Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఅభివృద్ధిని అడ్డుకు నేదొంగల పని పట్టాలి

అభివృద్ధిని అడ్డుకు నేదొంగల పని పట్టాలి

- Advertisement -

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదు
మూసీ ప్రక్షాళనతో ఓల్డ్‌ సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం
గోదావరి జలాలతో 365 రోజులు మూసీలో
నీరుండేలా రివర్‌ ఫ్రంట్‌ : సీఎం రేవంత్‌రెడ్డి
గచ్చిబౌలిలో జిల్లా రిజిస్ట్రార్‌, ఇంట్రిగ్రేటెడ్‌ సబ్‌-
రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు శంకుస్థాపన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

”హైదరాబాద్‌ చారిత్రాత్మక నగరం.. అంతర్జాతీయ స్థాయిలో ఈ నగరం గుర్తింపు పొందడానికి ఆనాటి కులీకుతుబ్‌ షాహీ నుంచి ఈనాటి వరకు ఎంతోమంది కృషి చేశారు.. వారి కృషి వల్లే ప్రపంచ చిత్రపటంలో ఒక గొప్ప నగరంగా హైదరాబాద్‌కు కీర్తి ప్రతిష్టలు దక్కాయి” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొంత మంది అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారని, అలాంటి దొంగల పని పట్టాల్సి ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌ బాబుతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్‌ సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్మాణంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రాజీవ్‌ గాంధీ కృషి వల్లే దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని, తెలంగాణలోనూ హైటెక్‌ సిటీ అభివృద్ధికి ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పునాది వేసిందని తెలిపారు. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కంపెనీలు ఇక్కడికి వచ్చాయంటే ఆనాటి ముఖ్యమంత్రుల దూరదృష్టే కారణమని చెప్పారు. మూసీ ప్రక్షాళన, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదని, ఆనాడు హైటెక్‌ సిటీ నిర్మాణాన్ని సైతం కొంతమంది అవహేళన చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ నగరానికి బెంగళూరు, చెన్నై లాంటి నగరాలతో కాదు పోటీ.. టోక్యో, న్యూయార్క్‌ లాంటి నగరాలతో పోటీపడుతుందని సీఎం అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. పాతబస్తీ.. అది ఓల్డ్‌ సిటీ కాదు ఒరిజినల్‌ సిటీ అని, మూసీ ప్రక్షాళనతో ఓల్డ్‌ సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పారు. గోదావరి జలాలను తీసుకొచ్చి 365 రోజులు మూసీలో నీరుండేలా రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తామని తెలిపారు. మధ్యతరగతి ప్రజల కోసం నగరంలో రాజీవ్‌ స్వగృహ భవనాలను నిర్మించాలని నిర్ణయించామని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలంటే నగర అభివృద్ధితో పాటు విస్తరణ జరగాలని అన్నారు.

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల రూపురేఖల మార్పు
ఆదాయాన్ని ఇచ్చే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తూ, అన్ని సౌకర్యాలతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నిర్మించబోతున్నామన్నారు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు స్థాయిలో సౌకర్యాలతో సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు నిర్మిస్తామని, ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా కార్యాలయాలు నిర్మిస్తున్నామన్నారు. 2026 జూన్‌ 2.. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి 11 ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రికి సూచిస్తున్నట్టు చెప్పారు. 2034 వరకు ప్రపంచమంతా హైదరాబాద్‌ నగరం వైపు చూస్తుందని, ఆ స్థాయిలో అభివృద్ధి చేసుకుందామని, నగర అభివృద్ధిని అడ్డుకునే వారు మనకు శత్రువే.. అలాంటి దొంగల పని పట్టాల్సింది మీరేనని సీఎం అన్నారు.పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని, హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసి ప్రపంచంలో మొదటి స్థానంలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రులు అన్నారు.
దాదాపు 50 వేల చదరపు అడుగుల స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను అన్ని హంగులతో ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, మండలి చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రార్‌ స్పెషల్‌ సెక్రెటరీ రాజీవ్‌ గాంధీ హన్మంతు, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, ఉన్నతాధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad