No menu items!
Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఆటలుశుభ్‌మన్‌కు చోటు

శుభ్‌మన్‌కు చోటు

- Advertisement -

– శ్రేయస్‌, జైస్వాల్‌కు మొండిచేయి
– జశ్‌ప్రీత్‌ బుమ్రానే పేస్‌ దళపతి
– ఆసియా కప్‌ భారత జట్టు ఎంపిక

సెలక్షన్‌ కమిటీ, జట్టు మేనేజ్‌మెంట్‌ అందరూ ఊహించిన నిర్ణయాలే తీసుకున్నారు!. ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌, యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టి.. టెస్టు కెప్టెన్సీ ప్రభావంతో శుభ్‌మన్‌ గిల్‌ను ఎంచుకున్నారు. గత రెండు సీజన్లుగా ఐపీఎల్‌ను కెప్టెన్‌గా, ఆటగాడిగా ఏలుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ను కారణంగా లేకుండా సెలక్షన్‌ కమిటీ పక్కనపెట్టింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీ నిలుపుకోగా.. శుభ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆసియాకప్‌తో భారత జట్టు 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ప్రయాణం ఆరంభం కానుండగా.. అయ్యర్‌, జైస్వాల్‌కు టీ20 ప్రణాళికల్లో చోటు లేనట్టే!.

నవతెలంగాణ – ముంబయి
2025 ఆసియా కప్‌కు భారత జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.. 2026 ఐసీసీ టీ20 ప్రణాళికలను సైతం ఆవిష్కరించింది. వచ్చే ఏడాది టైటిల్‌ డిఫెన్స్‌లో భాగంగా 16-17 మంది క్రికెటర్లతోనే పొట్టి ఫార్మాట్‌లో నిలకడగా ఆడాలనే ప్రణాళికతో ఉన్నామని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ వెల్లడించాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో గొప్పగా రాణిస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌, యశస్వి జైస్వాల్‌కు ప్రపంచకప్‌ ప్రణాళికల్లోనూ చోటు లేదని తేలిపోయింది!. ఐపీఎల్‌ ఫామ్‌, టెస్టు కెప్టెన్సీ ప్రభావంతో శుభ్‌మన్‌ గిల్‌ అలవోకగా టీ20 జట్టులోకి వచ్చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో చోటుతో పాటు వైస్‌ కెప్టెన్సీ సైతం శుభ్‌మన్‌ గిల్‌ దక్కించుకున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో 15 మందితో కూడిన భారత జట్టు ఆసియా కప్‌లో పోటీపడనుంది. భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న 2025 ఆసియా కప్‌ పాకిస్తాన్‌తో ఒప్పందం కారణంగా తటస్థ వేదిక యుఏఈలో జరుగనుంది. సెప్టెంబర్‌ 9 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌లో భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఆలస్యంగా ముంబయికి చేరుకోవటంతో సెలక్షన్‌ కమిటీ సమావేశం సైతం షెడ్యూల్‌ సమయానికంటే ఆలస్యంగా ఆరంభమైంది. వర్షం కారణంగా దేవజిత్‌ ప్రయాణిస్తున్న విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. అహ్మదాబాద్‌ నుంచి మళ్లీ ముంబయి చేరుకునేందుకు ఆలస్యమైంది. మహిళల సెలక్షన్‌ కమిటీ సమావేశం సైతం ఆలస్యంగానే మొదలైంది.
శుభ్‌మన్‌ వచ్చేశాడు
టీ20 ప్రణాళికల్లో ఇమడపోయినా.. జట్టు మేనేజ్‌మెంట్‌, సెలక్షన్‌ కమిటీ శుభ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేసింది. దీంతో యశస్వి జైస్వాల్‌కు నిరాశే ఎదురైంది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, శుభ్‌మన్‌ గిల్‌ జట్టులో ఉండగా.. వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలతో గిల్‌ తుది జట్టులో నిలుస్తాడనటంలో సందేహం లేదు. దీంతో సంజు శాంసన్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సిందే. సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ బ్యాటింగ్‌ లైనప్‌లో నం.3-4 స్థానాల్లో ఆడనుండగా… అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్య, శివం దూబె, జితేశ్‌ శర్మ, రింకూ సింగ్‌లు లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో నిలిచారు. వికెట్‌ కీపర్‌ కోటాలో తుది జట్టులో నిలిచేందుకు సంజు శాంసన్‌, జితేశ్‌ శర్మల మధ్య పోటీ ఉండనుంది. లోయర్‌ ఆర్డర్‌లో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ కోసం స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను పక్కనపెట్టారు.
బుమ్రానే పేస్‌ దళపతి
ఫిట్‌నెస్‌, పని భారంతో జశ్‌ప్రీత్‌ బుమ్రా ఆసియా కప్‌లో ఆడతాడా? లేదా? అనే చర్చ నడిచింది. బీసీసీఐ వైద్యుల నివేదికకు తోడు ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత విలువైన విరామం లభించటంతో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ బుమ్రాను జట్టులోకి తీసుకుంది. అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రానాలతో కలిసి బుమ్రా పేస్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. హార్దిక్‌ పాండ్య సైతం పేస్‌ విభాగంతో కలిసి బాధ్యతలు పంచుకోనున్నాడు. మెగా టోర్నమెంట్లకు బుమ్రా ఉండాలని సెలక్షన్‌ కమిటీ భావిస్తుందని అగర్కార్‌ అన్నాడు. ‘ బుమ్రా పని ఒత్తిడి అంశంలో ఎటువంటి లిఖిత ప్రణాళికలు లేవు. ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత మంచి విరామం లభించింది. ఫిజియోలు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌, అతడికి సంబంధించిన ఇతర వ్యక్తులతో ఎప్పుడూ సంప్రదింపులు జరుపుతూనే ఉంటాం. అతడి విలువ తెలిసి, అతడిని కాపాడుకునే ప్రయత్నం చేశాం. కానీ మెగా ఈవెంట్లకు అతడు ఉండాలని కచ్చితంగా అనుకుంటున్నాం. గాయాలతో గత 2-3 ఏండ్లుగా అతడు పెద్దగా అందుబాటులో లేడు. ఆసియా కప్‌లో అతడి అవసరం ఉందని జట్టు మేనేజ్‌మెంట్‌ భావించిన దానికంటే ఎక్కవ సార్లే బుమ్రా అందుబాటుల ఉంటాడని అనుకుంటున్నామని’ అగార్కర్‌ తెలిపారు.
ఇద్దరు మాయగాళ్లు
స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ పటేల్‌ ఉండటంతో.. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కోటాలో ఒక్కరికే అవకాశం దక్కుతుందని అనుకున్నారు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ సైతం రేసులో నిలిచాడు. కానీ సెలక్షన్‌ కమిటీ ఆశ్చర్యకరంగా ఇద్దరు స్పిన్నర్లను జట్టులోకి తీసుకుంది. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌లు ఆసియా కప్‌కు ఎంపికయ్యారు. యుఏఈ పిచ్‌లు స్పిన్‌, స్లో బౌలింగ్‌కు అనుకూలం. దీంతో ఈ ఇద్దరు స్పిన్నర్లు మిడిల్‌ ఓవర్లలో భారతకు గేమ్‌ చేంజర్‌గా మారగలరని సెలక్షన్‌ కమిటీ భావించినట్టుగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్ల కోటాలో అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యకు తోడు శివం దూబె చోటు సాధించాడు.
శ్రేయస్‌కు లేదు చోటు
2024 ఐపీఎల్‌ విన్నింగ్‌ కెప్టెన్‌, 2025 ఐపీఎల్‌ రన్నరప్‌ సారథి.. ఈ ఏడాది ఐపీఎల్‌లో 175 స్ట్రయిక్‌ రేట్‌తో 604 పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌కు భారత టీ20 జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ విజయంలోనూ కీలక పాత్ర పోషించిన శ్రేయస్‌ అయ్యర్‌ను మెగా ఈవెంట్‌కు సెలక్షన్‌ కమిటీ పక్కనపెట్టింది. ‘జట్టులో చోటు దక్కకపోవడానికి శ్రేయస్‌ వైపు ఎటువంటి కారణాలు లేవు. కానీ జట్టులో ఇప్పుడు అతడు ఎవరి స్థానం భర్తీ చేయగలడు? ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్‌ అయ్యర్‌ అవకాశం కోసం ఎదురుచూడాల్సిందే’ అని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ అన్నాడు.
పొట్టి ఫార్మాట్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లకు మారుపేరు యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టులోనూ యశస్వి జైస్వాల్‌ ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా ఉన్నాడు. టెస్టు క్రికెట్‌ ప్రాధాన్యతలతో జైస్వాల్‌ను టీ20 ఫార్మాట్‌కు దూరం పెట్టారు. టీ20 ప్రపంచకప్‌లో లేని శుభ్‌మన్‌ గిల్‌ను ఎంచుకున్న సెలక్షన్‌ కమిటీ.. యశస్విని వదిలేసింది. ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్లతో పాటు రిజర్వ్‌లో ఉంచి ఊరట మాత్రమే ఇచ్చింది. ‘యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కకపోవటం దురదష్టకరం. గత రెండేండ్లుగా అభిషేక్‌ శర్మ గొప్పగా రాణిస్తున్నాడు. అభిషేక్‌ శర్మ పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గానూ ఉపయుక్తం. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్లలో ఎవరో ఒకరు జట్టులో చోటు కోల్పోతారు’ అని అజిత్‌ అగర్కార్‌ వివరించాడు.
ఆసియా కప్‌కు భారత జట్టు
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్య, అర్ష్‌దీప్‌ సింగ్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, శివం దూబె, అక్షర్‌ పటేల్‌, జితేశ్‌ శర్మ, జశ్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రానా, రింకూ సింగ్‌, సంజు శాంసన్‌.
స్టాండ్‌బై ఆటగాళ్లు : ప్రసిద్‌ కష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌, రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌, యశస్వి జైస్వాల్‌.

2026 టీ20 వరల్డ్‌కప్‌ రోడ్‌మ్యాప్‌!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ నిలుపుకునేందుకు టీమ్‌ ఇండియా రోడ్‌మ్యాప్‌ ఆసియా కప్‌తో మొదలు కానుంది. ఆసియా కప్‌లో గరిష్టంగా (ఫైనల్‌కు చేరితే) ఏడు మ్యాచులు ఆడనున్న భారత్‌.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో (అక్టోబర్‌-నవంబర్‌) ఐదు టీ20లు ఆడనుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లు ఉన్నాయి. ఓవరాల్‌గా 2026 టీ20 ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ ఇండియా గరిష్టంగా 22 మ్యాచులు ఆడనుంది. ప్రపంచకప్‌కు వెళ్లే కోర్‌ టీమ్‌ (15-17)తోనే భారత్‌ ప్రతి సిరీస్‌ ఆడేందుకు సిద్దమవుతుంది. ఇదే విషయాన్ని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పష్టం చేశారు.
ప్రయాణం మొదలు :
‘గత ఏడాది టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత భారత్‌ బరిలోకి దిగుతున్న మెగా టోర్నమెంట్‌ ఆసియా కప్‌. మమ్మల్ని పరీక్షించుకునేందుకు ఇదొ చక్కని అవకాశం. ఆసియా కప్‌ తర్వాత సైతం ఎన్నో టీ20లు ఆడాల్సి ఉంది. 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుంది’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ అన్నాడు.
ఓ ఆలోచనతో ముందుకు :
‘2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత మాకు ఓ ఆలోచన ఉంది. ఆ ఆలోచనతోనే ముందుకు సాగుతున్నాం. 2026 టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఓ 16-17 మంది క్రికెటర్లతోనే ముందుకు వెళ్లాలని అనకుంటున్నాం. ఇప్పుడు మా ప్రణాళికల్లో ఉన్న ప్లేయర్స్‌కే అవకాశాలు ఇస్తూ.. వరల్డ్‌కప్‌కు వెళతాం’ అని అజిత్‌ అగార్కర్‌ తెలిపాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad