Monday, May 5, 2025
Homeదర్వాజసమకాలీన సమస్యలకు కథారూపం

సమకాలీన సమస్యలకు కథారూపం

- Advertisement -

బద్రి నర్సన్‌ మంచి విమర్శకుడు, కథకుడు. పదేళ్ల నుంచి రాస్తున్న 20 కథలను తీసుకొని ‘దారి తెలిసిన మేఘం’ పేరుతో ఒక సంపుటంగా తీసుకువచ్చారు. ఇందులో కొన్ని కథలు మనుషులలో పెనవేసుకుపోయిన బంధాలు – అనుబంధాలు వాళ్ల జీవితాలను ఎలా మలుపు తిప్పుతాయో వివరిస్తాయి. కుటుంబ సంబంధాలు విచ్చిన్నమై కొడుకులే తల్లిదండ్రుల పాలిటి యమకింకరులుగా మారిపోతున్నారని కొన్ని కథలు, పిల్లల్లో ఉన్న అమాయకత్వం వారు ఎదిగే తీరును మరికొన్ని కథలు చిత్రీకరించాయి. విప్లవానంత ధోరణులను కొన్ని కథలు చిత్రించగా, మరికొన్ని కథలు లోకరీతిని తెలియజేస్తాయి.
కారణం లేకుండానే కొంత మందితో అనుబంధం ఏర్పడుతుంది. అలా వెంకటేశ్వర్లు కు కూరగాయలమ్మే యువతి పట్ల లేనిపోని సంబంధాన్ని ఊహించుకొని భార్య ఒకవైపు, కూరగాయలమ్మే యువతి భర్త -ఆ ముసలాడు అంత నచ్చాడా అని వేధిస్తుంటారు. వెంకటేశ్వర్లు మెతకదనం, మంచితనాన్ని గమనించిన ఆ యువతి ఇరు కుటుంబాల మధ్య శాంతి ఏర్పడటానికి తన దుకాణమే వేరే దగ్గరకు మార్చుకొని వెళ్ళిపోతుంది .” ఎంగిలి” కథ ఇది. తెలివైన విద్యార్థి మహేష్‌ చదువు మానకూడదని, ధనవంతుడైన తోటి విద్యార్థి భార్గవ్‌ అతన్ని అన్ని విధాలా ఆదుకుని చదివిస్తుంటాడు. హఠాత్తుగా తండ్రి మరణ వార్త విని ఊరికి వెళ్ళిన మహేష్‌ కు తన తండ్రి నక్సలైట్‌ అనీ, ఒకప్పుడు ఆ ఊరి దొర అకత్యాలు భరించలేక నరికి చంపాడని తెలుస్తుంది. ఆ దొర కొడుకే భార్గవ్‌ అని తెలిసిన తర్వాత, చదువు మానేసి ఏదైనా పని చేసుకుందాం అనుకుంటాడు. కానీ భార్గవ్‌ వెతుక్కుంటూ వచ్చి మన ఇద్దరం ఒకే ఊర్లో పుట్టినా ఎవరికి వారుగా పెరిగాం .మన తండ్రుల మంచి చెడ్డలను వారికే వదిలేద్దాం. మనం స్నేహంతో మన జీవితాలు చక్కదిద్దుకుందాం అని ”కాలజ్ఞానం” కథలో సాంత్వన పలుకుతాడు.” వరశాపం” కథలో ఒక కాలు లేని సులోచనను, రెండు కాళ్లు లేని మేనల్లుడికి ఇచ్చిపెళ్లి చేయాలనుకుంటారు. బ్యాంకులో పనిచేసే సుందర్రావు పెళ్లి చేసుకుంటానని వస్తే, కులం మతం వేరని అవమానించి వెళ్ళగొడతారు. సుందర్‌ రావు ఊరికి వెళ్లిన సమయంలో సులోచనను మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. మేనల్లుడు యాక్సిడెంట్లో చనిపోగా, సులోచన ఊర్లో ఒంటరిగా కాలం వెళ్లదీస్తుంటుంది. సుందర్రావు ఆమెకు నచ్చజెప్పి పెళ్లి చేసుకున్నా ,వారిద్దరి మధ్య దూరాన్ని చెరిపేయలేక పోతాడు.
చిన్నప్పటి స్నేహితులు ఒక్కొక్కరు వద్ధాప్య సమస్యలతో, అనారోగ్యంతో చనిపోతుంటే భయపడిన నారాయణ అలాంటి చావు రాకుండా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వయస్సును, అనారోగ్యాన్ని గుర్తుచేసుకొని కుమిలిపోవడం కాదు. మానసిక ఉత్సాహంతో జీవితాన్ని ప్రేమిస్తూ సద్వినియోగం చేసుకోవాలనే సందేశాన్ని ” చావునీడ” కథ ఇస్తుంది. బతకడానికి పట్టణానికి వచ్చిన దంపతులలో సావిత్రి పనిమనిషిగా, భర్త రాజలింగం ఏటీఎం గార్డుగా కుదురుకుంటారు. కర్కశమైన యజమానుల ధోరణులతో ఉద్యోగాలు పోగొట్టుకున్నా ,భవిష్యత్తు మీది భరోసాతో ముందుకు సాగిపోవడం ” పండుగ” లో కనిపిస్తుంది. విడిపోయిన పెన్‌ ఫ్రెండ్స్‌ విచిత్రంగా కలుసుకోవడం ”సుమిత్ర” కథలో చూడవచ్చును. ఎవరి పట్ల ఎలా బంధం ఏర్పడుతుందో, అవి అనుబంధాలుగా ఎలా రూపుదాలుస్తాయో ఈ కథలు వివరించాయి.
రోజురోజుకు కుటుంబ విలువలు నాశనమవుతున్నాయి. పిల్లలు డబ్బు కోసం, ఆస్తుల కోసం తల్లిదండ్రులను పీడించడం మామూలు అయిపోయింది. కొడుకులు తల్లిదండ్రులకు నయానో భయానో నచ్చజెప్పడం లేదా బెదిరించడం, చివరకు చేయి చేసుకోవడం కూడా జరుగుతున్నది. ప్రేమలు – బంధాలు ఏవి లేకుండా పోతున్నాయి. ఇంకో కథలో ముసలి తల్లి బాధ్యతలు ముగ్గురు కొడుకులు సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకుంటారు. ఉన్న ఇల్లు అమ్మకానికి పెట్టి , పెద్ద కొడుకు తన వంతుగా ” జేష్ఠపాలు” ను డిమాండ్‌ చేయగా సగభాగం పెద్దవాడికి ,మిగతా సగభాగంలో ఇద్దరు తమ్ముళ్లు పంచుకుంటారు. తల్లిని ఎవరూ చూడటానికి ఇష్టపడక వద్ధాశ్రమంలో చేర్పిస్తారు. చివరకు ఆమె అక్కడ చనిపోతే అంత్యక్రియల బాధ్యత నుండి పెద్ద కొడుకు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఊరి వాళ్ళు వచ్చి ఆస్తిలో జేష్ఠపాలు కాదు. బాధ్యతల్లో నీదే జేష్ఠపాలు . తల్లికి అంత్యక్రియలు నీవే నిర్వహించాలని పట్టుబడడంతో పెద్దవాడికి ఒప్పుకోక తప్పలేదు. అలాగే చావు, అంత్యక్రియల సందర్భంగా చేసే ”కర్మకాండ” లకు మన ఇంట్లో, చుట్టుపక్కల వారిలో ఉన్న మూఢనమ్మకాలు, వింత ఆచారాలు – సంప్రదాయాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికే ఉపకరిస్తాయి. ఇంట్లో వాళ్ళ చిన్నప్పటి ప్రేమలు, కాలంతోపాటు పెరగకుండా ద్వేషంగా నలుగురిలో పరువు తీసే అంత కసిగా మారిపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. పెళ్లిళ్లు కాగానే తోడబుట్టిన మగవాళ్లు మారిపోతారని ఆడబిడ్డలు, ఆడపిల్లలు పెళ్లయిన తర్వాత పుట్టింటిని పట్టించుకోరని మగవాళ్లు, ఒకరిమీద ఒకరు ఆడిపోసుకోవడం మామూలు అయిపోయింది.
‘దారి తెలిసిన మేఘం’ కథలో కాషాయ పార్టీ భావజాలం నింపుకున్న తమ్ముడు, అక్క ముస్లిం ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోగలుగుతాడా? చివరకు అక్కతో బంధుత్వం తెంచుకోవడానికే సిద్ధపడతాడు. కాషాయ పార్టీలో చేరకపోయినా హిందూ అమ్మాయి, ఒక ముస్లింని పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. వాళ్ళు కలిసి బతకడం కూడా అంత సులువేం కాదు. ‘ఈ శిక్ష మాకొద్దు’ కథలో, ఉరిశిక్షపడిన నిందితులను ఉరితీయడానికి తలారి కుటుంబాలు ఉంటాయి. ఒక తలారి ముసలివాడు కావడంతో, కొడుకు ఇస్మాయిల్‌కు ఆ పని అప్పచెబుతాడు. ఇస్మాయిల్‌కు తన చేతుల మీదుగా ఉరితీసి చంపడం భరించలేక పోతాడు. ఆ మానసిక సంఘర్షణను తట్టుకోలేక ఒక అడ్వకేట్‌ ద్వారా మెజిస్ట్రేట్‌ను కలుస్తాడు. ఉరితీత మీద అందరూ కలిసి చర్చించి, ఇష్టం లేని ఇస్మాయిల్‌ ను వదిలేస్తారు. కథకుడు ఈ కథలో ఉరిశిక్షలను చర్చకు పెట్టడం బాగుంది.
విప్లవ కాలంలో అమాయకులపై కొనసాగిన పోలీసు హింసను ఒక కథ వివరించగా, ఒకప్పుడు విప్లవం కోసం పోరాడిన వాళ్ళు విప్లవానంతరం స్వార్ధపరులుగా, కెరీరిస్టులుగా ఎలా మారిపోయారు మరో కథ తెలియజేస్తుంది. ఇంకా ‘ఎనిమిదో అడుగు, మరక మంచిదే, ద్వేష భక్తి, జానకి విముక్తి’ మొదలైన కథలు సామాజికాంశాలతో మలిచారు.
సమకాలీన సంఘటనలను – సమస్యలను తీసుకుని వాటిని కథలుగా మలచడంలో బద్రి నర్సన్‌ మంచి ప్రతిభను కనబరిచారు. ఆసక్తికరమైన కథా కథనాలతో ఇవి పాఠకున్ని హాయిగా చదివింపజేస్తాయి. సమస్యల పట్ల రచయితకున్న సానుకూల ధోరణి, వాటిని సంస్కరించాలనే తపన, సుఖాంతం చేయడం వైపుకు ఉన్న మొగ్గు వల్ల ఈ కథలు అనుకోకుండా ఆదర్శవాద ధోరణిని సంతరించుకున్నాయి. ఆదర్శవాద ధోరణితో పాటు కొసమెరుపు కథలుగా వీటిని చిత్రించే ప్రయత్నంలో, కొన్ని కథలు సినిమాటిక్‌గా రూపొందడంలో ఆశ్చర్యమేమున్నది.

  • కె. పి అశోక్‌ కుమార్‌, 9700000948
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -