బీహార్‌లో అర్హుల ఓట్ల తొలగింపు
రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేయని ఈసీ
బీజేపీని గద్దెదించితేనే దేశానికి రక్ష
ఉపరాష్ట్రపతిగా సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలి : సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా
గాజుల రామారంలో రాష్ట్ర మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రమాదంలో పడిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా విమర్శించారు. బీహార్‌లో అర్హులైన ఓట్లను తొలగించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. అర్హులైన వారి ఓటు హక్కును కాపాడ్డమే ఎన్నికల కమిషన్ (ఈసీ) బాధ్యత అనీ, దాన్ని సక్రమంగా నిర్వర్తించడం లేదని చెప్పారు. బీహార్‌లో అర్హులకు ఓటు హక్కు కల్పించాలంటూ ఉద్యమం సాగుతున్నదని వివరించారు. మోడీని, బీజేపీని గద్దెదించితేనే దేశానికి రక్షణ ఉంటుందన్నారు. అందుకోసం వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఒకే వేదికమీదకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో ‘కామ్రేడ్ పొట్లూరి నాగేశ్వరరావు నగర్’లో ‘కామ్రేడ్ ఎన్ బాలమల్లేశ్ హాల్’ (మహారాజా గార్డెన్స్)లో మూడు రోజులపాటు జరిగే సీపీఐ రాష్ట్ర నాలుగో మహాసభలు బుధవారం ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమ య్యాయి. ఆ ప్రాంగణంతా అరుణపతాకాలతో ఎరుపెక్కింది. మహాసభను రాజా ప్రారంభించారు. అతిథులుగా సీపీఐ జాతీయ కార్యదర్శులు కె నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా పాల్గొన్నారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ, సౌహార్ధ సందేశమిచ్చారు. ఈ సందర్భంగా డి రాజా మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై దాడి పెరిగిందన్నారు. పార్లమెంట్ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పారు.
సభ్యులు ప్రశ్నలు అడిగే స్వేచ్ఛ లేదని అన్నారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ తరహాలోనే త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లోనూ ఈసీ ఎలా పనిచేస్తుందనేది పెద్ద సమస్యగా మారిందన్నారు. ఈసీ అర్హులైన ప్రతి పౌరునికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో సీపీఐ తరపున తాను పిటిషన్ దాఖలు చేశానని గుర్తు చేశారు. భారత్ హిందూత్వ దేశం, మతతత్వ రాజ్యంగా మారితే దేశానికే పెద్ద విపత్తుగా పరిణమిల్లుతుందని అంబేడ్కర్ ఏనాడో హెచ్చరించారని అన్నారు. భారతదేశాన్ని కాపాడాలంటే బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
అందుకే ఇండియా కూటమి ఏర్పాటైందనీ, సీపీఐ కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు దేశ చర్రితలో ఎంతో కీలకమని చెప్పారు. ఈ ఎన్నిక రాజకీయ యుద్ధమని చెప్పారు. ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేశారో తెలియదన్నారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డిని ప్రకటించిందనీ, సీపీఐ కూడా మద్దతు ప్రకటించిందని చెప్పారు. లౌకిక పార్టీలన్నీ ఆయనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. సుదర్శన్ రెడ్డి గెలిస్తే దేశ భవిష్యత్ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందనీ, చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వివరించారు. సీపీఐ స్వతంత్ర బలం పెరగాలనా రాజా ఆకాంక్షించారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీపీఐ ప్రాతినిధ్యం పెరగాలని చెప్పారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎండి యూసుఫ్ అధ్యక్షతన జరిగిన ప్రారంభసభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, పశ్య పద్మ, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి, కె శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖరరావు, సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి, కవి, రచయిత ఏటుకూరి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, కళవేని శంకర్, ఎం బాలనరసింహా, విఎస్ బోస్, ఈటి నరసింహా, ప్రముఖ సినీ నటుడు మాదాల రవి, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు డిజి సాయిల్, ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదంలో ఓటు హక్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES