భారత రిఫైనరీలపై అమెరికా కన్నెర్ర
సంపన్నుల జాబితాలో చేరుతున్నాయంటూ అక్కసు
న్యూఢిల్లీ : రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేయడం అమెరికాకు సుతరామూ ఇష్టం లేదన్న విషయం తెలిసిందే. మన రిఫైనరీలు రష్యా చమురు ద్వారా ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నాయని దాని ఆరోపణ. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూ భారత్ లాభాలు మూటగట్టుకుంటోందని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెస్సెంట్ విమర్శించారు. డిస్కౌంట్ ధరతో రష్యా ముడి చమురును భారత్ కొనుగోలు చేస్తోందని, దానిని ఇంధనంగా శుద్ధి చేస్తోందని, ఆ ఉత్పత్తులను యూరప్ తదితర ప్రాంతాలకు విక్రయిస్తోందని ఆయన చెప్పారు. వారు ఉత్పత్తులను తిరిగి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. భారత రిఫైనరీలు 16 బిలియన్ డాలర్ల మేర అధిక లాభాలు గడించాయని, ఇప్పుడవి భారత్‌లో సంపన్న కుటుంబాలుగా మారాయని అన్నారు.
ఆ రెండు కంపెనీలే లక్ష్యం
అమెరికా విమర్శలు ప్రధానంగా మన ప్రయివేటు రిఫైనరీలను ఉద్దేశించి చేసినవే. ముఖ్యంగా రిలయన్స్ ఇండిస్టీస్, నయారా ఎనర్జీలను అమెరికా లక్ష్యంగా చేసుకొని విమర్శలు సంధిస్తోంది. ఎందుకంటే యూరప్‌కు శుద్ధి చేసిన ఇంధనాన్ని ఎగుమతి చేస్తున్న సంస్థల్లో ఈ రెండు కంపెనీలకే ఎక్కువ వాటా ఉంది. బ్లూమ్‌బర్గ్, కెప్లర్ డేటా ప్రకారం ఈ రెండు రిఫైనరీలు కలిసి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 60 బిలియన్ డాలర్ల విలువ కలిగిన పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేశాయి. వీటిలో 15 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు కేవలం ఈ ఏడాది ప్రథమార్థంలో యూరోపియన్ యూనియన్‌కే వెళ్లాయి. ముకేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ సంస్థ రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌తో 2024 డిసెంబరులో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రిలయన్స్ రోజుకు ఐదు లక్షల బ్యారల్స్ వరకూ దిగుమతి చేసుకుంటోంది. దీని వార్షిక విలువ 12-13 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఒప్పందం కాలపరిమితి పదేండ్లు. నయారా ఎనర్జీలో సుమారు సగం వాటాలు రాస్‌నెఫ్ట్‌వే. ఈ కంపెనీ కూడా రష్యా నుంచి కొనుగోళ్ల పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ ఏడాది చివరి నాటికి నయారా ముడి చమురు కొనుగోళ్లలో 72 శాతం రష్యా నుంచే జరుగుతాయి. 2022లో ఇది కేవలం 22 శాతంగానే ఉంది.
ఎగుమతులూ అధికమే
ఈ రెండు రిఫైనరీల నుంచి జరిగే ఎగుమతులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నయారా కంపెనీ ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో సుమారు 30 లక్షల మెట్రిక్ టన్నులు ఇంధనాన్ని ఎగుమతి చేసింది. ఈ కంపెనీ ఉత్పత్తుల్లో 30 శాతం వరకూ వైటల్, అరామ్‌కో ట్రేడింగ్, షెల్, బీపీ కొనుగోలు చేస్తున్నాయి. ఇదే కాలంలో రిలయన్స్ కూడా 2.1 కోట్ల టన్నుల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. బీపీ, ఎక్సాన్‌మొబిల్, గ్లెన్‌కోర్, వైటల్, ట్రాఫిగురా కంపెనీలు దీని ప్రధాన కొనుగోలుదారులు.
ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత…
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత ఆ దేశం నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు బాగా పెరిగాయి. యుద్ధానికి ముందు రోజుకు 68 వేల బ్యారల్స్ కొనుగోలు మాత్రమే జరగగా 2023 మే నాటికి అది 2.15 మిలియన్ బ్యారల్స్‌కు పెరిగింది. గత నెలలో 1.78 బ్యారల్స్ ముడి చమురు దిగుమతి జరిగింది. ప్రస్తుతం 36 శాతం భారత్ చమురు అవసరాలను రష్యా తీరుస్తోంది. మన దేశంలో ప్రభుత్వ రంగంలోని ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి రిఫైనరీలు కూడా రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే వాటి కొనుగోళ్లు ఎక్కువగా దేశీయ అవసరాలనే తీరుస్తున్నాయి. దీనికి భిన్నంగా ప్రైవేటు రిఫైనరీలు యూరప్, ఇతర మార్కెట్లకు ఇంధనాలను ఎగుమతి చేస్తున్నాయి.
నాడు ప్రోత్సహించి నేడు ఆంక్షలు
ఈ పరిణామాలు సహజంగానే అమెరికాకు కంటగింపుగా మారాయి. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో భారత్‌పై అదనంగా మరో పాతిక శాతం సుంకాలను జరిమానాగా విధించింది. రష్యా నుంచి ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉన్నప్పటికీ అమెరికా దాని జోలికి వెళ్లడం లేదు. అసలు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయాల్సిందిగా 2022లో భారత్‌ను ప్రోత్సహించింది అమెరికాయే. శుద్ధి చేసిన ఇంధనాలను విక్రయించడం భారత్ వాణిజ్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది. 2022-23లో 97.47 బిలియన్ డాలర్లు, 2023-24లో 84.16 బిలియన్ డాలర్లు, 2024-25లో 63.35 బిలియన్ డాలర్ల విలువ కలిగిన పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. నెదర్లాండ్స్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలు భారతీయ ఇంధనాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. యూరప్, పశ్చిమ ఆఫ్రికాలో కూడా కొనుగోలుదారులు ఉన్నారు. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసి, దానికి శుద్ధి చేసి విదేశాలకు విక్రయిస్తూ భారత్ లాభాలు మూటకట్టుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మన ప్రయివేటు రిఫైనరీలపై అమెరికా ఆంక్షలు విధిస్తుందా లేదా అన్నదే ప్రశ్న. రష్యా చమురు నిల్వలు విదేశాలకు తరలిపోవడం అమెరికాను అసహనానికి గురిచేస్తోందని, అదే సమయంలో మన దేశంతో సజావుగా లేని సంబంధాలు కూడా ఆ దేశాన్ని చికాకు పరుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
రష్యా చమురుతో లాభాలు దండుకుంటారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES