటింది, ఓబీసీ వర్గీకరణ మొత్తంగా 15 సంవత్సరాల తరువాతైనా జరుగుతుందా అన్నది అనుమానమే.
వెయ్యి పేజీలకు పైగా ఉన్న రోహిణీ కమిషన్ నివేదిక రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగంలో వర్గీకరణ ఎలా జరపాలి అని పేర్కొనగా, రెండవ భాగంలో దేశమంతటా గుర్తించిన 2,633 కులాల జాబితా ఉన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. 2015 నుంచి 2018 వరకు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో లక్ష ప్రవేశాలు, లక్షా 30 వేల ఉద్యోగాలను ఎలా ఇచ్చారన్నది కమిషన్ పరిశీలించినట్లు చెబుతున్నారు. నాలుగో వంతు వాటాను కేవలం పది ఓబీసీ కులాల వారే దక్కించుకున్నారని, మరో నాలుగోవంతును 38 కులాల వారు, మరో నాలుగోవంతు 102కులాలు దక్కించుకున్నాయని, మరో 22.3శాతం 506 కులాలు పొందినట్టు, 994 కులాలకు కేవలం 2.68శాతం దక్కగా 983 కులాలకు అసలు ఎలాంటి లబ్ది దక్కలేదని తేలినట్లు వెల్లడైంది. విద్యా, ఉద్యోగ రంగాల వనరుల పంపిణీలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే ఏ విధంగా వాటిని దక్కించుకుంటున్నారో ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. దళితుల వర్గీకరణతో కొంత మేరకు పరిష్కారం కుదిరినా ఇంకా అమల్లోకి రాలేదు. బీసీ, గిరిజనుల్లో ఇంకా అలాంటి అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిణీ కమిషన్ బిసిలను నాలుగు తరగతులుగా వర్గీకరించాలని సిఫార్సు చేసినట్టు వార్తలు వచ్చాయి.
దేశవ్యాపితంగా బీసీ జనాభా సంఖ్య అంచనాకు సర్వే చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని రోహిణీ కమిషన్ కేంద్రానికి రాసినా పట్టించుకోలేదు. 2018లో నాటి హౌమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2021 జనగణనలో ఓబీసీ వివరాలు ఉంటాయని చెప్పారు తప్ప కులగణన చేస్తామని నిర్దిష్టంగా ప్రకటించలేదు. వెనుకబడిన తరగతుల కులగణన జరగాలన్న డిమాండ్‌కు ఇటీవలి సంవత్సరాల్లో మద్దతు పెరుగుతున్నది. రాష్ట్రాలకు గణన చేసే అధికారం లేదు గనుక సర్వేల పేరుతో వారెంత మంది ఉన్నారో సుమారుగా లెక్కించేందుకు కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. వాయిదాపడిన 2021జనగణనలో కులగణన చేయాలన్న డిమాండ్‌ను బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మొండిగా తిరస్కరించాయి. రాష్ట్రాల మీద నెట్టాలని చూశాయి. మెజారిటీ రాష్ట్రాలలో తామే ఉన్నామని చెప్పుకొనే బీజేపీ తమ పాలిత రాష్ట్రం ఒక్కదానిలో అయినా సర్వే చేసిందా అంటే లేదు. హిందువుల్లో చీలిక వస్తుందని మతాన్ని ముందుకు తెచ్చింది. లోక్‌సభ ఎన్నికలో ఇండియా కూటమి కులగణన అంశాన్ని, రిజర్వేషన్లపై 50శాత పరిమితి ఎత్తివేయాలన్న నినాదాన్ని ముందుకు తెచ్చింది. జనాల నుంచి వస్తున్న వత్తిడి, బీహార్ ఎన్నికల కారణంతో 2027లో చేపట్టే జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అప్పటి నుంచి బీజేపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. ఎలాగూ జనగణనలో కులాల వివరాలు వస్తాయి గనుక ఆ తరువాతే చర్యలు తీసుకోవచ్చు కదా అని చెబుతున్నారు. 2011 ఫిబ్రవరిలో గణన జరిగితే 2013 ఏప్రిల్‌లో అంతిమంగా దాన్ని ఖరారు చేశారు. ఇప్పుడు డిజిటల్ అంటున్నారు గనుక ఆ లెక్కన చూసినా 2028 వరకు ప్రతిపాదిత జనాభా గణన ఖరారయ్యే అవకాశం లేదు. అప్పటి వరకు రోహిణీ కమిషన్ నివేదిక వెలువడదా లేక వత్తిడికి తట్టుకోలేక వెల్లడించినా దాని మేరకు చర్యలు తీసుకొనే అవకాశం లేదా అన్నది ప్రశ్న.
2027 జనాభా లెక్కల్లో ఎవరెంత శాతం అన్నది తేలుతుంది తప్ప కులాల సంఖ్య, వాటిలో ఉన్న జనాభా స్థితిగతులు మారే అవకాశమే లేదు. అందువలన సదరు నివేదికను విడుదల చేసి పార్లమెంటు, అసెంబ్లీలు, ప్రజావేదికల మీద చర్చ చేస్తే తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి ఎవరేమనుకుంటున్నదీ వెల్లడి అవుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1953లో నాటి నెహ్రూ ప్రభుత్వం తొలిసారిగా కాకా కలేల్‌కర్ (దత్తాత్రేయ బాలకృష్ణ కలేల్‌కర్) వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసింది. అది 2,399 కులాలను ఓబీసీలుగా గుర్తించింది, 70శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, 1961లో కులగణన చేయాలని సిఫార్సు చేసింది. ఆ నివేదికను గోడవున్లో భద్రపరిచారు. తరువాత జనతా పార్టీ హయాంలో బిపి మండల్ ఆధ్వర్యాన 1979లో రెండవ కమిషన్ ఏర్పాటు చేశారు. 1980లో ఆ నివేదిక వచ్చే సరికి ఇందిరా గాంధీ తిరిగి అధికారానికి వచ్చారు. దాన్ని కూడా గోడవున్‌కు పంపారు. నేషనల్ ఫ్రంట్ నాయకత్వాన ఏర్పాడిన ప్రభుత్వం 1990 ఆగస్టులో నాటి ప్రధాని విపి సింగ్ ఆ నివేదికను వెలికి తీయించి అమల్లో భాగంగా 27 శాతం రిజర్వేషన్లను ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందినప్పటికీ అది కోర్టు వివాదాలకు దారితీసింది. న్యాయవాది ఇంద్రా సహానే ప్రభుత్వ ఉత్తరువులను సవాలు చేశారు. దాని మీద విచారణ జరిపిన సుప్రీం కోర్టు 1992 నవంబరు 16న ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. తొమ్మిది మంది సభ్యులున్న ధర్మాసనంలో ఆరుగురు అనుకూలంగా, ముగ్గురు వ్యతిరేకంగా మెజారిటీ తీర్పు వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే దేశంలో నూతన ఆర్థిక విధానాల పేరుతో నయా ఉదారవాద విధానాలకు తెరలేచింది. ఈ నేపధ్యంలోనే ఉద్యోగాల రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని అవి కూడా ప్రభుత్వరంగంలో మాత్రమేనని, ప్రయివేటు రంగానికి వర్తించవని పేర్కొన్నది. ఆ తీర్పు ఇప్పటికీ అమల్లో ఉంది. తరువాత 2007లో రిజర్వేషన్లను విద్యా సంస్థలకూ వర్తింప చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2019లో నరేంద్రమోడీ సర్కార్ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చేసింది. దాన్ని కోర్టులో సవాలు చేయగా 2022 నవంబరు ఏడున 3:2 మెజారిటీతో సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది.
మొత్తంగా చూసినపుడు ఓబిసి, షెడ్యూలు కులాలు, తరగతులు దేశంలో అణచివేత, దోపిడీకి గురవుతున్న సామాజిక తరగతులే. అయితే ఇతర కులాల్లో పేదలు ఉన్నట్లే ఈ సామాజిక తరగతుల్లో కూడా ధనికులు, ముందున్న తరగతులు లేకపోలేదు. అందుకే రిజర్వేషన్ల ఫలాలను కొందరే ఎక్కువగా అనుభవిస్తున్నారు. రోహిణీ కమిషన్ నివేదిక దాన్నే నిర్ధారించినట్లు తెలుస్తున్నది. కమిషన్ అడిగిన కీలక సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు ఇవ్వలేదనే ఒక విమర్శ మీడియాలో వచ్చింది. ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్ వంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఓబీసీ రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగటం లేదనే విమర్శలు ఉన్నాయి.అదే గనుక నిజమైతే ఆ నివేదిక వెల్లడైన తరువాత దాన్ని వివాదాస్పదంగా మార్చే అవకాశం లేకపోలేదు. కోర్టుల్లో సవాలు చేయటం సరేసరి.
బీజేపీని వ్యతిరేకించే పార్టీలు సామాజిక న్యాయ నినాదాన్ని తీసుకున్నాయి. దాన్ని ఎదుర్కొనేందుకు నరేంద్రమోడీ తన మంత్రివర్గంలో, వివిధ రాష్ట్రాల బీజేపీ మంత్రివర్గాల్లో ఓబీసీలకు గణనీయ ప్రాతినిధ్యం కల్పించి దాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు. ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చినట్టు చెప్పవచ్చు. వెనుకబడిన తరగతుల్లో వర్గీకరణ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నది. రోహిణీ కమిషన్ నివేదికలో లోపాల గురించి చెప్పాల్సి వస్తే 2018 తరువాత జరిగిన నియామకాలకు సంబంధించి ఎలాంటి పరిశీలన కమిషన్ చేయలేదు. వెల్లడి తరువాత కొన్ని సవాళ్లు కూడా ఎదురుకానున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో చేనేత, దూదేకటం వంటి కొన్ని వృత్తులు చేసే ముస్లింలు, బీహార్‌లో దర్జీలు ఓబీసీ జాబితాలో ఉండగా హిందువులు లేరని రోహిణీ కమిషన్ గుర్తించినట్లు నిర్దారణగాని వార్త. వివిధ రాష్ట్రాలలో ఇలాంటి సమస్యలు, బీజేపీ మత అజెండాకు దీనికి ఘర్షణ తలెత్తవచ్చు. అందుకే వెల్లడించటానికి జాగు చేస్తున్నట్లా? నాడు అధికారంలో లేదు గనుక మండల్‌కు వ్యతిరేకంగా కమండలాన్ని ముందుకు తెచ్చిందని విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ ఇప్పుడు తానే అధికారంలో ఉందిగనుక ఏం చేస్తుందో చూద్దాం !
ఎం కోటేశ్వరరావు
8331013288
రిజర్వేషన్ల సమస్యను బీజేపీ ఎలా ఎదుర్కొంటుంది!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES