Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనిబద్ధత, ఆత్మవిశ్వాసానికి చిరునామాగా మహిళా పోలీసులు

నిబద్ధత, ఆత్మవిశ్వాసానికి చిరునామాగా మహిళా పోలీసులు

- Advertisement -

– వారికి ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తాం
– మహిళా పోలీస్‌ శక్తికి అండగా ఉంటాం : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

నిబద్ధతకు, ఆత్మవిశ్వాసానికి చిరునామా తెలంగాణ మహిళా పోలీసులు అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ(సీతక్క) కొనియాడారు. వృత్తి ధర్మానికి మానవీయతను జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మహిళా పోలీసులకు అండగా ఉంటామనీ, వారికి ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తామని హామీనిచ్చారు. బుధవారం హైదరాబాద్‌ పరిధిలోని రాజేంద్రనగర్‌లో గల రాజ్‌ బహదూర్‌ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీ ప్రాంగణంలో తెలంగాణ మహిళా పోలీస్‌ రాష్ట్రస్థాయి తొలి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మహిళా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డైరెక్టర్‌ జనరల్‌ అధికారులు అభిలాష బిస్త్‌, చారు సిన్హా, శికా గోయల్‌, స్వాతి లక్రాతో పాటు కానిస్టేబుల్‌ నుంచి ఎస్పీ స్థాయి వరకు సుమారు 400 మంది మహిళా పోలీస్‌ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సీతక్క మాట్లాడుతూ..మహిళా పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా సంక్షేమానికి సంబంధించిన సానుకూల నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటారని మంత్రి సీతక్క హామీనిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1973లో కేరళలోని కోజికోడ్‌లో తొలి మహిళా పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారనీ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా మహిళా పోలీస్‌ స్టేషన్లు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ఒకప్పుడు పోలీసులు, తాను భిన్న ధ్రువాలుగా ఉన్నామనీ, మారిన పరిస్థితుల్లో ప్రజాసేవలోకి రావాల్సి వచ్చిందని ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సమాజంలో మహిళల పట్ల ఉన్న చిన్నచూపును అరికట్టే బాధ్యత కూడా పోలీసులపైనే ఉందని నొక్కిచెప్పారు. ఏటా స్పెషల్‌ ట్రైనింగ్‌ నిర్వహించాలనీ, మహిళా పోలీసులకు వీక్లీ ఆఫ్‌, ప్రత్యేక పని వేళల సౌకర్యాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు. మహిళా పోలీసుల కృషిని గుర్తించేలా ప్రత్యేక అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరముందనీ, మెటర్నిటీ, పోస్ట్‌ డెలివరీ కాలానికి తగినట్టుగా తమిళనాడు తరహాలో ప్రత్యేక యూనిఫారాలు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా పోలీసులకు అవసరమైన రెస్ట్‌ రూములు, వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 80 వేల మంది పోలీసుల్లో మహిళా పోలీసులు కేవలం 7 వేల మంది మాత్రమే ఉన్నారనీ, వారి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad