నవతెలంగాణ గాంధారి: గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామానికి చెందిన రైతు కూలీల కొడుకు రవి కుమార్ ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. బూదవ్వ-రాజయ్య దంపతుల కుమారుడైన రవి కుమార్ ఇప్పటివరకు నాలుగు రాష్ట్ర, రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం లింగంపేట రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రవి త్వరలో గ్రూప్-2 అధికారి కాబోతున్నారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రవి ప్రస్తుతం లింగంపేట రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రవి ప్రాథమిక విద్య జువ్వాడిలోని ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత చదువులు నిజామాబాద్ లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. గ్రూప్ -3, గ్రూప్ -4, పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్ -2 ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మొన్న జరిగిన గ్రూప్ -2 ఉద్యోగాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరైన రవి త్వరలో గ్రూప్ -2 ఉద్యోగిగా నియామక పత్రం అందుకోబోతున్నాడు. రవి ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం తమ గ్రామానికే కాక మండలానికి గర్వకారణం అని జువ్వాడి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.