Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రయివేటు సెక్యూరిటీ గార్డుల వేతనాలు పెంచాలి

ప్రయివేటు సెక్యూరిటీ గార్డుల వేతనాలు పెంచాలి

- Advertisement -

జీవో 21ని పట్టించుకోట్లేదు

– అదనపు పని గంటలతో శ్రమ దోపిడీ
– దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న గార్డులు : రాష్ట్ర సదస్సులో ఎం. సాయిబాబు


నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పని చేస్తున్న ప్రయివేటు సెక్యూరిటీ గార్డుల వేతనాలను పెంచాలని ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్సు అండ్‌ అలైడ్‌ వర్కర్స్‌ యూనియన్స్‌ (సీఐటీయూ) రాష్ట్ర సదస్సులో వక్తలు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2021 జూన్‌ 30న విడుదల చేసిన జీవోనెం 21ను గెజిట్‌ చేసి, కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించి, కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వీటి సాధన కోసం సెక్యూరిటీ గార్డ్సు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఈశ్వరరావు అధ్యక్షతన ‘ప్రయివేట్‌ సెక్యూరిటీ గార్డులకు ఉద్యోగ- వేతన భద్రత కల్పించాలి’ అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్సు అండ్‌ అలైడ్‌ వర్కర్స్‌ యూనియన్స్‌ (సీఐటీయూ) జాతీయ కన్వీనర్‌ ఎం. సాయిబాబు మాట్లాడుతూ 12 ఏండ్లుగా సెక్యూరిటీ సర్వీసెస్‌లో కనీస వేతన జీవోను సవరించక పోవడంతో కోటి మందికి పైగా ప్రయివేటు సెక్యూ రిటీ గార్డులు, అనుబంధ హౌస్‌కీపింగ్‌ కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 1500 ఎజెన్సీల్లో ఆరు లక్షల మంది సెక్యూరిటీ గార్డులతోపాటు అనుబంధంగా వివిధ రకాల పనులు చేసే కార్మికులున్నారని తెలిపారు. ఆర్ధిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఉత్పత్తి ప్రక్రియ జరిగే ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ మొదలుకుని ఆ సరుకుల నిల్వ, సోలార్‌ ప్లాంట్స్‌, ట్రాన్స్‌పోర్టు, పంపిణీ జరిగే అన్ని విభాగాల వద్ద గార్డ్సు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలన్నింటిలో వాచ్‌ అండ్‌ వార్డ్‌ డివిజన్స్‌్‌, ఔట్‌సోర్సింగ్‌ పేరుతో ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలే నిర్వహిస్తున్నాయని చెప్పారు.
వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు, ఆస్పత్రులు, విద్యాలయాలు, మెట్రో స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌, గ్రేటెడ్‌ కమ్యూనిటీలు, పబ్లిక్‌ పార్కులు, ప్రార్ధనా మందిరాలు, రెసిడెన్షియల్‌ ఏరియాలు అన్ని చోట్లా ప్రయివేటు సెక్యూరిటీ గార్డులే దర్శనమిస్తారని తెలిపారు. కానీ వారి పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధిక చోట్ల 12 గంటలు పని చేయిస్తున్నారని తెలిపారు. అదనపు గంటలకు ఓటీ ఇవ్వడం లేదని చెప్పారు. ఐడెంటిటీ కార్డ్సు, యూనిఫామ్‌, టార్చ్‌లైట్‌ తదితర రక్షణ పరికరాలకు కార్మికుల నుంచే డబ్బులు వసూలు చేస్తారని తెలిపారు. పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ కూడా కార్మికుల వేతనాల నుంచే యాజమాన్యాల భాగాన్ని రికవరీ చేస్తున్నట్టు అనేక సర్వేల్లో తేలిందని చెప్పారు. రికవరీ అమౌంట్‌ సక్రమంగా డిపాజిట్‌ చేయడం లేదని చెప్పారు. ప్రయివేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీస్‌ (రెగ్యులేషన్‌) చట్టం-2005 ప్రకారం అనేక చట్టబద్ధ ప్రయోజనాలను కనిపించాల్సిన యాజమాన్యాలు, వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
సెక్యూరిటీ కార్మికులు సంఘటితమై పోరాడినచోట, కొన్ని ప్రయోజనాలు దక్కుతున్నాయి తప్ప వేతన భద్రత, ఉద్యోగానికి గ్యారంటీ లేని పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2021 జూన్‌లో ఇచ్చిన సెక్యూరిటీ సర్వీసెస్‌ జీవో కింద సుమారు 4 లక్షల మంది పని చేస్తున్నారని తెలిపారు. ఆ జీవో అమలు కాకపోవడం వల్ల ప్రతి నెలా కార్మికుల లక్షల్లో నష్టపోతున్నారని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సెక్యూరిటీ సర్వీసెస్‌ జీవోను గెజిట్‌ చేసి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సదస్సులో సింగరేణి కాలరీస్‌ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి మధు, ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్సు అండ్‌ అలైడ్‌ వర్కర్స్‌ యూనియన్స్‌ జాతీయ నాయకులు తపన్‌ఘోష్‌, దిలీప్‌, హరిదాసన్‌, రాష్ట్ర కన్వీనర్‌ యాటల సోమన్న, రాష్ట్ర నాయకులు కె.బుజ్జిబాబు, తుమ్మల సాంబయ్య, ఆరోగ్యమ్మ, దామోదర్‌, రామకృష్ణ తదితరులు మాట్లాడారు.

తీర్మానాలివే…
8 ఈ నెల 28న సెక్యూరిటీ గార్డ్సు జాతీయ డిమాండ్స్‌ డే సందర్భంగా అన్ని లేబర్‌ కమిషనర్‌ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపాలి. చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అధికారులకు అందించాలి.
8 ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్స్‌, హౌజ్‌కీపింగ్‌ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు జిల్లా స్థాయి సమావేశాలను కూడా నిర్వహించాలి
8 అన్ని యూనియన్లలో నవంబర్‌లో సభ్యత్వ క్యాంపెయిన్‌ నిర్వహించాలి.
8 సెప్టెంబర్‌, అక్టోబర్‌లో రాష్ట్ర స్థాయి సమావేశాల ద్వారా శ్రామిక మహిళా భద్రతా గార్డుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
8అన్ని యూనియన్లు ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో జరగనున్న సీఐటీయూ 18వ జాతీయ మహాసభను పురస్కరించుకుని 2025 డిసెంబర్‌ 15న సీఐటీయూ జెండాను ఆవిష్కరించాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad