దేశ ఆర్థిక రాజధానిలో
రెడ్ అలర్ట్..
విమానయాన సంస్థల అడ్వైజరీ
కులూలో భారీ వర్షాలు.. కొండచరియల బీభత్సం..
ముంబయి: ముంబయి నగరాన్ని భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ అంతరాయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఆగస్టు 21 వరకు మహారాష్ట్ర, ముంబయిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప పౌరులు ఇండ్ల నుంచి బయటకు రావద్దని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విజ్ఞప్తి చేసింది.
ముంబయిలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకొనే అవకాశం ఉన్నందున పలు విమానయాన సంస్థలు అడ్వైజరీ జారీ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ప్రయాణికులు కాస్త ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, ఆకాశఎయిర్, స్పైస్‌జెట్ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. రోడ్లన్నీ జలమయమైనందున విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు బయల్దేరే ముందు విమానానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి తమ వెబ్‌సైట్‌ను తనిఖీ చేసుకోవాలని ఇండిగో ప్రయాణికులకు సూచించింది. ప్రయాణికులు వీలైనంత త్వరగా విమానాశ్రయానికి చేరుకోవాలని ఆకాశ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఎప్పటికప్పుడు తమతమ ఎయిర్‌లైన్ల నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని స్పైస్‌జెట్ ప్రయాణికులకు సూచించింది.
మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ఆదివారం తూర్పుశివారులోని విక్రోలీ పార్క్‌సైట్ ప్రాంతంలో కొండ చెరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందగా, అనేకమంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. మృతులను శాలు మిశ్రా(19), సురేష్ మిశ్రా(50)లుగా గుర్తించామన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం 200 మి.మీ.ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. ముంబయి వర్షాలకు సంబంధించిన సమాచారం గురించి నెటిజన్లు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. దీంతో గూగుల్ ట్రెండ్స్‌లో ‘ముంబయి వర్షాలు’ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
కులూలో భారీ వర్షాలు.. కొండచరియల బీభత్సం..
మండీ: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో వందల మార్గాలు మూసుకుపోగా.. 1,000కి పైగా విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో తరచూ ప్రధాన మార్గాలు మూత పడుతున్నాయి. కులూలోని లార్జీసోంజ్ మార్గంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 15 పంచాయతీలకు ఈ రోడ్డుతో సంబంధాలు కూడా తెగిపోయాయి.
మరోవైపు ఛండీగఢ్-మనాలీ జాతీయరహదారిపై చాలాచోట్ల కొండరాళ్లు విరిగిపడ్డాయి. బజౌరా చెక్‌పోస్టు వద్ద పెద్దసంఖ్యలో ప్రయాణికుల వాహనాలు నిలిచిపోయాయి. కసోల్-కులూ మార్గాన్ని కూడా మూసివేశారు. చాలాచోట్ల ఇది దెబ్బతింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 355 రోడ్లు మూతపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో జాతీయరహదారులు కూడా ఉన్నాయి. విద్యుత్తు సరఫరా వ్యవస్థ చాలాచోట్ల దెబ్బతింది. వీటిల్లో కులూలో అత్యధికంగా 557 విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి. మండీలో 385 పనిచేయడం లేదు. జూన్ 20 నుంచి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ప్రమాదాల వల్ల 261 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీని భయపెడుతున్న యమున నది
దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఢిల్లీ సమీపంలో యుమునా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారికి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడటంతో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది.
ఇక దేశంలోని పశ్చిమ, మధ్య భాగాల్లో భారీగా వానలు కురిసే అవకాశం ఉంది. గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది. ఉత్తర భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.
జమ్మూకాశ్మీర్‌లో..
జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం మరోసారి మేఘ విస్ఫోటం(క్లౌడ్ బరస్ట్) విలయం సృష్టించింది. రాత్రంతా కురిసిన వర్షానికి కఠువా జిల్లాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కిశ్త్‌వాడ్ జిల్లాలోని చశోతీలో వరదలు బీభత్సం సష్టించి మూడు రోజులు కూడా గడవకముందే మరోసారి మేఘ విస్ఫోటం చోటుచేసుకోవడం గమనార్హం.
మునిగిన ముంబయి
- Advertisement -
- Advertisement -