– బీజేపీ ప్రతినిధిగా సీఈసీ మాట్లాడుతున్నారు
– జ్ఞానేష్ కుమార్ తన బాధ్యతల నుంచి పారిపోతున్నారు : ప్రతిపక్షాలు
– సమాధానమివ్వకుండా రాజకీయ పార్టీలకు ప్రశ్నలా?
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల కమిషన్ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి బదులు ఎదురుదాడికి దిగుతోందని ప్రతిపక్ష ‘ఇండియా’ బ్లాక్ విమర్శించింది. బీజేపీ ప్రతినిధిగా సీఈసీ మాట్లాడుతున్నారని, ఎస్‌ఐఆర్ జాబితా, అవకతవకలపై తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఈసీ విఫలమైందని నేతలు విమర్శిం చారు. సోమవారం నాడిక్కడ కాన్ట్సిట్యూషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్, ఆర్‌జేడీ, సీపీఐ(ఎం), ఎస్పీ, శివసేన, డీఎంకే, టీఎంసీ, ఆప్ తదితర పార్టీల నేతలు మాట్లాడారు.
ఈ ప్రశ్నలకు ఈసీ బదులేదీ?
మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు పెరగడానికి కారణమేంటీ? 45 రోజుల్లో పోలింగ్ బూత్‌ల సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించాలని ఎందుకు నిర్ణయించారు? మహదేవపురలో లక్ష నకిలీ ఓటర్లు ఎందుకు వచ్చారు? మెషిన్ రీడబుల్ ఎలక్టోరల్ ఓటు గోప్యత ఉల్లంఘన ఎలా అవుతుంది? బీహార్‌లోని 65 లక్షల మంది ఓటర్లను ఎందుకు తొలగించారు? వారు శోధించదగిన ఫార్మాట్‌లో దీనికి కారణాన్ని ఎందుకు ఇవ్వలేకపోయారు? ఓటరు ఐడీ కోసం ఆధార్‌ను వారు ఎందుకు వ్యతిరేకించారు? ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఇంత తొందరగా ఎందుకు తీసుకొచ్చారు?. ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే వ్యవధి ఉన్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలతో సంప్రదించకుండా హడావిడిగా ఎస్‌ఐఆర్ ఎందుకు చేపట్టారు? ఎస్‌ఐఆర్ ప్రకటనలో ఎందుకు దూకుడుగా వ్యవహరిం చారు? అనే ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ సమాధానం ఇవ్వలేదని అన్నారు. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేష్‌కుమార్ సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆయన తన బాధ్యతల నుంచి పారిపోతున్నారని విమర్శించారు. ఓటు హక్కు అనేది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రధానమైన హక్కు అని, ప్రజాస్వామ్యం సామాన్య ప్రజల ఓటు హక్కుపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ హక్కును కాపాడటం కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యతని స్పష్టం చేశారు. కానీ దేశంలోని రాజకీయ పార్టీలు అడిగిన ముఖ్యమైన నిర్దిష్టమైన ప్రశ్నలకు ఈసీఐ సమాధానం చెప్పలేకపోయిందని విమర్శించారు.
ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఫిర్యాదు చేసినందుకు అఫిడవిట్ సమర్పించాలని ఈసీ అడుగుతోందని, 2022లో ఓటర్ల జాబితా నుంచి 18వేల మంది ఓటర్లను తొలగించారనే ఫిర్యాదుతో తమ పార్టీ అఫిడవిట్లు సమర్పించిందని, దానిపై ఇంతవరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు. 2024లో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరిగినప్పుడు బీఎల్‌ఓలను మార్చారని, దీని గురించి కూడా తాము ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని గుర్తు చేశారు. ప్రతిపక్షాల ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ ఎల్లప్పుడూ విస్మరించిందని విమర్శించారు.
డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ మాట్లాడుతూ బీహార్‌లో హడావిడిగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో చర్చకు అధికార పార్టీ ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. సమస్య పరిష్కారానికి అన్ని చట్టపరమైన మార్గాలను ఆశ్రయిస్తామని చెప్పారు.
సీఈసీ తన హక్కును కోల్పోయింది: సీపీఐ(ఎం)
సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ అసంపూర్ణ ఓటర్ల జాబితా ప్రజాస్వామ్య న్యాయమైన, సమగ్రతను దెబ్బతీస్తుందని అన్నారు. సీఈసీ తన రాజ్యాంగ పదవిలో పనిచేసే హక్కును కోల్పోయిందని తాము గట్టిగా నమ్ముతున్నామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సీఈసీ..ప్రతిపక్ష పార్టీలపై యుద్ధం ప్రకటించాలని విమర్శించిందన్నారు. మొదటి నుంచీ ప్రభుత్వానికి ఈసీని తన ‘బి’ జట్టుగా చేసుకోవాలనే రహస్య ఉద్దేశం ఉందని, అందుకే 2023లో సుప్రీంకోర్టు ఐదు మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును తప్పించుకోవడానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఈసీని పక్షపాతంతో ఎంపిక చేయడం అన్యాయంగా ఉందని విమర్శించారు. కేరళ నుంచి కాశ్మీర్ వరకు మొత్తం దేశం ఓటర్ల జాబితాను కల్తీ చేయడానికి ఒక క్రూరమైన కుట్ర జరిగిందని, కేరళలో బీజేపీకి ఉన్న ఏకైక స్థానాన్ని కూడా మోసపూరిత మార్గాలతో గెలుచుకుందని ధ్వజమెత్తారు.
అందువల్ల, రాజ్యాంగ సంస్థ అయిన ఈసీ నియమాలకు కట్టుబడి ఉండేలా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపడం తప్ప తమకు వేరే మార్గం లేదని అన్నారు. డేటా మెషిన్-రీడబుల్ కాదని ఈసీ అబద్ధం చెబుతుందని, ఎందుకంటే, 2018లో జస్టిస్ సిక్రీ ఇచ్చిన తీర్పులో అది వ్యక్తి గత గోప్యతను ఉల్లంఘిస్తుందని చెప్పలేదని అన్నారు. అయితే 65 లక్షల తొలగింపుల తరువాత, బీహార్ ఓటర్ల జాబితాను 7.90 కోట్ల ఓటర్ల నుంచి 7.24 కోట్లకు కుదించారు. అయితే, ఆ ఓటర్లలో ఎంతమంది పత్రాలను సమర్పించారో లేదో సమాధానం ఇవ్వడానికి ఈసీ నిరాకరిస్తుందని విమర్శించారు.
శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ కోసం తాము డిమాండ్ చేశామని, కానీ వారు దానిని ఇవ్వలేదని అన్నారు. అదే సమయంలో విలేకరుల సమావేశంలో అది మహిళల గోప్యత, భద్రతకు సంబంధించిన అంశమని, కాబట్టి మేము వీడియోను ఇవ్వలేమని చెప్పారని తెలిపారు. దీనిని బట్టి, ఎన్నికల కమిషన్ బీజేపీని ఎలా కాపాడటానికి ప్రయత్నిస్తుందో అర్థం చేసుకోవాలని అన్నారు.
ఆర్‌జేడీ నేత మనోజ్ ఝా మాట్లాడుతూ ప్రజాస్వామ్య సిద్ధాంతాలను పరిరక్షించడమే ఈసీ ఉద్దేశం కావాలని, కానీ తమ చర్చలను కప్పిపుచ్చుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చడమే అవుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా మొత్తం ప్రతిపక్షం నిర్వహించిన ఇలాంటి విలేకరుల సమావేశాన్ని చూసి ఉండరని తెలిపారు.
టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా మాట్లాడుతూ డూప్లికేట్ ఓటర్‌కార్డుల అంశాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో లేవనెత్తారని, దానిని ఇంతవరకూ పరిష్కరించనేలేదని అన్నారు. ఈసీ 65 లక్షల ఓటర్ల తొలగింపులో 22 లక్షల మంది చనిపోయిన వ్యక్తులని చెప్పిందని, 2024 లోక్‌సభ ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని వారు చెప్పాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ప్రస్తుత, గత ఎన్నికల కమిషనర్లందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. మోసపూరిత ఎన్నికల జాబితాల ఆధారంగా ఉన్న ప్రస్తుత లోక్‌సభను వెంటనే రద్దు చేయాలని, ఎందుకంటే ప్రజల తీర్పు, ప్రభుత్వ చట్టబద్ధత ప్రమాదంలో ఉందని అన్నారు.
ఆప్ ఎంపీ సంజరు సింగ్ మాట్లాడుతూ సీఈసీ జ్ఞానేష్‌కుమార్ అని కాకుండా ఆయన పేరు అజ్ఞానేష్ కుమార్ అని ఉండాల్సిందని అన్నారు. ఆయన అజ్ఞానంతో మాట్లాడారని, ఇప్పుడు ఆయన మూర్ఖుడా? లేదా ఉద్దేశపూర్వకంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారా? అని ప్రశ్నించారు. బీహార్‌లో ఎక్కువ భాగం వరదల్లో మునిగిపోయిందని, ఆ ప్రజలను పత్రాల కోసం అడుగుతున్నారని అన్నారు. చొరబాటుదారులు, బంగ్లాదేశీయుల ఓట్లను మాత్రమే రద్దు చేస్తున్నామని బీజేపీ అంటోందని, అంటే, ఓటు రద్దు చేయబడిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బంగ్లాదేశ్‌కు పంపుతారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని పేర్కొన్నారు.
ప్రశ్నలు అడిగితే ఎదురుదాడా?
- Advertisement -
- Advertisement -