అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పిన డోనాల్డ్ ట్రంప్ గద్దెనెక్కి రెండు వందల రోజులు దాటింది. అడుగు ముందుకు పడకున్నా తాజాగా ఇదిగో పరిష్కారం అంటూ యావత్ ప్రపంచ దృష్టిని అటువైపు తిప్పాడు. తాజాగా అమెరికాలోని అలాస్కాలో గత శుక్రవారం నాడు జరిగిన ట్రంప్, పుతిన్ భేటీ వార్త సేకరణకు భారీ సంఖ్యలో వచ్చిన మీడియా సిబ్బందే దానికి నిదర్శనం.అంతకు ముందు వరకు కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం ముందు జరగాలంటూ చెప్పిన పెద్దమనిషి అలస్కా సమావేశం తరువాత అలాంటివేమీ లేవు. ఏకంగా పరిష్కారానికి మరోసారి మాస్కోలో సమావేశమని ప్రకటించాడు. చిత్రం ఏమిటంటే సోమవారం నాడు ట్రంప్‌తో భేటీ అయిన ఉక్రెయిన్ నేత జెలెన్‌స్కీ మర్యాదల ప్రకారం గతానికి భిన్నంగా కోటు ధరించి వచ్చాడు. గతంలో ట్రంప్‌తో సమావేశానికి ఒక సాధారణ పౌరుడి మాదిరి దుస్తులు రావటంతో అవమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
జెలెన్‌స్కీని ట్రంప్ ఎక్కడ బుట్టలో వేస్తాడో తమతో నిమిత్తం లేకుండా ఒప్పందం కుదుర్చుకుంటారేమో అన్న భయం లేదా ముందు చూపుతో అనేకమంది ఐరోపా నేతలు కూడా కట్టగట్టుకు వచ్చి ట్రంప్‌తో చర్చలు జరిపారు.వారితో మాట్లాడుతూనే కాసేపు ఉండండి అన్నట్లు అంతరాయమిచ్చి పుతిన్‌తో ఫోన్లో మాట్లాడి తన ప్రాధాన్యత ఏమిటో వారికి అవగతమయ్యేట్లు చేశాడు. దానికనుగుణంగానే ఐరోపా నేతలు కూడా తమ మర్యాదను కాపాడుకుంటూ ట్రంప్ యత్నాలను హర్షిస్తూనే నర్మగర్భంగా తమ భిన్నాభిప్రాయాలను వెల్లడించారు. భద్రత అన్న తర్వాత మేం లేకుండా పుతిన్, జెలెన్‌స్కీ , ట్రంప్ ముగ్గురూ మాట్లాడుకుంటే సరిపోతుందా, నాలుగు పక్షాల సమావేశం జరగాలనే సందేశాన్ని వారు కూడా ఇచ్చారు.ఈ నెలాఖరులో సమావేశం ఎక్కడ జరగాలనే అంశంపై కసరత్తు ప్రారంభమైంది. అది కూడా గత సమావేశాల మాదిరే విఫలయత్నం అవుతుందా నిజంగానే రాజీ కుదిరేందుకు వేదిక అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న.
అలాస్కా సమావేశం తర్వాత కొన్ని సరికొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.చైనా,రష్యాల మధ్య ఉన్న బంధాన్ని తెంచేందుకు అమెరికా పూనుకుందన్నది వాటిలో ఒకటి.ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో లైటు వెలుగుతుందన్నట్లుగా దీనికి ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారం నాంది పలుకుతుందా! దీనర్ధం వెంటనే ఏదో జరుగుతుందని కాదు గానీ మాజీ కమ్యూనిస్టు మహాప్రమాదకారి అన్నట్లుగా పుతిన్ తీరుతెన్నులను ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిందే. వర్తమాన అంశానికి వస్తే మీడియాలో వస్తున్న లీకు వార్తలు, విశ్లేషణలను చూస్తుంటే మొదటి నుంచి రష్యా చెబుతున్నట్లుగానే దాని షరతులు, వైఖరికి అనుగుణంగానే ఒక పరిష్కారం కుదరవచ్చు అనే భావం కొందరిలో కలుగుతోంది. నిజంగా అలా జరిగితే ఐరోపాలో, ప్రపంచంలోనే సరికొత్త సమీకరణలు, పరిణామాలకు, మరింత పెద్ద సంక్షోభాలకు అది నాంది అవుతుంది. తాజా పరిణామాలు, విశ్లేషణలను చూసిన పుడు మొత్తం మీద వ్లదిమిర్ పుతిన్ కూడా ఆశాభావంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకుల వ్యాఖ్య. ఇప్పటికే ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పుతిన్‌కు యుద్ధం దీర్ఘ కాలం కొనసాగితే రాజకీయ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.అందువల్లనే అతనికీ పరిష్కారం అవసరం.
ట్రంప్ యంత్రాంగం రూపొందించినట్లు చెబుతున్న పరిష్కార పద్ధతి ప్రకారం ప్రస్తుతం రష్యా స్వాధీనంలో లేని కొన్ని ప్రాంతాలతో సహా డాన్‌బాస్ ప్రాంతంలో 6,600 చదరపు కిలోమీటర్లు లేదా పన్నెండు శాతం భూభాగాన్ని ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రతిగా సుమీ, ఖార్కివ్ ప్రాంతాలలో 440 చదరపు కిలోమీటర్లను రష్యా ఖాళీ చేసి ఉక్రెయిన్‌కు ఇస్తుంది. ఇదే జరిగితే రష్యాదే పైచేయి అవుతుంది, దాని షరతుల ప్రాతిపదికగానే ఒప్పందం ఉంటుంది. ఇంతవరకు ఏ ఒక్క అంశం మీద కూడా పుతిన్ దిగిరాలేదు.ఈ పూర్వ రంగంలో అమెరికా ప్రతిపాదనలకు ఉక్రెయిన్ అంగీకరిస్తుందా, ఒకవేళ అమెరికా జెలెన్‌స్కీ మెడలు వంచి ఒప్పించినా ఐరోపా అగ్రదేశాలు తలూపుతాయా, చెప్పలేము. తెల్లవారే సరికి వైఖరులు, పరిణామాలు మారిపోతున్న ఈ రోజుల్లో రష్యా గడ్డమీద తలపెట్టిన తదుపరి భేటీ లోపల ఏమైనా జరగవచ్చు.మిలిటరీ దళాల రంగ ప్రవేశంతో సహా ఉక్రెయిన్‌కు ఐరోపా భద్రత కల్పించేందుకు పుతిన్ అంగీకరించవచ్చని ట్రంప్ యంత్రాంగం చెబుతోంది. దీని మీద పుతిన్ వైపు నుంచి ఇది రాస్తున్న సమయానికి ఎలాంటి ప్రతికూల లేదా అనుకూల స్పందనలు లేవు. ఒక వారంలోపే ఒప్పందం జరగాలని ట్రంప్ పట్టుబడుతుండగా అదెలా కుదురుతుంది, మంచి చెడ్డలు ఆలోచించటానికి కొన్ని వారాల వ్యవధి కావాలని ఐరోపా నేతలు చెబుతున్నారు.
పరిష్కారం కుదరాలంటే ముందుగా డాంటెస్క్, లుహానస్క్ ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ మిలిటరీ వెనక్కు పోవటం తనకు ముఖ్యమని, అది చేస్తే మిలిటరీ చర్య నిలిపివేస్తానని శుక్రవారం నాటి చర్చలలో పుతిన్ స్పష్టం చేశాడట.జూన్ రెండవ తేదీన ఇస్తాంబుల్ సమావేశంలోనే దీన్ని రష్యా ప్రతినిధులు చెప్పారు.దీనితో పాటు క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా అంతర్భాగంగా గుర్తించటం, ఉక్రెయిన్ మిలిటరీ సంఖ్య తగ్గింపు, ఇతర ప్రాంతాల గురించి కూడా దానిలో పేర్కొన్నారు. రష్యన్లు మరీ ఎక్కువగా అడుగుతున్నారని, దాన్లో వారి స్వాధీనంలో లేని ప్రాంతాలు కూడా ఉన్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జెడివాన్స్ వ్యాఖ్యానించటమే కాదు, ఉక్రెయిన్ కూడా అంగీకరించలేదు. గతంలో పేర్కొన్న నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ మిలిటరీ ఉపసంహరణ బదులు రెండు ప్రాంతాల గురించి పుతిన్ పట్టుబట్టినట్లు వార్తలు. ఉక్రెయిన్ భద్రతకు హామీకి తాను అంగీకరిస్తానని అయితే వివిధ దేశాలతో కూడిన అలాంటి వ్యవస్థలో తనకు వీటో అధికారం ఉండాలని రష్యా కోరింది.
తమతో భాగస్వామిగా చేసుకొని ప్రపంచ మార్కెట్లపై పెత్తనం చేయాలని జి7 కూటమి ఎనిమిదవ దేశంగా రష్యాను చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే విబేధాలు తలెత్తి రష్యాను పక్కన పెట్టటం, ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి మాస్కో ముంగిట ఆయుధ మోహరింపుకు పశ్చిమదేశాలు కుట్రపన్నిన తర్వాతే గతంలో తన ప్రాంతంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా 2014లో విలీనం చేసుకుంది.
సోవియట్ ఉనికిలో ఉన్న సమయంలో పాలనా సౌలభ్యం కోసం రష్యన్ రిపబ్లిక్ ప్రాంతమైన క్రిమియాను ఉక్రెయిన్‌లో కలిపారు. సోవియట్ పతనమైన తర్వాత రెండూ స్వతంత్ర దేశాలుగా మారినప్పటికీ 24 సంవత్సరాలు రష్యా వైపు నుంచి విలీనానికి ఎలాంటి ప్రయత్నాలు లేవన్నది గమనించాల్సిన అంశం. తమకు విశ్వసనీయమైన భద్రతా హామీ ఇవ్వాలని జెలెన్‌స్కీ పట్టుబడు తున్నాడు. ఇటీవలి కాలంలో అమెరికా వైఖరిలో వచ్చిన మార్పు ప్రకారం ఆయుధాలు ఎన్నికావాలంటే అన్ని ఇస్తుంది, అవసరమైతే వైమానిక దాడులు జరుపు తుంది తప్ప తన మిలిటరీని కొత్తగా మరేదేశంలోనూ దించేందుకు సిద్ధం కావటం లేదు. అందువలన ఐరోపా దేశాలతో కలసి రక్షణ కల్పించేందుకు ట్రంప్ అంగీకరించే అంశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు.తనకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల కుట్రకు ఉక్రెయిన్ దూరంగా ఉంటే అన్ని రకాల భద్రత కల్పించేందుకు అసలు రష్యానే సిద్ధంగా ఉంటుందన్నది వేరే చెప్పనవసరం లేదు. రష్యాకు కొన్ని ప్రాంతాలను అప్పగిస్తే యుద్ధం ఆగిపోవచ్చుగానీ జెలన్‌స్కీ పదవీ గండం పొంచి ఉంటుంది. జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు చెప్పలేము గానీ అతగాడు గెలిచే సమస్యే లేదు. మంత్రులు, ఉన్నతాధికారులు యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించారనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. భవిష్యత్‌లో రష్యాకు ముప్పు తలెత్తకుండా చూసేందుకు ఇప్పటి వరకు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను సాధించకుండా ఒప్పందం చేసుకుంటే పుతిన్‌కూ అదే పునరావృతం అవుతుంది. ఇన్ని ప్రాణా లను బలిచ్చి ఆర్థికంగా నష్టం కలిగించటం ఎందుకన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. రష్యాది పైచేయిగా మారితే ట్రంప్ కూడా ఇబ్బందుల్లో పడతాడు, వెంటనే ఎన్నికలు లేవు, వచ్చేసారి పోటీ చేస్తాడో లేదో తెలియదు గనుక వ్యక్తిగతంగా కలిగే నష్టం ఉండదు గానీ, ఐరోపాలో ఉన్న పలుకు బడిని అమెరికా కోల్పో వటం ఖాయం, దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీదనే పడుతుంది.
విడివిడిగా అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోలేమన్న వాస్తవాన్ని గ్రహించిన ఐరోపా దేశాలు సమాఖ్య (ఇయు)గా ఏర్పడి, ఐక్యత మరియు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఇతర దేశాల మీద పన్నుల దాడిని ప్రకటించినట్లే ట్రంప్ ఈ కూటమితో కూడా వ్యవహరించి వత్తిడి చేసి ఒక ఒప్పందానికి వచ్చాడు. మరోవైపున జర్మనీ వంటి దేశాలు భారీ ఎత్తున సైనికీకరణకు పూనుకున్నాయి. గతంలో సోవియట్‌ను, గత మూడున్నర దశాబ్దాలుగా రష్యాను చూపి బెదిరించిన అమెరికా ఇప్పుడు ఆ రష్యాతోనే చేతులు కలిపి మరో రూపంలో ఐరోపాను అదుపులో ఉంచుకోవాలని చూస్తోందా అనే కోణాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది. గతంలో సోవియట్, చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబే ధాలను ఉపయోగించుకొని లబ్దిపొందేందుకు చూసింది. ఒకటి రాజకీయ, రెండవది చైనా మార్కెట్లో ప్రవేశించి ఆర్థిక లబ్ది. తైవాన్ బదులు కమ్యూనిస్టు చైనాకు భద్రతామండలిలో శాశ్వత సభ్వత్యం కల్పించటాన్ని సైద్ధాంతిక విబేధాలున్నా నాటి సోవియట్ వ్యతిరేకించలేదు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే రష్యా మరియు చైనా నేడు మిత్రదేశాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో పుతిన్ కమ్యూనిస్టు కాదు, రష్యా సోషలిస్టు దేశం కాదు.ఈ రెండో అంశాన్ని ఉపయోగించుకొని మిత్రబేధంతో రష్యాను దగ్గరకు తీసుకోవాలని, దాని వనరులు, మార్కెట్‌లో లబ్ది పొందాలని కొందరు అమెరికన్లు కోరుతున్నారు. ఇందుకు ఉక్రెయిన్ సంక్షోభం ఆటంకంగా ఉంది గనుక దాన్ని పరిష్కరించాలని వారు చెబుతున్నారు. ఈ పూర్వరంగంలోనే ఎరగా ఉక్రెయిన్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలన్నది ట్రంప్ ఎత్తుగడ అంటున్నారు. అయితే అదే జరిగితే ఐరోపాలోని ధనికదేశాలు చైనాతో జట్టుకట్టే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేము. పెట్టుబడిదారులకు లాభాలు తప్ప శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పుతిన్ తక్షణ ఆలోచన యుద్ధం నుంచి బయటపడి తద్వారా ఆర్థిక ఆంక్షల బంధాలను బద్దలు కొట్టడం గనుక ఆ కోణంలో దాని మీద కేంద్రీకరించవచ్చు.అమెరికా మద్దతు లేకపోయినా ఐరోపా దేశాలు ఇచ్చే ధైర్యం, ఆయుధ సాయంతో నిలవగలమని ఉక్రెయిన్ భావిస్తే వెంటనే ఒప్పందానికి అంగీకరించకపోవచ్చు. లేకపోతే ముందే చెప్పుకున్నట్లు రష్యా షరతుల మీద రాజీకి రావచ్చు కూడా!
-సత్య
ఉక్రెయిన్ సంక్షోభం: అలాస్కా సమావేశ ఆంతర్యమేమిటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES