మొద్దు నిద్ర వీడి యూరియాని అందించండి: బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండెల్లి ఎల్లారెడ్డి
నవతెలంగాణ – దుబ్బాక
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రైతులకు సకాలంలో ఎరువులు అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, రెండు బస్తాల యూరియా ఇవ్వడానికి నెల రోజులు తిప్పుకుంటారా.? అని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు గుండెల్లి ఎల్లారెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వెంటనే రైతులకు సరిపడేంతగా యూరియాని అందించాలని డిమాండ్ చేశారు. గురువారం దుబ్బాక పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో రైతులను కడుపున పెట్టుకొని చూసుకున్నామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోస పెడుతుందని మండిపడ్డారు. ప్రజలు, రైతుల సమస్యల్ని పక్కనపెట్టి.. ఓట్లు, సీట్ల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తుందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఏనాడైనా ఆయన ప్రజల్లో తిరిగితే వారి కష్టసుఖాలు తెలిసేవన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ ప్రాంత రైతులకు సరిపడేంత యూరియాని అందించి రైతుల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డి, గన్నె భూమిరెడ్డి, పల్లె రామస్వామి గౌడ్, బండి రాజు, ఇస్తారీగల్ల స్వామి, ఆస స్వామి, శ్రీనివాస్, దేవుని రాజు, పర్స కృష్ణ, పలువురున్నారు.