Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఆల్‌రౌండర్లకు పెద్దపీట

ఆల్‌రౌండర్లకు పెద్దపీట

- Advertisement -

– ఆసియాకప్‌కు జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల అభిప్రాయం

ముంబయి : ఆసియాకప్‌కకు జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు సానుకూలంగా స్పందించారు. ఆల్‌రౌండర్లకు పెద్దపీట వేయడంతో టీమిండియా బలోపేతంగా ఉందని కొందరు తెలుపగా.. శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై, జైస్వాల్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేయడంపై పెదవి విరుస్తున్నారు. భవిష్యత్తులో యువ క్రికెటర్లకు సారథ్య బాధ్యతలు అప్పగించాలన్న ఉద్దేశ్యంతో శుభ్‌మన్‌ గిల్‌కు టి20ల్లో చోటు కల్పించారని, ఈ ఫార్మాట్‌లో గిల్‌ పునారాగమనం సవాలుతో కూడుకుందని, భవిష్యత్తులో మూడు ఫార్మాట్‌లకు ఒకే కెప్టెన్‌ ఉంటే మంచిదనే అభిప్రాయంతోనే శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక జరిగిందని వారి వాదన. అలాగే భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు టెస్ట్‌ కెప్టెన్‌ను ఈ ఫార్మాట్‌లో ఎంపిక చేశారని, గతంలో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న అక్షర్‌ పటేల్‌ను ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. ఆసియాకప్‌లో గిల్‌, అభిషేక్‌ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. ఆ తర్వాత తిలక్‌ వర్మ, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌, అక్షర్‌ ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలోపేతంగా ఉంది. గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించడం ప్రస్తుత టోర్నీ కోసమే కాకుండా.. భవిష్యత్‌ కెప్టెన్సీని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయంగా అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. సెలక్టర్లు శుభ్‌మాన్‌ గిల్‌ను భవిష్యత్‌ కెప్టెన్‌గా పరిగణించే అవకాశం ఉందని.. బహుశా అన్ని ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా కనిపించొచ్చని.. అయితే, ప్రతి ఫార్మాట్‌లో ఒకే ఒక కెప్టెన్‌ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ సంజు శాంసన్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని తెలిపాడు. గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించిన వెంటనే, శాంసన్‌ స్థానానికి ముప్పు ఏర్పడిందని, శుభ్‌మన్‌ గిల్‌ ఖచ్చితంగా ఓపెనర్‌గా వస్తాడని పేర్కొన్నాడు. టి20ల్లో శాంసన్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని.. గత ఏడాది టి20ల్లో మూడు సెంచరీలు కొట్టాడని గుర్తు చేశాడు.
17 ఏళ్లలో ఇదే తొలిసారి…
రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి లేకుండా ఒక ప్రధాన టోర్నీలో భారతజట్టు ఆడడం ఇదే తొలిసారి. 2008 తర్వాత భారత జట్టులో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ పేర్లు లేవు. 2008లో ఆడిన ఆసియా కప్‌లో మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్‌గా ఉన్నాడు. ఇది రోహిత్‌ శర్మకు తొలి ఆసియా కప్‌. ఆ ఎడిషన్‌లో విరాట్‌ జట్టులో లేడు. 2010లో వన్డే ఫార్మాట్‌లో ఆడిన ఆసియా కప్‌కు కూడా ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఇద్దరూ ఆ ఎడిషన్‌లో జట్టులో ఉన్నారు. 2012లో వన్డే ఫార్మాట్‌లో ఆడిన ఆసియా కప్‌లో ధోనీ కెప్టెన్‌గా, విరాట్‌ కోహ్లీ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నారు. రోహిత్‌ శర్మ కూడా జట్టులో ఉన్నాడు. 2014లో విరాట్‌ కోహ్లి, 2016లో ధోనీ, 2018లో రోహిత్‌ శర్మ కెప్టెన్లుగా ఉన్నారు. ఈసారి టి20 ఫార్మాట్‌లో ఆసియాకప్‌ జరుగుతున్న దృష్ట్యా.. వీరిద్దరూ ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో 17ఏళ్ల తర్వాత భారతజట్టు వీరిద్దరూ లేకుండానే బరిలోకి దిగుతోంది.
జైస్వాల్‌ను ఎంపిక చేయాల్సింది..
యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జైస్వాల్‌ను ఇలా పక్కన పెట్టడం అన్యాయమని, ఇంగ్లండ్‌ గడ్డపై అద్భుతంగా రాణించిన ఆటగాడికి ఇలాంటి అన్యాయం జరిగితే ఆట దెబ్బతీనే ప్రమాదం ఉందన్నాడు. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శుభ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా తీసుకుని, జైస్వాల్‌ను జట్టు నుంచి తప్పించిందని యూట్యూబ్‌ ఛానెల్‌లో స్పందించారు. ఏ ఫార్మాట్‌లో అవకాశం ఇచ్చినా, అతను జట్టుకు అత్యుత్తమంగా రాణించాడు. ఇంత మంచి ఆటగాడికి జట్టులో చోటు ఇవ్వకపోవడం అర్థం కావడం లేదని పేర్కొన్నారు. టి20 ఫార్మాట్‌లో జైస్వాల్‌ 165 స్ట్రయిక్‌ రేట్‌తో ఆడుతున్నాడని, బంతిని బాదాల్సినప్పుడే కాదు.. కష్టం వచ్చినప్పుడు కూడా శక్తితో ఆడేందుకు ప్రయత్నిస్తాడని, ఈ నిర్ణయం వల్ల జైస్వాల్‌ మళ్లీ తన కెరీర్‌ను మొదటి నుంచి పునరుద్ధరించుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు.
ఆల్‌రౌండర్లతో మరింత బలోపేతం
ఆసియాకప్‌కు ప్రకటించిన జట్టులో నలుగురు ఆల్‌రౌండర్లకు చోటు దక్కింది. అక్షర్‌, హార్దిక్‌, అభిషేక్‌,
దూబేల ఎంపికే ఇందుకు నిదర్శనం. వీరిలో కనీసం ముగ్గురికి తుదిజట్టులో చోటు దక్కడం ఖాయం. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తితోపాటు, పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా నిర్ణయాత్మక మ్యాచుల్లో ఆడొచ్చు. వికెట్‌ కీపర్‌ కోటాలో సంజు, బ్యాటర్ల కోటాలో గిల్‌, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, రింకు ఆడడం ఖాయం. దీంతో ఆసియాకప్‌కు భారత్‌ బలీయ జట్టుతోనే బరిలోకి దిగనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad