– మంత్రి సీతక్క
– వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
నవతెలంగాణ – మంగపేట/ఏటూర్‌నాగారం
వరద ప్రభావం వల్ల నష్టపోయి ఇబ్బందులు పడుతున్న ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలానికి వచ్చిన సీతక్క మంగపేట, కమలాపురం గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం మంత్రి సందర్శించారు. ప్రజలకు మనోధైర్యం చెప్పారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ధైర్యంగా నిలబడాలన్నారు. పునరావాస కేంద్రాలకు తరలిన ప్రజలను కలిసి దుప్పట్లు పంపిణీ చేశారు.
పంట నష్టపోయిన ప్రతి రైతుకూ నష్టపరిహారం అందుతుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో పంట నష్టం అంచనాలు వేయించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీరు, ఆహారం కొరత లేకుండా, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. మేడారం జంపన్నవాగు, రామన్నగూడెం పుష్కరఘాట్, గోదావరి కరకట్ట, మంగపేట మండలాల్లోనూ మంత్రి పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులను ఏర్పాటు చేశామన్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలు వాగులు, వంకలు దాటోద్దని ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. గోదావరి కరకట్ట పనులు ప్రారంభమయ్యాయని, రాబోయే రోజుల్లో ముంపు ప్రాంతాలకు ఎలాంటి భయమూ లేకుండా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. మంత్రి వెంట యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఇసార్‌ఖాన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, అయ్యోరీ యానయ్య, ముత్తినేని ఆదినారాయణ తదితరులు ఉన్నారు.
అధైర్యపడొద్దు.. అండగా ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES