Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుపాలకులకు పట్టని అభాగ్యులు

పాలకులకు పట్టని అభాగ్యులు

- Advertisement -

పట్టెడన్నం కోసం పడరాని పాట్లు కడుపు నింపుకునేందుకే భిక్షాటన
బస్‌షెల్టర్లు, ప్రధాన కూడళ్లు, ఫ్లైఓవర్‌ బేస్‌మెంట్లే ఆవాసాలు
హైదరాబాద్‌లో యాచకుల దీనస్థితి
కాగితాలకే పరిమితమైన బెగ్గర్స్‌ ఫ్రీ సిటీ ప్రాజెక్ట్‌

జీవితపు చరమాంకంలో కన్నవారి ఆదరణ లేని వృద్ధులు, విధివంచితులైన చిన్నారులు, ఉపాధిలేక కడుపు నింపుకోవడానికి మరి కొంతమంది భిక్షాటనను వృత్తిగా ఎంచుకుంటున్నారు. పట్టెడన్నం కోసం యాచకులు హైదరాబాద్‌ మహానగరంలో పడరాని పాట్లు పడుతున్నారు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, చలికి వణుకుతున్నారు. బస్‌షెల్టర్లు, ప్రధాన కూడళ్లు, మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్‌ బేస్‌మెంట్లే వారికి ఆవాసాలు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆపన్నహస్తం కోసం ఎదరుచూస్తూ.. దినదిన గండంగా బతుకు వెళ్లదీస్తున్నారు. వారిని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలున్నాయి.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బషీర్‌బాగ్‌ చౌరస్తాలో వచ్చిపోయే వారిని బిచ్చమడిగి పొట్ట పోసుకునే శ్రీనివాస్‌ ఒకప్పుడు బాగా బతికిన వాడే. కన్నవారు ఆదరించక పోవడంతో భిక్షాటనే వృత్తిగా ఎంచుకున్నాడు. ఉదయం ఎవరైనా దాతలు అందిస్తే టిఫిన్‌.. మధ్యాహ్న భోజనం దొరికితే తినడం.. లేదంటే రూ.5 వెచ్చించి ఇందిరమ్మ క్యాంటిన్లో కడుపు నింపుకోవడం. రాత్రి షరా మామూలే.. ఎవరైనా కనికరిస్తే సరే.. లేదంటే మంచి నీళ్లు తాగి పడుకోవడం. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌ వద్ద ఉండే మునీర్‌ది పాత బస్తీ. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. బంధువులు, కావాల్సిన వారు దగ్గరకు రానివ్వకపోవడంతో భిక్షాటనే వృత్తిగా ఎంచుకున్నారు. అడుక్కోడంతో పాటు చిన్నా, చితక పనులు కూడా చేస్తుంటాడు. ఒక్క శ్రీనివాస్‌, మునీర్‌ అనే కాదు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ), వివిధ స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం హైదరాబాద్‌ నగరంలో దాదాపు 5వేల మందికి పైగా భిక్షాటన వృత్తిగా జీవిస్తున్నారు.

నగరంలోని కూడళ్లు, ప్రధాన వీధులు రద్దీ సమయాల్లో యాచకులతో నిండి పోతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని గత ప్రభుత్వం తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 2017లో చంచల్‌గూడ, చెర్లపల్లి జైళ్ల ఆవరణలో రెండు ఆనందాశ్రమాలను ఏర్పాటు చేసింది. దాదాపు రెండేండ్ల పాటు హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా 8 వేల మందికిపైగా బిచ్చగాళ్లను గుర్తించి, వారికి ఆనందాశ్రమాల్లో పునరావాసం కల్పించింది. వారికి వివిధ వృత్తుల్లో శిక్షణ అందించడం, సమాజంలో తిరిగి చేర్చడం లక్ష్యంగా పని చేసింది. అయితే ఈ కార్యక్రమ అమల్లో అప్పటి జైళ్ల డీజీ వికే.సింగ్‌ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆయన బదిలీ తర్వాత ఈ పథకం అటకెక్కింది. ఆ తర్వాత ఐదేండ్ల పాటు వీరి గురించి పట్టించుకోలేదు. 2023లో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌ తిరిగి వీరి పునరావాసంపై కల్పించి నగరాన్ని బెగ్గర్స్‌ ఫ్రీ సిటీగా మార్చాలని జీహెచ్‌ఎంసీలోని అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ (యూసీడీ) విభాగానికి బాధ్యతలు అప్పగింది. రెండు నెలల క్రితం హడావుడి చేసిన యూసీడీ నగరంలోని 102 మంది బిచ్చగాళ్లను వివిధ షెల్టర్‌ హోంలకు తరలించింది. ఆ తర్వాత దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. దాంతో వారంతా తిరిగి రోడ్లపైనే కనిపిస్తున్నారు.

నత్తనడకన స్మైల్‌ ప్రాజెక్ట్‌లు…
ఇండియాను బెగ్గర్స్‌ ఫ్రీగా చేయాలనే లక్ష్యంతో కేంద్రం ‘స్మైల్‌’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా మొదటి దశలో హైదరాబాద్‌లో రెండు ప్రాజెక్ట్‌లకు కేంద్రం అనుమతించింది. మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ విభాగం చేపట్టిన ఈ స్కీం ద్వారా బిచ్చగాళ్లను గుర్తించి వారికి వైద్య సంరక్షణ, కౌన్సిలింగ్‌, విద్య, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పిస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరాన్ని బెగ్గర్‌ ఫ్రీ సిటీగా మార్చే బాధ్యతలు జీహెచ్‌ఎంసీలోని యూసీడి విభాగానికి కేటాయించారు. 2022లో అనుమతించిన మొదటి ప్రాజెక్ట్‌ కోసం కేంద్రం రూ.4 కోట్లు కేటాయించింది. నగరానికి చెందిన సయోధ్య, యంగిస్తాన్‌ అనే రెండు స్వచ్ఛంద సంస్థలకు నగరంలోని బిచ్చగాళ్లను గుర్తించి వారి వివరాలను యూసీడికి నివేదించే పని అప్పగించారు. అనంతరం యూసీడీ ఇచ్చే ఆదేశాల మేరకు వారిని షెల్టర్‌ హోంలకు తరలించి, పునరావాసం కల్పించాలి.
అయితే సదరు స్వచ్చంద సంస్థలు ఇచ్చిన సర్వే నివేదికలు జీహెచ్‌ఎంసీ యూసీడి విభాగం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే రెండవ ప్రాజెక్ట్‌ కోసం కేంద్రం ఇటీవల రూ.70లక్షలు కేటాయించింది. ఇందుకు సంబంధించి త్వరలో నోటోఫికేషన్‌ విడుదల చేసి స్వచ్ఛంద సంస్థలను ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ సైతం యూసీడీ వద్ద పెండింగ్‌లో ఉంది.

దడ పుట్టిస్తున్న బెగ్గర్స్‌ మైగ్రేషన్‌…
బెగ్గింగ్‌ మైగ్రేషన్‌ అనే పదం కొత్తగా అనిపిస్తున్నా హైదరాబాద్‌ నగరం ఈ తాకిడికి గురువుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీతో పాటు ఉత్తరాది నుంచి నగరానికి ఇటీవల బిచ్చగాళ్ల వలసలు భారీగా పెరుగుతున్నాయి. సామాజికవేత్తలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బెగ్గింగ్‌ వలసలకు భయపడుతోంది. పేదరికం, వృద్ధాప్యం, ఉపాధి లభించక పోవడం భిక్షాటనకు ప్రధాన కారణం అయినప్పటికీ… సామాజిక శాస్త్ర అధ్యయనాల ప్రకారం బద్ధకం, శ్రమ పట్ల విరక్తి వంటి మానసిక కారణాలతో పాటు తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది వ్యక్తులు దీన్నే వృత్తిగా ఎంచుకుంటున్నారు. మరి కొంతమంది ఈ రంగంలో విస్తరించి చిన్నారులు, వృద్ధులు, అనాధలతో బలవంతపు భిక్షాటన చేయిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఇలాంటి ముఠాలు అనేక సందర్భాల్లో పట్టుబడ్డాయి. అయినా ఇతర రాష్ట్రాల నుంచి ఇలాంటి ముఠాలు కొత్త కొత్త అవతారాలతో నగరంలో పాగా వేస్తున్నాయి. ఫలితంగా ఎలాంటి ఆదరణ లేని నిజమైన బిచ్చగాళ్లకు వీరి ఆగడాలు గుదిబండగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

బిచ్చగాళ్ల తరలింపు కొనసాగుతోంది : దేవేందర్‌రెడ్డి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగం
హైదరాబాద్‌ నగరంలో జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగం ఆధ్వర్యంలో బిచ్చగాళ్ల తరలింపు, పునరావాసం కొనసాగుతోంది. రెండు నెలల క్రితం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి నగరంలోని దాదాపు 100 మందికి పైగా బెగ్గర్లను వివిధ షెల్టర్‌ హోంలకు తరలించాం. ఈ కార్యక్రమం ఆగిపోయిందనడంలో వాస్తవం లేదు. ఇది నిరతంర ప్రక్రియ. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బిచ్చగాళ్లు నగరానికి ఇబ్బందిగా మారుతున్నారు. ఎన్నిసార్లు వారిని తరలించినా తిరిగి పాగా వేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తాం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad