పోలీసుల పహారాలో ఎరువుల పంపిణీ
నవతెలంగాణ – కట్టంగూర్
అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఎరువుల కోసం నానతిప్పలు పడాల్సి వస్తుంది. సరైన సమయంలో ఎరువులు దొరకక పంటలకు వేయకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని అన్నదాత ఆవేదన పడుతున్నాడు. మండలంలో 22 గ్రామాల పరిధిలో రైతులు మొత్తం 23 వేల ఎకరాలలో వరి, 11 ఎకరాలలో పత్తి పంట సాగు చేస్తున్నారు. ఈ పంటలకు 2400 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాగా పై అధికారులకు ఇండెంట్ పెట్టినట్లు చెప్పారు. కాగా ఇప్పటివరకు 1800 మెట్రిక్ టన్నుల యూరియా మండలానికి వచ్చిందని మొత్తం రైతులకు పంపిణీ చేశామని వారు చెప్తున్నారు.
ఇంకా మండలానికి 600 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. ఈ యూరియా సరైన సమయంలో రాకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఈ క్రమంలో గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘానికి ఒక లోడు (330 బస్తాలు) యూరియా రావడంతో రైతులు భారీగా సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని క్రమబద్ధీకరించి వచ్చిన రైతులకు ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున వ్యవసాయ శాఖ అధికారి గిరిప్రసాద్, బ్యాంకు సిబ్బంది పంపిణీ చేశారు.
మూడు ఎకరాల్లో వరి వేసాను: మద్దెల అంజయ్య, రైతు కట్టంగూర్
మూడు ఎకరాలలో వరి పంట వేశాను. ఆరు బస్తాల యూరియా కావాలని వస్తే రెండు బస్తాలే ఇచ్చారు. మిగిలిన నాలుగు బస్తాలు ఎప్పుడు వేయాలో తెలియడం లేదు. అదును తప్పితే పంట దిగుబడి తగ్గిపోతుంది. యూరియా ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయాలి.