నవతెలంగాణ – కంఠేశ్వర్
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్ని మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కాలేజ్ ప్రారంభించి, భవనం నిర్మించడం మరిచిపోయారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. బుధవారం వర్ని మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటయ్య క్యాంపులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి, ఏండ్లు గడుస్తున్న అధికారులు నిరుపేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటులో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో పాటు, ఎంపీ సురేష్ షెట్కార్, బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయరని మండిపడ్డారు.
జిల్లాలో రైతులు ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ఎరువుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ, 2 వేల 5 వందలు ఎప్పుడు ఇస్తారని అన్నారు. పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీలు మరిచారన్నారు. ఈ సమస్యలన్నింటిపైన సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. సమావేశంలో పార్టీ ఏరియా కార్యదర్శి నన్నేసాబ్, నాయకులు గంగాధర్, లక్ష్మణ్, రాములు, నాగనాథ్, శంకర్, మారయ్య, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.