సత్వరమే లక్ష రుణమాఫీ చేయాలి

Quickly
1 lakh should be waived– విపత్కర పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం బాసటగా నిలవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
నవ తెలంగాణ- అచ్చంపేట
గత ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ రైతులకు ఇచ్చిన హామీ.. లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) నాగర్‌కర్నూల్‌ జిల్లా విస్తృతస్థాయి సమావేశం సోమవారం అచ్చంపేట పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌ భవనంలో దేశనాయక్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామన్న హామీని సీఎం కేసీఆర్‌ మర్చిపోయారా అని ప్రశ్నించారు. భారీ వర్షాలతో నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ.. ఎరువుల ధరలను విపరీతంగా పెంచుతూ.. సబ్సిడీలు తగ్గిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి బాసటగా నిలవాలని సూచించారు. పీఎం కిసాన్‌ సమ్మన్‌ రూ.2000 రైతులను ఆదుకునే విధంగా లేదని, ఏడాదికి మూడు దఫాలుగా రూ.6000 చొప్పున 18 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంట బీమా కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేకూర్చేవిధంగా ఉందని, దాన్ని రైతులకు ఉపయోగకరంగా మార్చాలని అన్నారు. ఆయా పంటలకు మద్దతు నిర్ణయించి, కేంద్రంలో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.శ్రీనివాసులు, కందికొండ గీత, చింత ఆంజనేయులు, ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు శంకర్‌నాయక్‌, శివవర్మ, శ్రీనివాసులు, అశోక్‌ మల్లయ్య, నిర్మల, బాలస్వామి, కాశన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love