– మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
త్వరలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల మంజూరు చేసి నియామకాలు చేపడుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి కేసులోనూ దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జనాలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తూ, మెడిసిన్ అమ్మకాలు జరుపుతున్న కంపెనీలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పూరియస్, నాట్ స్టాండర్డ్ డ్రగ్స్ తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, అమ్మకందారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మెడిసిన్ అనేది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం అని, ఈ విషయంలో ఎలాంటి ఉపేక్ష పనికిరాదని స్పష్టం చేశారు. పదే పదే నిబంధనలు ఉల్లఘింస్తున్న సంస్థలను చట్టప్రకారం శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించారు. నకిలీ, నిషేధిత మందుల తయారీ, అమ్మకం దారులపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. మెడిసిన్‌ను ఆహార పదార్థాలుగా చూపిస్తూ, వాటి తయారీ, అమ్మకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. యాంటి బయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెద్ద ముప్పుగా పరిణమిస్తోందనీ, నిబంధనలు ఉల్లంఘించి యాంటి బయాటిక్స్ అమ్మకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు ప్రేరేపిత మెడిసిన్ అమ్మకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీసీఏ డీజీని మంత్రి ఆదేశించారు. డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ అప్‌గ్రెడేషన్ పనులను స్పీడప్ చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు క్వాలిటీ మెడిసిన్, క్వాలిటీ ఫుడ్ అందించే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.సమీక్షా సమావేశంలో డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం 2024 జనవరి నుంచి 2025 జులై వరకు సాధించిన ప్రగతిని వివరించారు. 2024లో 25,939 తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 4,142 సంస్థలపై, 2025లో జనవరి నుంచి జులై వరకు 16,481 తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన 2,827 సంస్థలపై చర్యలు తీసుకున్నామన్నారు. 2024 జనవరి నుంచి 2025 జులై వరకు 7,200 మెడిసిన్ నమూనాలను టెస్ట్ చేయగా, అందులో 186 నాసిరకం మెడిసిన్‌గా తేలిందనీ, సంబంధిత సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నట్టు మంత్రికి తెలిపారు. దాదాపు 700 కేసులు నమోదు చేసినట్టు వివరించారు.
త్వరలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES