Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుబడుల్లోనే నర్సరీ టూ ట్వల్త్‌ క్లాస్‌

బడుల్లోనే నర్సరీ టూ ట్వల్త్‌ క్లాస్‌

- Advertisement -

– సీబీఎస్‌ఈ తరహాలో రాష్ట్రంలో బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌
– ఇంటర్‌ బోర్డు రద్దు?
– రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాకమిషన్‌ సిఫార్సులు
– పాఠశాల విద్యలో సంస్కరణలు
– ఎన్‌ఈపీ వైపే మొగ్గు
– కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గుతున్న రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

విద్యావిధానంలో కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతోంది. కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020) అమలు దిశగా రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయి. ఆ మేరకు ఎన్‌ఈపీ మార్గదర్శకాలనే అమలు చేయాలంటూ తెలంగాణ విద్యా కమిషన్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది. అందులో భాగంగా పాఠశాల విద్యాశాఖలో భారీ సంస్కరణలు రాబోతున్నాయి! పాఠశాలల్లోనే నర్సరీ నుంచి 12వ తరగతి (ట్వల్త్‌ క్లాస్‌) వరకు చదువులుండాలని రాష్ట్ర విద్యాకమిషన్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. అయితే ఇది కొఠారి కమిషన్‌ సిఫార్సులకు విరుద్ధం. ఎన్‌ఈపీకి అనుకూలం. 10+2+3 విద్యావిధానం ఉండాలని కొఠారి కమిషన్‌ సూచించింది. ఒకటి నుంచి పదో తరగతి, రెండేండ్లు ఇంటర్‌, మూడేండ్లు డిగ్రీ చదవాలని చెప్పింది.

దాని స్థానంలో 5+3+3+4 విద్యావిధానం అమల్లోకి తేవాలని ఎన్‌ఈపీ సిఫారసు చేసింది. అంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటి, రెండు తరగతులు పునాది విద్య (ఫౌండేషనల్‌), మూడు నుంచి ఐదో తరగతి వరకు సన్నాహక విద్య (ప్రిపరేటరీ), ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు మిడిల్‌ విద్య, తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు సెకండరీ విద్య ఉండాలని సూచించింది. ఎన్‌ఈపీ సిఫార్సులనే రాష్ట్రంలో అమలు చేయాలంటూ తెలంగాణ విద్యా కమిషన్‌ సూచించడం గమనార్హం. అంటే పాఠశాల విద్య పరిధిలోనే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు చదువులుంటాయి. ఈ మేరకు ఇప్పటికే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ఆరుట్ల, నాగర్‌ కర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను విద్యాకమిషన్‌ ప్రారంభించింది. వాటిలో నర్సరీ నుంచి తరగతులున్నాయి. దీన్నిబట్టి రాష్ట్రంలో ఎన్‌ఈపీ చాపకింద నీరులా అమలవుతున్నట్టు అర్థమవుతున్నది.

కేంద్రం కొర్రీలు
విద్యారంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగం క్రమంగా కేంద్రం గుప్పెట్లోకి వెళ్తున్నది. అందులో భాగంగానే రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఏకపక్షంగా ఎన్‌ఈపీని మోడీ ప్రభుత్వం రూపొందించింది. ఎన్‌ఈపీ పేరుతో విద్యార ంగంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాల ను లాక్కుంటూ, దాన్నే అమలు చేయాలని ఒత్తిడి పెంచుతున్నది. మరోవైపు ఎన్‌ఈపీని అమలు చేస్తేనే నిధులిస్తామంటూ కొర్రీలు పెడుతోంది. ఎన్‌ఈపీని వ్యతిరేకించిన కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు సమగ్ర శిక్షా నిధులను విడుదల చేయడం లేదు. కర్నాటక లోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నది. కానీ ఎన్‌ఈపీని అమలు చేయబోమంటూ అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎన్‌ఈపీ అమలుకే మొగ్గు చూపుతున్నది.

ఇంటర్‌ బోర్డు రద్దు!
ఇటీవల కేంద్ర విద్యాశాఖ ఓ సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌కు వేర్వేరుగా బోర్డులు ఎందుకుండాలని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏకీకృత విధానం అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌కు ఒకే బోర్డు ఉండాలని ప్రతిపాదించింది. ఇది ఎన్‌ఈపీలో భాగమే. ఎన్‌ఈపీ సిఫారసులు అమలైతే రాష్ట్రంలో ఇంటర్‌ బోర్డు రద్దయ్యే ప్రమాదముంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. 20 రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌కు ఒకే బోర్డు ఉన్నది. కానీ ఎనిమిది రాష్ట్రాల్లో వేర్వేరుగా బోర్డులున్నాయి. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ వంటివి ఉన్నాయి. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. సీబీఎస్‌ఈ తరహాలోనే బోర్డ్‌ ఆఫ్‌ తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్‌ (బీటీఎస్‌ఈ)ని ఏర్పాటు చేసే అవకాశమున్నది. పదో తరగతి, ఇంటర్‌కు వేర్వేరు బోర్డు, ఒకే బోర్డు ఉన్న రాష్ట్రాల్లో విద్యాశాఖ అధికారులు అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సమర్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ఆదేశించారు. ఎన్‌ఈపీ అమలుకు సీఎం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది.

ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తున్నాం : టి నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
ఎన్‌ఈపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేశంలో, రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నది. అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిని ఆరు వేలకు కుదించాలని తెలంగాణ విద్యా కమిషన్‌ భావిస్తున్నది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ నిర్ణయం విద్యాహక్కు చట్టానికి విరుద్ధం. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి.

విద్యా కేంద్రీకరణ
విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ కోసమే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్‌ఈపీని రూపొందించింది. బీటీఎస్‌ఈ ఏర్పడితే పదో తరగతి, 12వ తరగతి సిలబస్‌తోపాటు ప్రశ్నాపత్రాల రూపకల్పన కూడా జాతీయ స్థాయిలోనే ఉండే ప్రమాదముంది. ఇప్పటికే రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నది. అందులో భాగంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)ని తెచ్చింది. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజినీరింగ్‌, మెడికల్‌ ప్రవేశాలతోపాటు పరీక్షలను నిర్వహిస్తున్నది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను మోడీ ప్రభుత్వం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటున్నది. ఎన్‌సీఈఆర్టీ ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి అనుగుణంగా సిలబస్‌ను రూపొందిస్తున్నది. చరిత్రను వక్రీకరిస్తున్నది. మహాత్మాగాంధీ, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ వంటి స్వాతంత్య్ర సమరయోధుల పాఠ్యాంశాలను తొలగిస్తున్నది. ఇది దేశానికే ప్రమాదకరమని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.

సైద్ధాంతిక వ్యతిరేకత లేదు
బీజేపీ విధానాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం సైద్ధాంతికంగా వ్యతిరేకించడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని పైపైన వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఎన్‌ఈపీ అమలైతే విద్యారంగానికి, విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుంది. విద్య పూర్తిగా కేంద్రీకరణ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ పెత్తనం పెరుగుతుంది. రాష్ట్రాల హక్కులు హరించబడతాయి. ఎన్‌ఈపి రద్దు చేసి రాజ్యాంగ విలువలతో కూడిన ప్రజానుకూల శాస్త్రీయ విద్యావిధానాన్ని రూపొందించాలి.
– చావ రవి, టీఎస్‌యూటీఎఫ్‌ అధ్యక్షులు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad