నవతెలంగాణ-బోడుప్పల్ : భారతదేశానికి ఆధునిక సాంకేతికతను పరిచయం చేసి, యువతకు దిశా నిర్ధేశం చేసిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ స్పూర్తితో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకల్లో వజ్రెష్ యాదవ్, ఇతర నేతలతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ…“దేశాన్ని సాంకేతిక రంగంలో నడిపించిన ఘనత రాజీవ్ గాంధీదే. ఆయన ఆలోచనలు మా కార్యకర్తలకు దారి చూపే దిక్సూచి. కాంగ్రెస్ సైనికులు క్రమశిక్షణతో పనిచేసి పార్టీని బలోపేతం చేసి, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బీ బ్లాక్ ప్రదాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, నగర ప్రధాన కార్యదర్శి విశ్వం, మాజీ కార్పొరేటర్లు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.