Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఆరోగ్యమా....విశ్వాసమా ?

ఆరోగ్యమా….విశ్వాసమా ?

- Advertisement -

చర్చకు దారితీసిన ‘పావురాల దాణా’ నిషేధాన్ని
వ్యతిరేకిస్తున్న పక్షి ప్రేమికులు, జైనులు, పౌర సంఘాలు
సబబేనంటున్న వైద్య నిపుణులు
న్యూఢిల్లీ :
ముంబయి నగరంలోని బహిరంగ ప్రదేశాలలో పావురాలకు ఆహారాన్ని అందిం చడంపై ఇటీవల న్యాయస్థానం విధించిన నిషేధం పౌర సంఘాలు, ప్రజారోగ్య కార్యకర్తలు, పక్షి ప్రేమికుల మధ్య వివాదానికి కారణమవుతోంది. ముంబయిలో అనేక దశాబ్దాలుగా కబుతర్ఖానాలు (పావురాలను హిందీలో కబుతర్ఖానా అంటారు) అనే ప్రదేశాలలో పావురాలకు ఆహారాన్ని వేస్తున్నారు. అయితే కోర్టు ఆదేశాలతో ఇప్పుడు వాటిని మూసివేశారు. దీనిని నిరసిస్తూ వందలాది మంది పక్షి ప్రేమికులు పోలీసులతో ఇప్పటికే రెండు సార్లు ఘర్షణకు దిగారు. కొందరైతే ఆ ప్రదేశాన్ని కప్పి ఉంచిన టార్పాలిన్‌ను చించేసి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. మరో చోట నిరసనకు దిగిన పదిహేను మందిని పోలీసులు కొద్దిసేపు నిర్బంధించి ఆ తర్వాత విడిచిపెట్టారు.

నిషేధాలు… ఆంక్షలు
పావురాల విసర్జనలతో ప్రజల ఆరోగ్యం దెబ్బతిం టోందంటూ వ్యక్తమవుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని అధికారులు నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ సమస్య కేవలం ముంబయి నగరానికే పరిమితం కాదు. వెనిస్‌ నగరంలో కూడా పావురాలకు ఆహారాన్ని అందించడాన్ని నిషేధించారు. సింగపూర్‌లో భారీగా జరిమానాలు విధిస్తున్నారు. న్యూయార్క్‌, లండన్‌ నగరాలలో ఫీడింగ్‌ జోన్లను నియంత్రించారు. మన దేశంలో కూడా మహారాష్ట్రలోని పూనే, థానే నగరాలలో పావురాలకు ఆహారం వేస్తే జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాలలో పక్షులకు ఆహారాన్ని అందించకుండా ఆంక్షలు విధించే విషయాన్ని ఢిల్లీ పరిశీలిస్తోంది.

మత విశ్వాసంలో భాగమన్న జైనులు
భారతీయ సాంస్కృతిక నిర్మాణంలో పావురాలు ఓ భాగంగా నిలిచిపోవడంతో నిషేధాలు, ఆంక్షలు, జరిమానాలు వంటి చర్యలు జంతు ప్రేమికులను, మతపరమైన దాతలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ముంబయి, ఢిల్లీ వంటి నగరాలలో పావురాలకు ఆహారాన్ని అందిస్తున్న దృశ్యాలు మనకు అనేక చలనచిత్రాలలో కన్పిస్తుంటాయి. నివాస గృహాల బాల్కనీలలో, ఎయిర్‌ కండిషనర్లపై పావురాలు సంచరించడం మనం ప్రతి రోజూ చూసే దృశ్యమే. ముంబయి నగరంలోని కబూతర్‌ ఖానాలను మూసివేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 3వ తేదీన జైన మతస్థులు కొలాబా జైన ఆలయం నుంచి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వరకూ ర్యాలీ నిర్వహించారు. పావురాలకు ఆహారాన్ని అందించడం తమ మత విశ్వాసంలో భాగమని వారు తెలిపారు. ముంబయిలోని కొన్ని కబూతర్‌ ఖానాలు వారసత్వ చిహ్నాలుగా కొనసాగుతున్నాయి. ఆహార ధాన్యాలను దానం చేసే ప్రదేశాలుగా వాటిని పరిగణిస్తారు.

ప్రత్యామ్నాయాలపై దృష్టి
దాణా నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ప్రజారోగ్యమే అత్యంత ముఖ్యమైన విషయమని స్పష్టం చేసింది. పక్షులపై ప్రేమ ఉండవచ్చు కానీ అది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయరాదని ఢిల్లీ మేయర్‌ రాజా ఇక్బాల్‌సింగ్‌ వ్యాఖ్యానిం చారు. అయితే పరిశుభ్రత పాటించకపోతే ఏ జంతువైనా వ్యాధులను వ్యాపింపజేస్తుందని కొందరు వాదిస్తున్నారు. దాణా నిషేధం కారణంగా వేలాది పావురాలు చనిపోతున్నాయని జైన సన్యాసి ఒకరు వాపోయారు. ఏదేమైనా పరస్పర భిన్న వాదనల మధ్య కొందరు మధ్యేమార్గాన్ని అన్వేషించే పనిలో నిమగమయ్యారు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే పావురాలకు దాణా వేయడాన్ని అనుమతించాలని కొందరు సూచించారు. దీనివల్ల దాణా ప్రాంతాలను శుభ్రం చేయడానికి తగిన సమయం లభిస్తుందని వారు తెలిపారు. ప్రత్యామ్నాయాలను సూచించడానికి బాంబే హైకోర్టు కూడా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

రెట్టలలో వ్యాధి కారకాలు
2023లో విడుదలైన ఓ నివేదిక ప్రకారం 2000వ సంవత్సరం నుంచి పావురాల సంఖ్య 150 శాతానికి పైగా పెరిగింది. ప్రతి పావురం సంవత్సరానికి పదిహేను కిలోల రెట్టను నివాస గృహాలు, బహిరంగ ప్రదేశాలలో విసర్జిస్తుంది. వీటిలో కనీసం ఏడు రకాల జూనోటిక్‌ వ్యాధి కారకాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి న్యుమోనియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటి వ్యాధులకు దారితీస్తాయి. ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. పావురాల విసర్జనల కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు రావడం సర్వసాధారణమేనని ఆర్‌.ఎస్‌.పాల్‌ అనే పల్మనాలజిస్ట్‌ చెప్పారు. పావురాలకు నేరుగా ఆహారం అందించకపోయినా వాటి రెట్టలు హైపర్‌ సెన్సిటివిటీ న్యుమోనిటిస్‌ వ్యాధిని కలిగిస్తాయని ఆయన తెలిపారు. క్రమం తప్పకుండా పావురాలను తాకే వారిలో బ్యాక్టీరియా, వైరల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటి సమస్యలు కన్పిస్తాయని వివరించారు.

నిపుణుల ఆందోళన
పావురాలతో చాలా మంది విడదీయరాని బంధాన్ని పెంచుకుంటారు. శాంతి, విధేయతలకు వాటిని చిహ్నాలుగా చూస్తారు. అయితే పావురాలు వేసే రెట్టలు ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతాయని, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో దేశంలో పావురాల సంఖ్య పెరిగింది. దీంతో ప్రజారోగ్యానికి ప్రమాదమూ పెరగడంతో వాటికి ఆహారాన్ని అందించడంపై నిషేధాలు, ఆంక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. ఆహారం సులభంగా లభించడంతో అనేక దేశాలలో పావురాల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీకి చెందిన జీవవైవిధ్య నిపుణుడు ఫియాజ్‌ కుద్‌సర్‌ తెలిపారు. మన దేశంలో పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడం వల్ల వాటి స్థానాన్ని పావురాలు ఆక్రమిస్తున్నాయని చెప్పారు. ఆహారం సులభంగా లభించడం, వేటాడే జంతువులు లేకపోవడంతో గతంలో కంటే పావురాలలో సంతానోత్పత్తి వేగంగా పెరిగిపోతోందని, వాటి సంఖ్య ఇతర పక్షులను దాటేస్తోందని, ఫలితంగా పర్యావరణానికి హాని జరుగుతోందని ఆయన వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad