రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రమవుతోంది. అవసరమైన యూరియా అందకపోవడంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇది నరేంద్రమోడీ తలకెత్తుకున్న విధానాల తాలూకు దుష్పరిణామమే కారణం తప్ప వేరేకాదు. ఎరువులపై రైతులకిచ్చే సబ్సిడీని భారంగా భావించిన కేంద్రం బడ్జెట్‌లో నిధులను దిగ్గోసింది. పైగా తన దుర్మార్గం నుంచి రైతుల దృష్టి మళ్లించేందుకు పర్యావరణం, ప్రజల ఆరోగ్యం అనే సుభాషితాలను లంకించుకుంది. ప్రకృతి సేద్యం, సేంద్రియ సాగు, జీవ ఎరువుల ముసుగులో రాష్ట్రాల ఎరువుల కేటాయింపులకు కోతలు విధించింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా అవసరముండగా 5.32 లక్షల టన్నులే సరఫరా చేసింది. అంటే దాదాపు సగానికి సగం కొరత రైతులను వెంటాడుతోంది.
ఈ యేడు ముందస్తు రుతుపవనాల రాకతో రైతులు ఎంతగానో సంతోషడ్డారు. ముందుగానే ఖరీఫ్‌కు మొగ్గుచూపారు. రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల ఎకరాల్లో సాగుచేసినట్టు అంచనా. అయితే పంటలేసి రెండు నెలలు కావస్తున్నా ఎరువుల సరఫరాలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు చోద్యం చూస్తున్నారే తప్ప ప్రధానిని ఒక్కమాట కూడా అడగడం లేదు.’ఏ విషయంలోనైనా సరే నష్టం జరిగితే ఊరుకోం, ప్రశ్నిస్తాం, నిలదీస్తాం’ అని చెప్పిన బీఆర్‌ఎస్ కూడా కేంద్రంపై నోరు మెదపడం లేదు.అధికారంలో లేమనే ధోరణిలో ప్రతిపక్షం, కేంద్రంతో సంప్రదింపులకు ఒకేగానీ సమరానికి నై అంటున్న అధికారపక్షం, మధ్యలో నష్టపోతున్నది మాత్రం పేద రైతాంగం. ఎందుకంటే, ఢిల్లీలో విన్నపాలు, వినతిపత్రాలతో సరిపెట్టిన రాష్ట్ర సర్కార్ స్పష్టమైన కార్యాచరణకు దిగకపోవడం కూడా రైతులకు పరోక్షంగా నష్టం చేయడం లాంటిదే. యేటికేడు పదినుంచి పదిహేను శాతం ఎరువుల వినియోగం పెరుగుతున్న విషయం తెలిసినా కూడా ఆ మేరకు కేంద్రం కేటాయింపులు పెంచాల్సిందిపోయి కుదించడటం సేద్యాన్ని, రైతులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడమే.
ఈ సీజన్‌కు కాంప్లెక్స్, యూరియా, డిఎపి, పోటాషియం కలిపి దాదాపు ఇరవై ఐదు లక్షల టన్నులు ఎరువులు అవసరం కాగా ఇందులో మనకు చేరింది మాత్రం సుమారు18 లక్షల టన్నులు మాత్రమే. ఇంకా ఏడు లక్షలకు పైగా టన్నుల కొరత ఏర్పడింది. వచ్చిన అరకొర ఎరువుల కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాసినా ఒక్కబస్తానే దొరకుతున్న దుస్థితి. ఎరువులు అందుబాటులో ఉంటున్నాయని, సరిపడా ఇచ్చామని, కేంద్రమంత్రులు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ఇందుకు వర్షంలో సైతం పెద్దపెద్ద క్యూలైన్లలో గంటలకొద్దీ అన్నదాతలు పడుతున్న అవస్తలే సాక్ష్యం. చాలాచోట్ల యూరియా, డిఎపి లభ్యత అవసరం కంటే తక్కువగా ఉందని సర్కార్ లెక్కలే చెబుతున్నా వాటిపై ఎవరు మాట్లాడటం లేదు. రైతులు రోడ్లెక్కి ధర్నాలు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా మార్క్‌ఫెడ్ వద్ద ఉన్న నిల్వలు ఎటు తరలుతున్నాయో తెలియని పరిస్థితి. సహకార సొసైటీలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు చేరిన ఎరువులు కొంతమంది ధనిక రైతులకు, పలుకుబడి ఉన్నవారికే చేరుతున్నట్టు రైతుల ఆరోపణ. దీనికితోడు ఇదే అదనుగా ప్రయివేటు డీలర్లు బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముకోవడం, ఒక్కోబస్తా మీద రూ.50అదనంగా దోచుకోవడం, పైగా వేరే ఎరువుకు లింక్ పెట్టి సొమ్ము చేసు కోవడం ప్రభుత్వ పర్యవేక్షణ లేదని చెప్పడానికి నిదర్శనం.
కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే పేరుతో నానో ఎరువులను రైతులకు అంటగడుతోంది. దేశంలో ఇఫ్కో ద్వారా ఉత్పత్తి చేస్తూ రెరడు కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యం పెట్టుకుంది. అయితే రాష్ట్రంలోని వ్యవసాయ భూమి, వాతావరణానిక, నానో ఎరువులతో ప్రయోజనం ఉండటం లేదు. దిగుబడి సరిగా రావడం లేదు. దీంతో రైతాంగం దాన్ని వదిలించుకునేందుకు నానా తంటాలు పడు తున్నది. అయితే నానో సరఫరా పేరుతో అసలు ఎరువులకు కేంద్రం కోత పెడుతున్నది. రాష్ట్రంలో రామగుండం ఎరువుల కర్మాగారం ఏడాదికి పన్నెండు లక్షల టన్నుల ఎరువులను ఉత్పత్తి చేస్తోంది. అందులో రాష్ట్ర వాటా పదకొండు శాతం. అయినప్పటికీ మన అవసరాలను అది తీర్చడం లేదు. మన దగ్గర ఎరువులను ఉత్పత్తి చేస్తూ ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడం తీవ్ర అన్యాయం. ఇలాంటి అన్ని అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో చర్చించాలి. రాష్ట్రానికి సరిపడా ఎరువులను సాధించేందుకు ఒత్తిడి తేవాలి. అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని పోరాటానికి సిద్ధపడాలి. విన్నపాలతో సమస్యలకు పరిష్కారం దొరకదన్న సంగతి ఇప్పటికైనా గుర్తెరగాలి.
ఎరువులేవీ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES